గిరిజనాభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-16T06:47:17+05:30 IST

గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అల్లూరి సీతారామరాజు పేరిట గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

గిరిజనాభివృద్ధికి పెద్దపీట
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

గిరిజనులకు జిల్లా వ్యాప్తంగా లక్షా 845 ఎకరాల అటవీ భూములకు హక్కులు

పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం

రూ.17 కోట్లతో 33 పీహెచ్‌సీల అభివృద్ధి

పేదలకు ఇళ్ల పథకంలో 49 లేఅవుట్‌ల్లో 1,097 ఇళ్లు

పోలవరం నిర్వాసితులకు 22 పునరావాస కాలనీల నిర్మాణం

స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

పాడేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అల్లూరి సీతారామరాజు పేరిట గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజనులకు ప్రత్యేకంగా జిల్లాను ఏర్పాటు చేస్తే వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక అవకాశాలుంటాయనే ఆలోచనతో ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట పాడేరు కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. అటవీ హక్కుల చట్టంలో భాగంగా గిరిజనులకు జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 845 ఎకరాల అటవీ భూములకు హక్కులు కల్పించామన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.85 కోట్ల వ్యయంతో 70 కిలోమీటర్ల రోడ్డు, రూ.7 కోట్ల వ్యయంతో 60 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నారన్నారు. అలాగే 33 పీహెచ్‌సీలను రూ.17 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు గానూ 90 శాతం రాయితీపై 14 వేల క్వింటాళ్ల వరి, 4,500 క్వింటాళ్ల రాగి విత్తనాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఏజెన్సీలో మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా విరివిగా బర్త్‌ వెయింట్‌ హాళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. పాడేరులో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నామని, పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా 49 లేఅవుట్‌ల్లో 1,097 ఇళ్లు, అలాగే 13,556 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ప్రధాన మంత్రి వన్‌ధన్‌ యోజన పథకంలో భాగంగా పాడేరు ఐటీడీఏ పరిధిలో 98, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 110 వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాస ప్యాకేజీలో భాగంగా 44 గ్రామాలకు చెందిన 5,618 నిర్వాసిత కుటుంబాలకు రూ.800 కోట్ల వ్యయంతో 22 పునరావాస కాలనీలు నిర్మిస్తున్నామని, అలాగే నిర్వాసితులకు రూ.350 కోట్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో ఇటీవల సంభవించిన వరదల్లో బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతోపాటు తక్షణ సాయంగా 33 వేల కుటుంబాలకు రూ.6 కోట్ల 77 లక్షలు పంపిణీ చేశామన్నారు. అంతకు ముందు మంత్రి అమర్‌నాథ్‌.. పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్‌పీ సతీశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, ఐటీడీఏ ఏపీవోలు ప్రభాకరావు, వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, టీడబ్ల్యూ డీడీ ఐ.కొండలరావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:47:17+05:30 IST