ఫిలిప్పైన్ ప్రెసిడెంట్‌గా ఒకప్పటి నియంత కొడుకు

ABN , First Publish Date - 2022-07-01T00:12:03+05:30 IST

ఫిలిప్పైన్‌లో ఒకప్పటి నియంత కుమారుడు నేడు ఎన్నికల్లో ఘన విజయం

ఫిలిప్పైన్ ప్రెసిడెంట్‌గా ఒకప్పటి నియంత కొడుకు

మనీలా : ఫిలిప్పైన్‌లో ఒకప్పటి నియంత కుమారుడు నేడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయన తండ్రిపై 1986లో ప్రజలు తిరుగుబాటు చేసి పదవీచ్యుతుడిని చేయగా, నేడు ఆయన గొప్ప ప్రజాదరణతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నారు. దేశంలో అత్యున్నత స్థాయి పదవిలో తన వంశాన్ని పునఃప్రతిష్ఠించడం కోసం ఆయన దశాబ్దాలపాటు చేసిన కృషి ఫలించింది. 


ఫెర్డినాండ్ ‘బోంగ్‌బోంగ్’ మార్కోస్ జూనియర్ (64) గురువారం మధ్యాహ్నం ఫిలిప్పైన్ దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనీలాలోని నేషనల్ మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది స్థానిక, విదేశీ ప్రతినిధులు, పాత్రికేయులు, మద్దతుదారుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి ఇమెల్డా (92) కూడా పాల్గొన్నారు. 


అత్యంత ప్రజాదరణగల రోడ్రిగో డుటెర్టీపై మార్కోస్ జూనియర్‌ విజయం సాధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మల్కనంగ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి మార్కోస్‌ జూనియర్‌ను డుటెర్టీ స్వాగతం పలికారు. ఇదే ప్యాలెస్ నుంచి మార్కోస్ కుటుంబ సభ్యులు 36 ఏళ్ళ క్రితం పారిపోయారు. మార్కోస్ జూనియర్‌ బలహీనుడని ఒకప్పుడు డుటెర్టీ ఆరోపించారు. ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టకుండా నిరోధించడానికి జరిగిన ప్రయత్నాలు సుప్రీంకోర్టు తీర్పుతో  విఫలమయ్యాయి. 


ఫెర్డినాండ్ మార్కోస్ సీనియర్ 20 ఏళ్ళపాటు ఫిలిప్పైన్‌ను పరిపాలించారు. ఆయన పాలన చీకటి యుగమని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన పాలనను ఆయన కుమారుడు ప్రశంసిస్తుండటం గమనార్హం. తన తండ్రి అనేక రోడ్లను నిర్మించారని, ఇబ్బడిముబ్బడిగా ధాన్యం పండించారని ప్రశంసిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంపై ఫిలిప్పైన్ హక్కులను కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సముద్రంపై తనకే సంపూర్ణ హక్కులు ఉన్నాయని చైనా చెప్తోంది. 


Updated Date - 2022-07-01T00:12:03+05:30 IST