లోయలో హత్యల పరంపర

ABN , First Publish Date - 2022-06-03T08:37:47+05:30 IST

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కశ్మీర్‌ పండిట్లతో పాటు హిందువులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నారు.

లోయలో హత్యల పరంపర

ఉదయం బ్యాంకు మేనేజర్‌.. రాత్రి వలస కార్మికుడు!..

కాల్చి చంపిన ఉగ్రవాదులు

కశ్మీరులోని కుల్గామ్‌, బుద్గామ్‌ జిల్లాల్లో ఘటనలు..

లక్షిత హత్యలను కొనసాగిస్తున్న ముష్కరులు

మేనేజర్‌ విజయ్‌కుమార్‌ రాజస్థాన్‌ వాసి..

కార్మికుడు దిల్‌ఖుష్‌ బిహారీ.. 3 రోజుల్లోనే 3 హత్యలు

మే 1 నుంచి ఇప్పటికి 9 మంది బలి..

త్యలను ఖండించిన విపక్షాలు..

ధోభాల్‌, రా చీఫ్‌తో షా భేటీ


శ్రీనగర్‌, జూన్‌ 2: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కశ్మీర్‌ పండిట్లతో పాటు హిందువులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నారు. అమాయక పౌరులను దారుణంగా హతమార్చుతున్నారు. మొన్న ఓ టీవీ నటిని, నిన్న ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేసిన ముష్కరులు.. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్‌ ప్రాణాలు బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లో కుల్గామ్‌ జిల్లాలోని ఆరే మోహన్‌పొరా ప్రాంతంలో ఉన్న ఎల్లఖీ దేహతి బ్యాంకులోకి గురువారం ఉదయం కొందరు ఉగ్రవాదులు చొరబడ్డారు. బ్యాంక్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దారుణమంతా సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది.


ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. విజయ్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లా. ఆయన ఇటీవలే ఈ బ్రాంచిలో విధుల్లో చేరారు. హత్య చేసిన ఉగ్రవాదులను సాధ్యమైనంత త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు గురువారం రాత్రి ఉగ్రవాదులు బుద్గామ్‌ జిల్లాలోని చదూర గ్రామంలో పనిచేస్తున్న వలస కార్మికులపై దాడి చేశారు. బ్యాంకు మేనేజర్‌ విజయ్‌కుమార్‌ను పొట్టనపెట్టుకున్న కొద్ది గంటల్లోనే మరో వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. చందూరలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్‌ అనే కార్మికుడు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.   కాగా, విజయ్‌కుమార్‌ మరణవార్త తెలుసుకొని ఆయ న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయా రు. తన కుమారుడు శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడని తండ్రి ఓంప్రకాశ్‌ తెలిపారు. బ్రాంచ్‌ మేనేజర్‌గా పదోన్నతి పొంది, ఇతర రాష్ట్రానికి వెళ్లాలని భావిస్తున్నాడని గద్గద స్వరంతో చెప్పారు. 


నెల రోజుల్లో 9 మంది..

కశ్మీర్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది మూ డోసారి కావడం గమనార్హం. కశ్మీర్‌లో వరుస ఘటనలపై మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 1 నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో తొమ్మిది లక్షిత హత్యలు జరిగాయి. ఇందులో ముగ్గురు విధుల్లో లేని పోలీసులు కాగా.. ఆరుగురు పౌరులు కావడం గమనార్హం. విజయ్‌కుమార్‌ హత్య నేపథ్యంలో గురువారం వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమను తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.


ముక్తకంఠంతో ఖండించిన నాయకులు

విజయ్‌కుమార్‌ హత్యను రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించారు. ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కశ్మీరులో శాంతిని పునరుద్ధరించడంలో కేంద్ర ం విఫలమైందని ఆరోపించారు. ‘‘విజయ్‌కుమార్‌ హ త్య అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలను ఖండించడంతో పాటు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపే ట్వీట్లు వరసగా చేయాల్సి రావడంతో మనసు మొద్దుబారిపోతోంది’’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌, పీడీపీ సహా పలు పార్టీల నేతలు విజయ్‌కుమార్‌ హత్యను ఖండించారు. కాగా, లక్షిత హత్యలు పాకిస్థాన్‌ కుట్ర అని జమ్మూకశ్మీరు బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా పేర్కొన్నారు. ‘రెండోసారి కశ్మీరీ పండిట్ల వలస మొదలవుతోంది. ప్రధాని కార్యాలయమే దీనికి బాధ్యత వహించాలి. 1989 నాటి తప్పులనే పునరావృతం చేస్తున్నారు. మోదీ సర్కారేమో సినిమా ప్రచారాల్లో బిజీగా ఉంది’ అని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. విజయ్‌కుమార్‌ హత్యను ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఖండించారు. 


అమిత్‌ షాతో ధోభాల్‌, రా చీఫ్‌ భేటీ!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు లక్షిత హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోభాల్‌తో భేటీ అయ్యారు. రా చీఫ్‌ సమ్నత్‌ గోయల్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ అధికారులూ పాల్గొన్నారు. కశ్మీర్‌ లోయలో సామాన్యులకు భద్రత, ముష్కరుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై వీరు చర్చించినట్లు సమాచారం. 

Updated Date - 2022-06-03T08:37:47+05:30 IST