142 Years in Jail: కోర్టు ఇతనికి 142 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. చేసిన తప్పేంటంటే..

ABN , First Publish Date - 2022-10-02T01:19:01+05:30 IST

కేరళలోని పాతనమిట్టలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. పదేళ్ల చిన్నారిపై రెండేళ్ల పాటు అమానుషంగా అత్యాచారానికి పాల్పడి..

142 Years in Jail: కోర్టు ఇతనికి 142 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. చేసిన తప్పేంటంటే..

పాతనమిట్ట: కేరళలోని పాతనమిట్టలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. పదేళ్ల చిన్నారిపై రెండేళ్ల పాటు అమానుషంగా అత్యాచారానికి పాల్పడి.. ఆ బాలికను చిత్రహింసలకు గురిచేసిన కామాంధుడికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రిన్సిపల్ జడ్జి జయకుమార్ జాన్ ఈ తీర్పును వెల్లడించారు. బాబు అలియాస్ పీఆర్ ఆనందన్ వయసు 41 సంవత్సరాలు. పదేళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో మార్చి 20, 2021న తిరువళ్ల పోలీసులు ఇతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆ బాలికకు బంధువైన బాబు ఆ పాప, పాప తల్లిదండ్రులతో కలిసి అదే ఇంట్లో ఉండేవాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. 2019 నుంచి 2021 వరకూ ఆ పైశాచిక చర్యకు పలుమార్లు పాల్పడ్డాడు. అయితే.. చిన్నారి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి.. రాత్రుళ్లు ఆ చిన్నారి ఏడవడం చూసి విషయమేంటో అడిగి తెలుసుకుంది. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఆ పాప తల్లి భర్తకు చెప్పింది. దీంతో.. బాబుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మెడికల్ రికార్డ్స్‌ను పరిశీలించి విచారించిన అనంతరం ఈ కేసులో తీర్పును వెలువరించారు.



పాతనమిట్ట జిల్లా పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ.. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రిన్సిపల్ పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకెట్ జాసన్ మాథ్యూస్ వాదనలు వినిపించారని.. ఆధారాలన్నీ ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా ఉండటంతో బాబుకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. తిరువళ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరిలాల్ బాబుపై కేసు నమోదు చేసి, విచారణ చేశారు. కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలా మొదలైన కేసులో తుది తీర్పు వెల్లడైంది.

Updated Date - 2022-10-02T01:19:01+05:30 IST