HYD : చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడు దొరికాడిలా..!

Jul 11 2021 @ 12:29PM

  • మరో చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి..
  • అడవిలోకి పారిపోయిన కేటుగాడు
  • నాగారం అడవి సమీపంలో అరెస్టు

హైదరాబాద్‌ సిటీ : మూడున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్‌, లైంగిక దాడి ఘటనలో రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఒడిషాకు చెందిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. జవహర్‌నగర్‌ పరిధిలో ఈ నెల 4న చిన్నారిని కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేశాడు.  ఈ ఘటనను నిరసిస్తూ మహిళా, ప్రజా సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలిపాయు. సుమారు 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం మరో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. 


మేస్త్రీ పనులు చేస్తూ.. 

ఒడిషాకు చెందిన అభిరామ్‌దాస్‌ అలియాస్‌ అభి 12 ఏళ్ల క్రితం భార్యతో కలిసి నగరానికి వచ్చి మేస్త్రీ పనులు చేస్తున్నాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఎనిమిది ఏళ్ల క్రితం భార్య వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కీసర మండలం బండ్లగూడ 60 యార్డు కాలనీలో ఉంటున్నాడు. పని చేస్తే వచ్చే డబ్బులతో తాగుడుకు, చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. 


పథకం ప్రకారం... 

చిన్నారులను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడాలనే ఆలోచనతో ఈనెల 4న మధ్యాహ్నం 3:30- 4:00 గంటల ప్రాంతంలో జవహర్‌నగర్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో తిరిగాడు. ఒంటరిగా వారి కిరాణా దుకాణానికి నడుచుకుంటూ వెళ్తున్న మూడున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 6:30 గంటలకు దమ్మాయిగూడ ప్రగతినగర్‌లోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద పడేసి వెళ్లాడు.  పాప కోసం వెతికిన కుటుంబసభ్యులు రాత్రి 9:30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయాన్నే వాటర్‌ ట్యాంక్‌ వద్ద అపస్మారక స్థితిలో చిన్నారి పడి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూశారు. మల్కాజిగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ లైంగిక దాడి జరిగిందని ధ్రువీకరించారు.

మరో చిన్నారి కోసం వచ్చి...

అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గా లింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీలను, చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసుల బృందాలు జల్లెడ పట్టాయి. నిందితుడు ఎర్ర టీ షర్ట్‌, అదే రంగు నైట్‌ ప్యాంట్‌, నల్ల మాస్క్‌ ధరించి అదే ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణానికి వచ్చి సిగరెట్‌ కొనుక్కున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక రోదించింది. ఆమె తల్లి బయటకు రావడం, ఇరుగుపొరుగు వారు గమనించడంతో నిందితుడు పరుగు పెట్టాడు. నాగారం సమీపంలో ఉన్న ఐకామ్‌ కంపెనీ వెనుక ఉన్న రిజర్వు ఫారెస్టులోకి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. అక్కడి వారు చెప్పిన వివరాల ప్రకారం ఎర్ర టీషర్ట్‌, నల్లమాస్క్‌, ఎర్ర నైట్‌ ప్యాంట్‌ ధరించిన వ్యక్తి కోసం సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. ప్రత్యేక బృందాలు నిందితుడు పారిపోయిన ఫారెస్‌ పరిసరాల్లో మకాం వేశాయి. ఎట్టకేలకు నిందితుడిని నాగారం రిజర్వు ఫారెస్టు వద్ద కట్టమైసమ్మ ఆలయం సమీపంలో పట్టుకున్నారు. పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి విచారింగా, నేరాన్ని అంగీకరించాడు.

బీజేపీ మహిళా మోర్చా ధర్నా

పసిపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌  చేస్తూ సేవ్‌ గర్ల్స్‌ నినాదంతో బీజేపీ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం రాచకొండ కమిషనరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. మోర్చా జిల్లా అధ్యక్షురాలు గీతామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ పసిపిల్లలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. దమ్మాయిగూడలో దాడి జరిగిన బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉందన్నారు. ఇప్పటి వరకు కిడ్నాపైన, అదృశ్యమైన ఆడపిల్లలు, మహిళలు ఎంతమంది దొరికారో, ఇంకా ఆచూకీ లభించనివారు ఎంతమందో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు విజయలక్ష్మి, మహేశ్వరి, రుద్ర, సాహితీ, విక్రమరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మెరుగైన వైద్యం చేయించండి: లింగాయత్‌ ఫెడరేషన్‌

ప్రభుత్వం చిన్నారికి మెరుగైన వైద్యం అందించాల ని తెలంగాణ వీరశైవ లింగాయత్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఫెడరేషన్‌ నేతలు శివ శరణప్ప, పి.మధుశేఖర్‌, ఎ.ఈశ్వర్‌ప్రసాద్‌, కె.గుండప్ప, పి.శ్రీనివాస్‌, ఎస్‌.సిద్దేశ్వర్‌, కె.రాజేశ్వర్‌, సీ.హెచ్‌.బసవరాజ్‌, సీ.హెచ్‌.బద్రినాథ్‌ తదితరులు మాట్లాడారు. తక్షణమే బాలిక కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్ర్‌గేషియా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.   


‘చదువుకు ఏర్పాట్లు చేయాలి’

అత్యాచారానికి గురైన చిన్నారికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర వీరశైవ లింగాయత్‌, లింగ బలిజ సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, అధ్యక్షులు సంగమేశ్వర్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆమె చదువులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దుండగులపై దిశ, నిర్భయ, పొక్సో చట్టాల కింద కేసులు నమొదు  చేయాలని డిమాండ్‌ చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.