Advertisement

బతుకు ‘బుగ్గ’పాలు..

Dec 2 2020 @ 23:52PM
బుగ్గవంక నీరు ఇళ్లల్లోకి రావడంతో తడిసిన వస్తువులను నాగరాజుపేటలో గుట్టలుగా వేసిన దృశ్యం

 ఐదారు రోజులుగా బురుదలో దుర్భర జీవనం

 వీధుల్లో తొలగని బురద, వరదకు కళ్లిన వ్యర్థాలు

 గోడు వినలేదు.. సాయం అందలేదు

 బడ్డ పెళ్లికి దాచిన బంగారు.. అత్తమామలు ఇచ్చిన కానుకలు...

 సర్వం వరదార్పణం

 కట్టుబట్టలతో రోడ్డున పడ్డ అభాగ్యులు ఎందరో..

 బుగ్గవంక బాధితులను కదిపితే కన్నీటి వరదే


(కడప-ఆంధ్రజ్యోతి)


ఎడతెరిపి లేని వానలు పడ్డాయి. అనూహ్యంగా కడప నగరంలోని బుగ్గవంక పొంగింది. రాత్రికి రాత్రే ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో వేలాదిమంది కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. మరుసటిరోజుకే వరద తగ్గింది. అందరూ తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఇళ్ల నిండుకూ బురద.. టీవీ, రిఫ్రిజిరేటర్‌, పరుపులు, మంచాలు, తిండిగింజలు, బట్టలు, పిల్లల పుస్తకాలు.. అన్నీ తడిచి ముద్దయిపోయాయి. ఒక్కో ఇంటిలో కనీసం రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ నష్టపోయారు. ఆ వస్తువులను వీధిలోపడేసి ఇంట్లోని బురద తొలగించుకోవడానికే ఆరేడువేల రూపాయలు ఖర్చు అవుతోంది. వరద తగ్గి ఐదురోజులైనా చాలాచోట్లకు ఇప్పటికీ ప్రజాప్రతినిఽధులు, అధికారులు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తమ కష్టార్జితమంతా బుగ్గవంక పాలయిందని కన్నీరు కారుస్తున్నారు.


కడప నగరం నడిబొడ్డున బుగ్గవంక ప్రవహిస్తోంది. నవబంరు 25న మొదలైన నివర్‌ తుఫాన అల్లకల్లోలానికి బుగ్గవంక ఉప్పొంగింది. 26వ తేది రాత్రి బుగ్గవంక డ్యాం గేట్లెత్తి 19 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. మూల వంక నుంచి మరో 15 వేల క్యూసెక్కుల వరద చేరింది. పైగా ఎడతెరిపిలేని వర్షం. వలంటీర్లు వచ్చి అప్రమత్తంగా ఉండాలని చెప్పారే తప్పా.. ముంచెత్తే వరద వస్తుందని ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని ప్రజలు అంటున్నారు. 26న గురువారం రాత్రి ఒక్కసారిగా వరద ఉప్పొంగి వంకతీర కాలనీలను ముంచేసింది. 5,650కి పైగా ఇళ్లలో వరద చేసి సర్వం నీటిపాలు చేసింది. ఒక్కసారిగా వరద ఇళ్లను కబళించడంతో పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం తప్పా.. సామగ్రిని తీసుకెళ్లలేకపోయారు. ఇళ్లలో టీవీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇన్వర్టర్లు, విద్యుత మోటర్లు, ఇళ్ల ముందు నిలిపిన కార్లు, ద్విచక్ర వాహనాలు నీటి మునిగి పాడైపోయాయి. ఇళ్లలో బియ్యం, తిండి గింజలు, బట్టలు, సోఫాసెట్లు, చెక్క మంచాలు, పిల్లల పుస్తకాలు.. ఇలా ఏ ఒక్కటి మిగలకుండా వరదార్పణమైంది. ప్రతి ఇంట్లో సగటున రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు  నష్టం జరిగింది. రూ.వంద కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అనధికారిక అంచనా. 

బతుకు బురద.. బురద

వరద తగ్గినా వీధుల్లో బురద మిగిలింది. ఇళ్లలో తడిసి ముద్దై వినియోగానికి పనికి రాని సామగ్రి, బట్టలు, బియ్యం ఇంటి ముందే పడేశారు. ఆరు రోజులైనా పలు కాలనీల్లో నేటికి బురద, చెత్తను శుభ్రం చేయలేదు. ఎక్కడ పడితే అక్కడే వీధుల్లో పేరుకుపోయింది. ఓ పక్క బురద.. మరో పక్క తడిసిన బియ్యం, తిండి గింజలు, బట్టలు కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని వీధుల్లో కార్పొరేషన సిబ్బంది బ్లీచింగ్‌ పౌడరు కూడా చల్లలేదు. తిండి గింజలు లేక సామాన్యులు దిక్కులు చూస్తున్నారు. రెండు మూడు కాలనీల్లో స్థానిక నాయకులు స్పందించారు. ఎక్కువ శాతం కాలనీల్లో ఆరు రోజులైనా ఎలా ఉన్నారని ఒక్కరు కూడా వచ్చి పలకరించలేదని, కనీసం మంచినీళ్ల ప్యాకెట్టయినా ఇవ్వలేదని బాధిత జనం కన్నీళ్లు పెడుతున్నారు. బురద తొలగించి ఇంటిని శుభ్రం చేయాలంటే కూలీలు ఒక్కో ఇంటికి రూ.5-8 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. పునరావాసంలో తలదాచుకున్న బాధితులకు తక్షణ సాయంగా రూ.500 ఇవ్వాలని సీఎం జగన ఆదేశించినా.. నేటికీ సాయం అందలేదు. వరద బాధితులను కదిపితే ఉబికిఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుకుంటూ వరద గోడు ఏకరువు పెడుతున్నారు. 


