మళ్లీ జమాబందీ!

ABN , First Publish Date - 2022-10-01T09:59:31+05:30 IST

జమాబంది.. గ్రామంలో భూముల రికార్డులు, పంటల సాగు, రెవెన్యూ అంశాలను క్రోడీకరించి.. భూమికి పక్కా లెక్క తేల్చే కార్యక్రమం. వాస్తవానికి 40 ఏళ్ల కిందటే రెవెన్యూశాఖ ఈ కార్యక్రమాన్ని వదిలేసింది. ఇప్పుడు మరోసారి ఈ కార్యక్రమాన్ని

మళ్లీ జమాబందీ!

రెవెన్యూశాఖ సన్నాహాలు.. 40 ఏళ్ల తర్వాత అమల్లోకి

ఈసారి చట్టబద్ధతకు నిర్ణయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జమాబంది.. గ్రామంలో భూముల రికార్డులు, పంటల సాగు, రెవెన్యూ అంశాలను క్రోడీకరించి.. భూమికి పక్కా లెక్క తేల్చే కార్యక్రమం. వాస్తవానికి 40 ఏళ్ల కిందటే రెవెన్యూశాఖ ఈ కార్యక్రమాన్ని వదిలేసింది. ఇప్పుడు మరోసారి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏపీ భూమి హక్కుల చట్టం(ఆర్‌వోఆర్‌)లో మార్పులు చేసి చట్టబద్ధంగా ఏటేటా ఈ కార్యక్రమం అమలు చేయాలని సన్నహాలు చేస్తోంది. త్వరలో విధివిధానాలు రూపొందించి సర్కారు ఆమోదానికి పంపించనున్నట్లు తెలిసింది. బ్రిటిష్‌ కాలంతోపాటు 1982 వరకు జమాబంది కార్యక్రమం జరిగేది. రెవెన్యూ యంత్రాంగం ప్రతి పంటకాలానికీ గ్రామాలకు వెళ్లి సాగయ్యే భూములు, పంటలు, భూముల రికార్డులను తాజా పరిచేవారు. ఆ తర్వాత రూపొందించే ఒక రికార్డును గ్రామంలో, మరో రికార్డును జిల్లా రికార్డు రూమ్‌కు పంపించేవారు. దీనివల్ల గ్రామంలో ఏ భూమి ఎవరి అధీనంలో ఉంది? హక్కు దారు ఎవరు? కౌలు దారులు ఎవరు? ఒక ఫసలీలో గ్రామంలో ఎంత భూమి సాగులోకి వచ్చింది? రైతులు ఏయే పంటలు పండించారన్న వివరాలు తెలిసేవి. 1982 తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కరాణాల వ్యవస్థ, భూమిశిస్తు విధానం రద్దవడంతో ఇది కూడా నిలిచిపోయింది. దీంతో అప్పటికి అందుబాటులో ఉన్న పథకాలతో సాగు వివరాలు తీసుకునే వారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2016లోనే జమాబంది అధికారికంగా నిర్వహించాలని సర్కారు భావించింది. అది పలు కారణాలతో ముందుకు సాగలేదు.


దీంతో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ రికార్డులను తాజా పరచడంతోపాటు ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. కౌలుచట్టంలో మార్పులు తెచ్చి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. దీంతోపాటే గ్రామీణ ప్రాంతాల్లో పంటల సాగు వివరాల నమోదుకు ఈ-క్రాప్‌ పథకాన్ని తెచ్చారు. రైతు బీమాతోపాటు పంట నష్టపరిహారం చెల్లింపు  వంటి అంశాలకు ఈ-క్రాప్‌ పనికొస్తుంది. ఇప్పుడు రెవెన్యూశాఖ మరో అడుగు ముందుకేసి జమాబందీని కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా గ్రామంలో భూమి రికార్డులను తాజా పరచి 1-బీ రిజిస్టర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గ్రామ సచివాలయాల్లో 1-బీలు అందుబాటులో ఉంటే ఏది ఎవరి భూమి అనే స్పష్టత ఉంటుందని రెవెన్యూశాఖ అధికారులు భావిస్తున్నారు. జమాబందీలో భాగంగా రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ప్రకటించాలని, నిషేధిత భూముల జాబితాను అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2022-10-01T09:59:31+05:30 IST