కొండ కాలవ పాటలాంటి కథ

ABN , First Publish Date - 2021-03-29T07:54:20+05:30 IST

‘‘సిగ్నిఫికేషన్‌’’, ‘‘సిగ్నిఫైయ్యర్‌’’ సైన్‌ (sign) అనే మాటలోంచి వచ్చేయి. మనిషి మాటలతోనే కాదు. సంజ్ఞలతోనూ విషయం చెప్పగలడు. అవసరాన్నిబట్టి సంజ్ఞకు మాట కన్నా...

కొండ కాలవ పాటలాంటి కథ

‘‘సిగ్నిఫికేషన్‌’’, ‘‘సిగ్నిఫైయ్యర్‌’’ సైన్‌ (sign) అనే మాటలోంచి వచ్చేయి. మనిషి మాటలతోనే కాదు. సంజ్ఞలతోనూ విషయం చెప్పగలడు. అవసరాన్నిబట్టి సంజ్ఞకు మాట కన్నా బలమైన శక్తి వస్తుంది. సంజ్ఞలో సందేశం, ధ్వని, కాకువు, అభినయ సమృద్ధీ, సూచనా, పొదుపరితనం, నాటకీయత, సుగణాలుగా ఉన్నాయి. సంస్కృతిలో, కమ్యూనికేషన్‌లో, భావ ప్రకటనలో, మార్మికతలో, మతంలో, శిక్షణలో, ఆంతర్యంలో, కళానిర్మాణలలో పునాదిగా వస్తూ వాటిని బల వర్ధకం చేస్తున్నాది సంజ్ఞ. సంజ్ఞకున్న బలం మాటలకు వచ్చినపుడు ఆ మాటలు సాహిత్య రూపాలుగ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. రోడ్డు మీద కార్లోనో బస్‌లోనో వేగంగా వెళ్తూంటాం. రోడ్డు పక్కన చిన్న బోర్డు కనిపిస్తుంది. దాని మీద అక్షరాలేమీ ఉండవు. ఒక చిన్న బాలుడు మెడలో ఒక బేగ్‌తో పరిగెడుతున్నట్లు బొమ్మ ఉంటుంది. దాంటో ఉన్న సమాచారం ఒక పిల్లాడు బేగ్‌తో పరిగెడుతున్నాడని మాత్రమే కాని, మనకు బోధపడేది ఏమిటి? దగ్గర్లో స్కూల్‌ ఉన్నాది. పిల్లలు రోడ్‌ మీద రోడ్‌క్రాస్‌ చేస్తూనో, నడుస్తూనో ఉంటారేమో వాహనం వేగం తగ్గించండి, జాగ్రత్తగా పోనీయండి అని. ఇలాంటివే ఎన్నో- ఇదంతా రోలాబార్త్‌ అనే ఫ్రెంచి భాషా శాస్త్రవేత్త, తాత్వికుడూ చెప్పిన సిద్ధాంతాలలో ఒక ముఖ్యమైన అంశం.


‘‘మాటలు తిన్నగా రానీ’’ అంటే వ్యవహారం, వ్యాపారం. మాటలు సంజ్ఞలూ మెటఫర్‌లూ అయినప్పుడు కవిత్వం. మాటలు లేకపోయినా సంజ్ఞారూపమైన అభినయం ఉన్నపుడు నాట్యం, నాటకం - సంజ్ఞలు శబ్దరూపంలో కేవలత్వం పొందినపుడూ, కాకువు కళాత్మకం స్వరాత్మకం అయినప్పుడు సంగీతం ఔతున్నాయి. ఇవన్నీ తగిన స్థాయిలో మిళితం అయినపుడూ వేర్వేరుగా కూడా కథనాలు ఔతున్నాయి.


మహాకవి శ్రీశ్రీకి చాసో అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. చాసో గోర్కీ అనీ చాసో సోసో కాదనీ సెబాసో అనీ, గంటియాజులు అనీ (మీ పేర్లోని చానీ, సోమాన్నీ నేను తాగేసేను అనీ) అనేక అందాల అభివందించేడు శ్రీశ్రీగారు. ఆయనకు 1940లోనే చాసో రాసిన ‘మాతృ ధర్మం’ కథ గొప్పగా నచ్చినట్లుంది. ‘‘రాసిన అన్ని కథలూ ప్రకటించండి గాని ఆ కత్తెర పిట్ట కథ మాత్రం వెయ్యకండి’’ అని ఉత్తరంలో రాసేడు శ్రీశ్రీ. ఆ కథ తను ప్రకటించబోతున్న ‘అశాంతి’ పత్రికలో వేసుకుంటా ననీ, తన కోసం ఆ కథను రిజర్వుచేసి ఉంచమనీ శ్రీశ్రీ అడుగుతు న్నారు. ఆడకత్తెర పేరుతో 1942లో రుక్మిణీనాథశాస్త్రి దగ్గరికి చేరింది. 1946దాకా చాసో  ‘అశాంతి’ కోసం ఎదురుచూసి 1946లో రూపవాణిలో ప్రకటించారు. 