55 బస్తాల బియ్యం నీటిపాలు

- షబానా, రవీంద్రనగర్‌ 

మా ఇంట్లో ఆరుగురు ఉంటున్నాం. ఏడు గంటలకు వరద వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లాం. నా భర్త ఫయాజ్‌ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. 55 బస్తాల బియ్యం, టీవీ, రిఫ్రిజరేటర్‌, కూలర్‌, తిండిగింజలు సర్వం వరదపాలయ్యాయి. కట్టుబట్టలతో మిగిలాం. పిల్లలకు బట్టలు లేక వేరేవాళ్ల బట్టలు తొడిగించాం. రూ.2.50 లక్షలకుపైగా నష్టం జరిగింది.


పుట్టింటి పెళ్లికానులు పాడయ్యాయి

- షేక్‌ అమీర్‌, రవీంద్రనగర్‌ 

రెండేళ్ల క్రితం పెళ్లైంది. మా సంప్రదాయం ప్రకారం నా భార్యకు పుట్టింటివారు పెళ్లికానుకలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు వరదపాలయ్యాయి. ఏ ఒక్కటీ మిగలలేదు. ఇల్లంతా ఖాళీ అయింది. టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన, తిండిగింజలు, బట్టలు అన్నీ తడిసి పాడైపోయాయి. రూ.2 లక్షలకుపైగా నష్టపోయాను.


పెళ్లికి తెచ్చిన బంగారు, నగదు వరద పాలైంది

- పాలగిరి చరిత, శ్రీహరిరావు వీధి, నాగరాజుపేట 

ఆఫీసర్స్‌ క్లబ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నా. ముగ్గురు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని 5 తులాల బంగారు, రూ.70 వేల నగదు, 500 కిలోల బియ్యం సిద్ధం చేసుకున్నాం. బుగ్గ వంక పక్కనే మా ఇల్లు. రాత్రి ఒక్కసారి వరద రావడంతో బయటకు పరిగెత్తాం. ఇల్లు పడిపోయింది. బంగారు, నగదు, బియ్యం వరద పాలయ్యాయి. ఏ వస్తువు మిగలకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. ఇప్పుడు బిడ్డ పెళ్లెట్లా చేయాలో.. ఆ దేవుడే ఆదుకోవాలి.


కళ్లముందే ఇల్లు కూలింది 

- సత్తాజ్‌ బేగం, నాగరాజుపేట 

ఐదుగురు సభ్యుల కుటుంబం మాది. ఇంట్లో వరద రావడంతో బయటకు పరుగుతీశాం. ఒక్కసామాను కూడా తెచ్చకోలేదు. మా కళ్ల ముందే ఇల్లు కూలిపోయి సర్వం కోల్పోయాం. కట్టుబట్టలతో మిగిలాం. కూలికిపోతే తప్ప పూట గడవని బతుకు మాది. ఎలా బతకాలో.. ఈ నష్టం ఎలా పూడ్చుకోవాలో..?


వీధిన పడ్డాం.. ఆదుకోవాలి

- సీతాలక్ష్మి, నాగరాజుపేట 

నేను కరీస్‌ పాయింట్లో పని చేస్తున్నా. నా భర్త టైలర్‌. మాయదారి వరద నిలువున ముంచింది. ఇంట్లో ఏ వస్తువు మిగల్లేదు. టీవీ, ఫ్రిజ్‌, కూలర్‌, తిండిగింజలు, బట్టలు.. ఇలా సర్వం వరదపాలయ్యాయి. అన్నీపోయి వీధినపడ్డాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. 


వరద మిగిల్చిన నష్టం వివరాలు

------------------------------------------------------

నీటి మునిగిన ఇళ్లు : 5,658

పునరావాసంలో ఉన్నవారు : 1,913

తక్షణ సాయం : రూ.500 (ఇవ్వలేదు)

దెబ్బతిన్న రోడ్లు : 9.35 కి.మీలు

డ్రైనేజీలు : 4.30 కి.మీలు

వీధి లైట్లు : 114

మొత్తం నష్టం : రూ.6.20 కోట్లు

పూర్తిగా పడిపోయిన ఇళ్లు : పక్కా-220, కచ్చా ఇళ్లు- 69

పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు : పక్కా-94, కచ్చా- 74

దెబ్బతిన్న నివాస గుడిసెలు : 28

ఇతర నివాసాలు : 52

 
వరదలో తడిసిన పుస్తకాలను ఆరబెడుతున్న దృశ్యం


వరదకు కూలిన ఇంటి వద్ద బాధితురాలు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.