పల్లెల్లో ఆటకు చోటు

ABN , First Publish Date - 2022-05-29T05:25:48+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతీ గ్రామంలో ఎకరం నుంచి రెండెకరాల వరకు స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

పల్లెల్లో ఆటకు చోటు
సదాశివనగర్‌లో క్రీడా స్థలాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ సాయన్న

- ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు

- స్థలాల అన్వేషణలో అధికారులు

- జూన్‌ 2న ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల ప్రారంభానికి సన్నాహాలు

- పనుల్లో నిమగ్నమైన అధికారులు


కామారెడ్డి, మే 28: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతీ గ్రామంలో ఎకరం నుంచి రెండెకరాల వరకు స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నాటికి ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల పనులను పూర్తిచేసి ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, ఇతరశాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థలాల గుర్తింపు కొనసాగుతుంది. వాటిని చదునుచేసి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తొలుత ప్రతీ మండలానికి రెండు

జూన్‌ 2 నాటికి ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులంతా పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామానికి అర కిలో మీటరు పరిధిలోనే క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తిస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ కోర్టుల ఏర్పాటుతో పాటు ఎంట్రన్స్‌లో ఆర్చి నిర్మాణం, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆయా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రీడా సామగ్రి మాత్రం ప్రభుత్వమే అందించనుంది. కొన్ని గ్రామాల్లో స్థలాల విషయంలో ఇబ్బందులు ఎదువుతున్నాయి. అయినప్పటికీ ఎంపీడీవోలు అక్కడే ఉండి స్థలాల గుర్తింపు పనుల నిర్వహణలో భాగస్వామ్యులవుతున్నారు.

క్రీడా ప్రాంగణానికి రూ.4.20లక్షల కేటాయింపు

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రామాల్లోని పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ఎకరం నుంచి రెండెకరాల విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో ప్రాంగణానికి ఉపాధిహామీ కింద రూ.4.20లక్షలు కేటాయించనున్నారు.


ప్రతీ గ్రామంలో క్రీడా స్థలం

- ప్రభాకర్‌, డీపీవో, కామారెడ్డి

ప్రతీ గ్రామంలో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నాటికి ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల పనులను పూర్తిచేసి ప్రారంభించాలని ఆదేశించింది. ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

Updated Date - 2022-05-29T05:25:48+05:30 IST