అనుభవానికి గుర్తింపు!

ABN , First Publish Date - 2022-04-11T05:43:45+05:30 IST

మంత్రివర్గంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చోటు దక్కింది. సాలూరు ఎమ్మెల్యే పీడికి రాజన్నదొర మంత్రిగా ఎంపికయ్యారు.

అనుభవానికి గుర్తింపు!
సీఎంవో నుంచి వచ్చిన ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజన్నదొర

రాజన్నదొరకు కేబినెట్‌లో చోటు!

నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం

సాలూరు నియోజకవర్గానికి దక్కిన అదృష్టం

సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు

అనుచరవర్గంతో రాజధానికి పయనం

(పార్వతీపురం/సాలూరు)

మంత్రివర్గంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చోటు దక్కింది. సాలూరు ఎమ్మెల్యే పీడికి రాజన్నదొర మంత్రిగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అధిష్ఠానం నుంచి ఆదివారం ఆయనకు పిలుపు వచ్చింది.. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం అనుచరవర్గంతో రాజన్నదొర రాజధాని బయలుదేరి వెళ్లారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజన్నదొర జగన్‌ వెంట నడిచారు. వరుసగా మూడుసార్లు ఆయన గెలుపొందుతూ వచ్చారు. కష్టకాలంలో కూడా పార్టీలో కొనసాగారు. 2019లో జగన్‌ తొలి కేబినెట్‌లో రాజన్నదొరకు బెర్త్‌ ఖాయమని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి పదవి వరించింది. అటు తరువాత విస్తరణలో పదవి ఖాయమని ఊహాగానాలు వచ్చాయి. రకరకాలుగా సామాజిక సమీకరణల నేపథ్యంలో చివరికి రాజన్నదొరను ఎంపిక చేశారు. రాజన్నదొరది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీలో మర్రివానివలస ఈయన స్వగ్రామం. తండ్రి లక్ష్మయ్య మక్కువ ఎంపీపీగా వ్యవహరించారు. జీసీసీ అధికారిగా పనిచేసిన రాజన్నదొర  స్వచ్ఛంద  ఉద్యోగ విరమణ చేసి 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సాలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. కొద్దికాలానికే భంజ్‌దేవ్‌ రిజర్వేషన్‌పై కోర్టులో ప్రతికూల తీర్పు రావడంతో పదవి కోల్పోయారు. అప్పటికే ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న రాజన్నదొరను కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. అటు తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన రాజన్నదొర గెలుపొందారు. వైఎస్‌ అకాల మరణం తరువాత జగన్‌ నేతృత్వంలోని వైసీపీ గూటికి చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. రిజర్వేషన్‌తో పాటు సీనియార్టీ మంత్రిగా ఎంపికకు మార్గం సుగమం చేసింది. రాజన్నదొర ఎంపికతో సాలూరు నియోజక వర్గానికి అమాత్య పదవి వరించడం రెండోసారి. తొలిసారిగా ఎన్టీఆర్‌ కేబినెట్‌లో సాలూరు ఎమ్మెల్యే బోయిన రాజయ్య మంత్రిగా వ్యవహరించారు.

  హర్షాతిరేకాలు

రాజన్నదొర భార్య రోజమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా రాజన్నదొరతో పాటు ఆయన కుటుంబసభ్యులు సాధారణ జీవితంతోనే గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయన భార్య రోజమ్మ ఆటోలోనే పాఠశాలకు వెళుతుంటారు. సమయపాలన విధిగా పాటిస్తారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన రాజన్నదొర విద్యాధికుడు. ఆయన భార్య నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలను పేరుపేరున పిలిచే అలవాటు ఆయన సొంతం. నియోజకవర్గంలో ఏ చిన్నపాటి కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరవుతారు. అటువంటి వ్యక్తి మంత్రిగా ఎంపికైనందున రాజకీయాలకతీతంగా ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మక్కువ మండలం శంబర జడ్పీ పాఠశాలలో రాజన్నదొర విద్యాభ్యాసం సాగింది. 10వ తరగతి వరకు మక్కువలో, ఇంటర్‌, డిగ్రీ శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చదివారు. ఆంఽధ్రా యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్‌లో పట్టా పొందారు.  చదువు పూర్తయిన తరువాత కొన్నాళ్ల పాటు వ్యవసాయం కూడా చేశారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటికి కేసులు ఏమీ లేవు. వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు లేవు. అసెంబ్లీ షెడ్యూల్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ సభ్యునిగా 2006 నుంచి 2008, 2010- 2011 వరకు పనిచేశారు. అసెంబ్లీ కమిటీలో పీయూసీ, అంచనాల కమిటీతో పాటు వివిధ కమిటీలో సభ్యునిగా పనిచేశారు.   

ప్రజలకే అంకితం 

నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు వచ్చిన ఈ మంత్రి పదవిని  ప్రజలకు అంకితమిస్తున్నట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. కేబినెట్‌లో స్థానం కల్పిస్తున్నట్లు ఆదివారం సీఎంవో కార్యాలయం నుంచి  ఆయనకు  నుంచి ఫోన్‌ వచ్చిన అనంతరం  స్థానిక విలేఖర్లతో  మాట్లాడారు. తన రాజకీయ జీవితం దివంగత నేత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ప్రారంభ మైందన్నారు. తాను రాజశేఖరరెడ్డి భక్తుడునని,  జగన్‌  సైనికుడినని తెలిపారు. అంబేడ్కర్‌ కలలు కన్న రాజ్యాంగం రాష్ట్రంలో అమలు జరుగుతుందని తెలిపారు. సచివాలయ, వలంటరీ వ్యవస్థలే ఇందుకు నిదర్శనమన్నారు.  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న బోయిన రాజయ్యకు మంత్రిగా అవకాశం ఇస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు  తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు  నమ్మకాన్ని నిలుపుకుంటానని తెలిపారు. 

 

Updated Date - 2022-04-11T05:43:45+05:30 IST