COVID-19 Vaccines : ఇద్దరు కుమార్తెల తండ్రికి సింగపూర్ కోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-05-08T00:15:45+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్ల గురించి ఎటువంటి అభిప్రాయాలను పిల్లలపై రుద్దవద్దని

COVID-19 Vaccines : ఇద్దరు కుమార్తెల తండ్రికి సింగపూర్ కోర్టు ఆదేశాలు

సింగపూర్ : కోవిడ్-19 వ్యాక్సిన్ల గురించి ఎటువంటి అభిప్రాయాలను పిల్లలపై రుద్దవద్దని ఓ తండ్రిని సింగపూర్ (Singapore) కోర్టు ఆదేశించింది. టీకాకరణ (Vaccination)పై ఆ తండ్రికే ఆందోళన ఉందని, పిల్లలకు లేదని గుర్తించి, ఆ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తమ కుమార్తెలకు వ్యాక్సినేషన్ చేయించవద్దని తన భార్యను ఆదేశించాలని ఆ భర్త కోరారు.


తండ్రి విచిత్ర వాదన

Singapore మీడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత జాతీయులైన ఇద్దరు పిల్లలు స్టూడెంట్ పాస్‌లపై సింగపూర్‌లో ఉన్నారు. వీరి తండ్రి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన సమ్మతి లేకుండా తమ కుమార్తెలకు (ఒకరి వయసు ఏడేళ్ళు, మరొకరి వయసు 13 సంవత్సరాలు) కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించకుండా తన భార్యను ఆదేశించాలని కోరారు. తాను ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కలిగే లాభనష్టాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. అయితే తాను సాధారణంగా వ్యాక్సిన్లకు వ్యతిరేకం కాదన్నారు. తన పిల్లలిద్దరికీ భారత దేశంలో తప్పనిసరిగా వేయించవలసిన టీకాలన్నిటినీ వేయించానని తెలిపారు. 


తండ్రికే ఆందోళన : జడ్జి

ఈ పిటిషన్‌పై జడ్జి స్పందిస్తూ, తండ్రికి పైకి కనిపించని ఆరోగ్య సంబంధిత లక్షణాలు ఉన్నాయన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్‌పై ఆందోళన ఉన్నది ఆయనకే కానీ, ఆయన పిల్లలకు కాదని పేర్కొన్నారు. తండ్రికిగల ఆందోళనను అర్థం చేసుకోవచ్చునని, అయితే పిల్లలకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేనందువల్ల వారికి టీకాలు వేయించడంపై ఆయన ఆందోళన ప్రభావం ఉండబోదన్నారు. 


సరైన కారణం లేదు

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు అభ్యంతరం చెప్పడానికి తగిన సముచిత కారణాన్ని ఆ తండ్రి చూపించలేదని జడ్జి గుర్తించారు. వ్యాక్సినేషన్ చేయించరాదని ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వడం ఆ పిల్లల ప్రయోజనం కోసమేనని ఆయన చేసిన వాదనతో ఏకీభవించలేదు. టీకాలు వేయించడం ఆ ఇద్దరు పిల్లలకు ప్రయోజనకరమని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై ఆ చిన్నారుల అభిప్రాయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితమైనట్లు వారి తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తెలుస్తోందన్నారు. 


పిల్లలను ప్రభావితం చేయవద్దు 

తమ కుమార్తెల అభిప్రాయాలను ప్రభావితం చేయరాదని తన భర్తను ఆదేశిస్తూ అదనపు ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని జడ్జి అంగీకరించారు. తండ్రికి ఇచ్చిన ఆదేశాల్లో, Covid-19 Vaccines పరీక్షించినవి కాదని, సురక్షితమైనవి కాదని, సత్ఫలితాలు ఇవ్వబోవని, వాటిని తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుందని ఆ ఇద్దరు కుమార్తెలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెప్పవద్దని ఆదేశించారు. అదేవిధంగా వేరొక వ్యక్తితో చర్చించడం ద్వారా కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేయరాదని ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ల సమర్థత, రక్షణలను ప్రశ్నించే సినిమాలు, సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లు, ఇతర ఆన్‌లైన్ సమాచారం, సాహిత్యం లేదా ఇతర మెటీరియల్‌ను ఆ ఇద్దరు పిల్లలకు చూపించవద్దని తెలిపారు. ఇతరుల చేత కూడా ఈ విధంగా చేయించవద్దని ఆదేశించారు. 


పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించడం తల్లి స్వార్థం ఎలా అవుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తన కుమార్తెల స్టూడెంట్ పాస్‌లను రెన్యువల్ చేయించకూడదనే ఉద్దేశంతోనే తండ్రి ఈ విధంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 


భార్య తన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న దరఖాస్తు చేశారు. వీరి కుమార్తెలు స్టూడెంట్ పాస్‌లపై సింగపూర్‌లో ఉంటున్నారు. అయితే భర్త ఈ స్టూడెంట్ పాస్‌లను ఏకపక్షంగా రద్దు చేయించారు. వీరి పేర్లను సింగపూర్ మీడియా వెల్లడించలేదు.


Read more