‘మాతృధర్మం’ కథలో ఉన్న ప్రతీ పదం, ప్రతీ వాక్యం, పేరా అన్నీ ప్రాముఖ్యం (సిగ్నిఫికేషన్‌) ఉన్నవే - కవిత్వంలో మాత్రమే అటువంటి సిగ్నిఫైయర్స్‌ పోగుపడడం మంచి లక్షణం, సరియైున లక్ష్యం అనే వాదముంది. ఎన్ని వస్తువులో, ఎన్ని మాటలో, పేర్లో ఒకసారి చూడండి: 1. మాతృధర్మం 2. చీతాకోకచిలుక 3. మొరాలు 4. కందికొర్రు 5. ఆరులు 6. బొర్రలు విడివడ్డం 7. మామిడి 8. జీవులు 9. పాతనుయ్యి 10. ముసలి మునగ 11. నేలతంగేళ్ళు 12. అంకుడు పూలు 13. గాయకుడు 14. సొళ్ళు 15. ఆడకత్తెర 16. తేనెలు కార్చడం 17. గల్జరాకులు 18. వొంతుకూడుకోవడం 19. ఊసుపోక ఉల్లాసం 20. రేవడి పొలం 21. కులాయం 22. గూడెక్కింది 23. నల్లని కడుపు 24. సేద పిట్టలదండు 25. బడ్డు 26. తాటి చెంకులు 27. నెమలి రెక్కల దీపం పురుగు 28. సపోటా 29. మాంసఖండం 30. పట్టుకుషను 31. అలారం గడియారం 32. కోవెల 33. ఇంద్ర స్తోత్రం 34. బాబాక్రమం 35. పాలతీగకాయలు 36. విలాపం 37. బాదంపండు 38. సిక్కుసిపాయిలు 39. మెరుపుతీగ 40. మానవనేత్రాలకల్లా రమణీయమైన చలనచిత్రం 41. మందమారుతం 42. మధుపానం 43. పెంకుపురుగులు 44. లక్షిందేవిపురుగులు 45. తుమ్మెదలు 46. చీడా 47. గొల్లభామలూ 48. ఆకుతేళ్ళూ 49. వెదుళ్ళలోవ 50. ఇక్ష్వాకులనాటి 51. వాకలు... ఇలా వందకుపైగానే ఉన్నాయి. 


అభివ్యక్తికీ, అర్థానికీ ఆధారాలు మాటలు. అవి కూడా సంకేతాలే, కాని వాటికి నిర్ణీతమైన శాశ్వతమైన విలువలూ అర్థాలూ నిర్ణయించ లేము. అన్నీ సూచనలే అన్నీ మన అలవాట్లే. మాటలను సంజ్ఞలూ సంకేతాలూ సైన్‌బోర్డుల్లాగ వాడినపుడు వస్తువు సాంకేతికను పొంది విషయాన్ని సూచిస్తోంది. అర్థం మాత్రం ఫలానా అని చెప్పలేము - సందేహాత్మకతే సంజ్ఞకున్న, మాటకున్న బలం కూడా. ప్రయోగం బట్టీ సందర్భం బట్టీ సంజ్ఞల్లాంటి, సంకేతాలవంటి మాటలే కవిత్వంలో ఒకలాగా, ఎపిక్‌లో ఇంకోలాగా నాటకంలో మరీ శక్తివంతంగా ప్రయోగి స్తారు మహా రచయితలు అంటాడు - రోలాబార్త్‌. సైన్‌బోర్డులు మరీ ఎక్కువైతేనే మనకు దొరికే సమాచారం తక్కువైపోతుంది. అందుకే బొమ్మ, రంగు, సైజు, కాంతీ ఉపయోగిస్తారు సైన్‌ బోర్డుల్లో. భాషలో మన అలవాట్ల బట్టి రంగూ రుచీ వాసనా కూడా మాటకు ఉంటాయని చెప్పడం మనం ఎరుగుదుము. ఫ్రాయిడ్‌ కలల విశ్లేషణలో మాటలకూ, సంఘటనలకూ విపరీత అర్థాలు ఉన్నాయంటారు. అలాగే కొన్ని అర్థశాస్త్ర సంప్రదాయాలూ కొన్ని సాంఘికశాస్త్ర విశ్లేషణ లలో స్థిరపడిన సూత్రాలూ మాటలకూ, ప్రవ ర్తనలకూ సంఘటనలకూ ప్రత్యేక అర్థాలను ఇవ్వగలవు. అలాంటి సిస్టమ్స్‌ని మైథా లజీస్‌ అనీ అంటారు పోస్టుమోడర్న్‌ వేత్తలు. మిత్‌ అంటే మనుష్యుల మేధ అల్లిన - ఒక ఉద్దేశంతో కల్పించిన - కల్పిత గాథ - ఉద్దేశాలకీ మేధకూ కల్పనకూ ప్రకటనకూ సంకేతాలు, పదాలే ఆధారం. ఏది ప్రకటింపబడిందో అది సూచన. సంకేతం - బొమ్మ కావొచ్చు, మాటకావొచ్చు - సైరన్‌ వంటిదీ - శబ్దం అలారంబెల్‌ - కావొచ్చు. అది సైన్‌ - అది చేసే పని సిగ్నిఫై చేయడం - అందుకని అది సిగ్నిఫైయర్‌ - మనకు అర్థం అయ్యేదీ మనం అలవాటు చేసుకునేదీ సిగ్నిఫైడ్‌ ఉద్దేశ్యం - కొన్ని మాటలు వాక్యనిర్మాణంలో మాటల సంబంధాలను చెప్తాయి. కొన్ని మాటలు సైన్‌బోర్డులలాగా పైకి లేచి నిలబడతాయి. వార్త, సమాచారం ఆ మాటల్లోనే ఉంటుంది. అవే సిగ్నిఫికెంట్‌ మాటలు. విచిత్రమేమంటే మాటలకు రూపకాలంకార గుణం ఉంటుంది. మెటఫర్‌తోనే మనిషి వ్యంగ్యం, ధ్వనీ, ఐరనీ అనే ప్రత్యేకతలు సాధించేడు. మనిషి అభివ్యక్తికి అతనిలో ఉన్న ఈ వ్యంగ్య వైభవమే మూలం. దీన్నే వక్రోక్తి అనీ నిర్వచిస్తారు.


