ఇప్పటికైతే టీచర్లకే బడి..! వారం తర్వాత..!

ABN , First Publish Date - 2022-06-28T22:13:45+05:30 IST

బడి తలుపులు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. ముందస్తు సమాయత్తం పేరుతో ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పాఠశాలలు జూలై 5 నుంచి తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే

ఇప్పటికైతే టీచర్లకే బడి..! వారం తర్వాత..!

ప్రస్తుతం ఉపాధ్యాయులకే పనంతా..

వారం తర్వాత రానున్న విద్యార్థులు

టీచర్లకు  ఏడు రోజుల ప్రత్యేక ప్రణాళిక


(ఆంధ్రజ్యోతి- విజయవాడ) : బడి తలుపులు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. ముందస్తు సమాయత్తం పేరుతో ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పాఠశాలలు జూలై 5 నుంచి తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే పాఠశాలలకు వెళ్లొచ్చని ఉపాధ్యాయులూ భావించారు. ఉన్నట్టుండి విద్యాశాఖ మంగళవారం నుంచే పాఠశాలల పునఃప్రారంభమని ప్రకటించింది. ఉన్నత పాఠశాలలు, అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ప్రైమరీ పాఠశాలలు మాత్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పనిచేస్తాయి. ఉపాధ్యాయులు మంగళవారం నుంచి పాఠశాలలకు హాజరైనా, విద్యార్థులు మాత్రం వచ్చేనెల ఐదో తేదీ నుంచి తరగతులకు వస్తారు. 


టీచర్ల షెడ్యూల్‌ ఇది..

పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు ఈనెల 28 నుంచి వచ్చేనెల నాల్గో తేదీ వరకు ఏయే కార్యకలాపాలు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం ఒక షెడ్యూల్‌ను విడుదల చేసింది. పాఠశాల భవనాలు, ఆవరణ, తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశుభ్రం చేయాలని షెడ్యూల్‌ ఇచ్చింది. క్రీడా సామగ్రి పనిచేస్తుందో, లేదో చూడాలని నిర్దేశించింది. బుక్‌ బ్యాంకును నిర్వహించాలని, కొత్త పాఠ్యపుస్తకాల్లో కొరత ఉంటే బుక్‌ బ్యాంకును పంపిణీ చేయాలని సూచించింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన గ్యాస్‌ స్టౌలు పనిచేస్తున్నాయా లేదా, వంటపాత్రలు ఏవిధంగా ఉన్నాయి అనే విషయాలని పరిశీలించాలని, బడి ఈడు పిల్లలను గుర్తించి, జాబితా సిద్ధం చేయాలని పేర్కొంది. డ్రాపవుట్లను గుర్తించి తిరిగి వారంతా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం గ్రామ, వార్డు సచివాయలంలోని ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవాలని, విద్యా కమిటీలతో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్ల ర్యాలీలు నిర్వహించాలని, పాఠశాలల పునఃప్రారంభాన్ని ఒక పండగలా నిర్వహించాలని విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారం రోజుల్లో ఉపాధ్యాయులు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, విద్యా సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం ఉపాధ్యాయులు టీఎల్‌ఎం (టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) డైరీని సిద్ధం చేయాలని, విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్‌ను రోజుకు ఒకటి చొప్పున పూర్తిచేయాలని కూడా చెప్పింది. అయితే, ఈ షెడ్యూల్‌లో కొత్తదనమేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఏటా పాఠశాలల పునః ప్రారంభానికి ముందు ఈ పనులన్నీ చేస్తున్నారని పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-06-28T22:13:45+05:30 IST