ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-04-17T16:21:09+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని కొట్రా రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్‌ను

ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కొట్రా రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్‌ను, ట్రక్ డ్రైవర్‌ను కొట్టినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ నాయక్‌ కుమారుడు రుతిక్ నాయక్ (24)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రాయ్‌గఢ్‌ సమీపంలోని ఈ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన శనివారం జరిగినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రుతిక్‌పై రెండు కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. 


ట్రక్ డ్రైవర్ ములాయం యాదవ్‌తో రుతిక్, ఆయన అనుచరులు కొట్రా రోడ్ బైపాస్ వద్ద శనివారం ఘర్షణ పడ్డారని తెలిపారు. యాదవ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, ఆయనతోపాటు రుతిక్, ఆయన అనుచరులు కూడా అక్కడికి చేరుకున్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో కూడా వీరు వాగ్వాదానికి దిగారని, రుతిక్, ఆయన అనుచరులు పోలీస్ కానిస్టేబుల్ ఎల్ఎస్ రథియా, ట్రక్ డ్రైవర్ యాదవ్‌లపై దాడి చేశారన్నారు. 


ప్రభుత్వోద్యోగి అధికారిక విధులను నిర్వహించకుండా అడ్డుకున్నందుకు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు, ఉద్దేశపూర్వకంగా గాయపరచినందుకు, నేరపూరితంగా బెదిరించినందుకు ఆయనపై  భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 186,  294, 332, 34, 506 ప్రకారం ఈ కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. 


Updated Date - 2022-04-17T16:21:09+05:30 IST