ఎక్కువ మాటలు సిగ్నిఫైయర్స్‌ అయితే కవితాత్మకత అధికం, కథాశం స్వల్పం అవుతుంది. మాతృధర్మం కథలో అనేక అంశాలు సిగ్ని ఫైయర్స్‌ అయ్యాయి. ఐనా ప్రతీ పేరాలోనూ కత్తెర దంపతుల రిఫరెన్స్‌ ఒక అంతఃసూత్రంగా పని చేసింది - అసలు వస్తువు అదీ, మిగతావి దానికి పోషకాలు అని చదివే వాళ్ళు అనుకుంటూ ఆ స్పృహతోనే చదువుతారు.


మానవ సంబంధాలకు చెందిన సంప్రదాయ పదాలు-మాతృధర్మం, పాతివ్రత్యం, పెనిమిటి, సొళ్ళు కార్చడం, తేనెలు కార్చడం, నువ్వుచేలు వెన్నెల్లా పూసి వెండిగంట మోగించడం లాంటి వాక్యాలు పదిహేను దాకా ఉంటాయి. ఇంత వర్ణన ఇన్ని రకాల వర్ణన - ఇమేజెస్‌, ప్రబంధాల మాటలు - స్త్రీ చంచల నేత్రాలు, మధుపానం చేస్తూ మత్తెక్కిన నెమలి రెక్కల దీపపు పురుగు, బొల్లిగెద్ద పై కాకుల వేట ఉపకథా, డేగ చక్రాయుధంలాగ రావడం, రాచగువ్వని తన్నుకుపోవడం... ఇవన్నీ ప్రధానాలే అయినాయి వాక్యాలుగా. మధ్యలో పులుగు వికటాట్ట హాసాలూ, ఋషిపక్షుల గందరగోళం - ఇవన్నీ చలనచిత్రాల్లో వాడే మాంటేజీ, + నేపథ్య సంగీతాలూ ధ్వని చిత్రాలూ - బీభత్సాన్నీ గోథిక్‌ వాతావరణాన్నీ సృష్టించడం కోసం వాడేరు. మాతృ ధర్మం పాతివ్రత్యం లాంటి ఉన్నత సంప్రదాయాలనూ ఆదర్శవాద ధోరణులను కత్తెరపిట్ట దంపతులకు ఆపాదిం చడం లక్ష్యం ఐనప్పుడూ, రెండు విషాద సంఘటనలు ఆమె జీవితంలో క్లైమాక్స్‌ని చేరినపుడూ మానవ పతి వ్రతవలె కాక పక్షి జాతికి సహజమైన పతి లేని గూడెక్కి ఇంకో పసిగుడ్డును పెట్టి పొదిగి పుంజును కనిపెంచి అది కూత కొస్తే తన జన్మ ధన్యమైందని హృదయం ద్రవీ భూతమవడం ఇదంతా ఒక ఎపిక్‌వలే నడిచింది. కథలలో ఇదొక వైచిత్రి. కథాంశంలో పారవశ్యం కన్నా వాతావ రణంలోనూ ఉపకథలలోనూ తాదాత్మ్యం చెందడం ఎక్కువై కవిత్వానుభూతికి లోనవుతాము. ఇదే ‘మాతృధర్మం’ కథను ఎపిక్‌ని చేసింది. సుఖాంతమైన గ్రీక్‌ ట్రాజడీ లాగ ఉన్నాది. - పైగా మనిషి శరీర ధర్మాన్ని, నైతికతనూ మించిన ప్రకృతి ధర్మాలనూ ఇతర జీవజాతుల శారీరక ధర్మాలలో ఉన్న సహజ సౌకర్యాలనూ సూచించడం వల్ల మనిషికి దఖలుపడిన శ్రమ బాధ్యతనూ సృజనాత్మకతనూ సూచించేరు.


