
కోల్‌కతా : Kolkata నగరంలోని ముల్లిక్ బజార్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి అత్యంత భయానకంగా ఏడో అంతస్థుపై నుంచి దూకి, తీవ్ర గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళం, ఆసుపత్రి సిబ్బంది, ఇతర సహాయక బృందాలు చాలా శ్రమించినప్పటికీ, ఆయనను సురక్షితంగా క్రిందకు దించలేకపోయారు.
కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముల్లిక్ బజారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుజిత్ అధికారి చికిత్స పొందుతున్నారు. ఆయన ఏడో అంతస్థులోని తన పడక నుంచి తప్పించుకుని కిటికీ గుండా పాకుతూ గోడ బయట ఉండే గుమ్మటంపైకి ఎక్కి కూర్చున్నారు. అక్కడ దాదాపు రెండు గంటలపాటు ఉన్నారు. ఆయనను గమనించిన ఆసుపత్రి సిబ్బంది, ఆ మార్గంలో వెళ్తున్నవారు ఆయనను తిరిగి పడకపైకి రావాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. నేలపైన మెత్తని సోఫాల వంటివాటిని ఏర్పాటు చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బంది (Fire Brigade), ఆసుపత్రి అధికారులు ఆయనను క్రిందకు సురక్షితంగా దించేందుకు విపరీతంగా శ్రమించారు. ఓ నిచ్చెనను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ నిచ్చెనను తన వద్దకు తీసుకొస్తే, తాను క్రిందకు దూకుతానని ఆయన బెదిరించారు. దీంతో నిచ్చెనను ఆయన దగ్గరికి చేర్చలేకపోయారు.
రెండు గంటలపాటు ఆ గుమ్మటంపైనే కూర్చున్న ఆయనను సురక్షితంగా దించడం కోసం విపత్తు నిర్వహణ సిబ్బంది ఓ వలను బిగించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఆయన చివరికి క్రిందకు దూకేశారు. ఆయన నేలపై పడే ముందు, రెండుసార్లు గుమ్మటాలను గుద్దుకున్నారు. దీంతో ఆయన తలకు అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయి. ఎముకల గూడు దెబ్బతింది.
ఆయన కుటుంబ సభ్యులు ఈ దారుణ సంఘటనతో భయాందోళనకు గురై, తీవ్రంగా విలపించారు.
ఇవి కూడా చదవండి