మానవ నేత్రాలకల్లా రమణీయమైన చలచిత్రం అన్నారే చాసోగారు, నిజానికి అలాగే ఉన్నాది ఈ కథన విధానం. వందకుపైగా ఇమేజీల మాంటేజీతో రంగుల్లో తీసిన అద్భుత డాక్యు మెంటరీ. మానవ నేత్రాలకూ మనోనేత్రాలకూ ఇంద్రియాలకే పరిమితం కాకుండా మానవ జీవితానికీ చేతనకూ ముడిపెట్టాలనీ, కవిత్వ ధర్మ మొక్కటే కాకుండా, మానవీకరణ చేసి ఉద్బోధ కూడా చేద్దామనే సదు ద్దేశంతోనే చాసోగారు మానవ కల్పితాలైన కాల్పనిక విషయ వస్తువు లనూ-మాతృధర్మం, పాతివ్రత్యం, కృతకృత్యం, ప్రేమఫలం, ఇంద్రస్తోత్రం, సిక్కుసిపాయిలు, వికటాట్టహాసాలు, ధన్య జీవితాలు - ఈ పదాలూ ప్రముఖంగా సిగ్నిఫికెంట్‌గా వాడేరు. వస్తువు కవితాత్మకంగానూ విషయం, సందేశం పురాణ మహాకధనాల స్థాయినీ చేరుకున్నాది. 


ఒక ముఖ్యమైన పనితనం గురించి చెప్పాలి. కథంటే చెప్పడం. కవిత్వమంటే పాడడం అనేది చాలా మట్టుకి నిజమే. చెప్పడం కాబట్టి స్పీచ్‌ రిథమ్‌ ఉండాలి. లిరికల్‌ (లైర్‌ - ఒక రకం వీణలోంచి లిరికల్‌ వచ్చింది) రిథమ్‌ పాటలో ఉండాలి. కవిత్వంలో పాటలయ కాదు, రాగలయ ప్రధానం అన్నది ఆధునిక వచన కవిత్వ లక్షణం. చాసోగారు ఈ కథలో ఇన్ని పదచిత్రాలు మాంటేజిగా వాడినా గేయాల లిరికల్‌ రిథమ్‌ని ఎక్కడా వాడలేదు. దాన్ని ఎక్కడికక్కడ నడ్డివిరగొట్టుతూనే సాగేరు. ఆఖరికి కత్తెర పిట్టలు ఆనందంగా పాటలు పాడుతున్నాయన్నప్పుడు కూడా ఇలా పోల్చేరు. ‘‘వాళ్ళపాట కొండకాలవపాట. ఎత్తు పల్లాల్లో, రాళ్ళ ఎగుడు దిగుడుల్లో కొండ కాలువ పాట’’.


చాసో ‘మాతృధర్మం’ కథ కూడా కొండ కాలువ పాటగానే ఉంది. ఇంకా కవితాత్మకంగా చెప్పాలంటే కొండకాలవే ఈ కథ చెప్తున్నట్టుగానే ఉంది అన వచ్చు. ఎలాగ రాయడమో అంత బాగా తెలిసిన వారికి ఏమిటి రాయడము ముందుగానే నిర్ణయం అయిపోతే మనసు ఇరుకైపోతుంది - ఎపిక్‌లో మొదలేదో కొస ఏదో దొరకదు ఒకంతట. చిక్కగానూ చిక్కుగానూ ఉండడం కూడా ఎపిక్‌ లక్షణం. ఐనా రచయిత ఎన్ని తిరగ రాసినా, ఎంత సాధకులైనా సద్యఃస్ఫురణలాగా, అసంకల్పితంగా వచ్చిన ట్లుండే తాజాదనం గొప్ప రచనకు ప్రధాన లక్షణం. ఎంతో సోచాయించి గాని చాసో రాయనే రాయరు.

ద్వారం దుర్గాప్రసాదరావు

9959233436


Updated Date - 2021-03-29T07:54:20+05:30 IST