పధ్నాలుగు నెలలుగా సాగుతున్న ఓ పోరాటం!

ABN , First Publish Date - 2022-06-25T08:55:20+05:30 IST

సిలింగేర్‌.. దండకారణ్యంలోని ఓ చిన్న ఊరు. ఆ ఊళ్లో ప్రభుత్వం సైనిక క్యాంపు పెట్టడానికి సన్నాహాలు చేసింది.

పధ్నాలుగు నెలలుగా సాగుతున్న ఓ పోరాటం!

సిలింగేర్‌.. దండకారణ్యంలోని ఓ చిన్న ఊరు. ఆ ఊళ్లో ప్రభుత్వం సైనిక క్యాంపు పెట్టడానికి సన్నాహాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు 2021మే 12న పోరాటం మొదలుపెట్టారు. వేలాది మంది కూడి ధర్నా చేస్తుంటే మే 17న పోలీసులు కాల్పులు జరిపారు. ఐదుగురు చనిపోయారు. దండకారణ్యంలో కొన్ని డజన్ల బేస్‌ క్యాంపులు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మొదటి నుంచి ఆదివాసులు పోరాడుతున్నారు. సిలింగేర్‌ కూడా అలాగే మొదలైంది. కొద్ది రోజుల్లోనే వందలాది గ్రామాలకు విస్తరించింది. జార్ఖండ్‌లో కూడా ఉద్యమం మొదలైంది. ఈ పధ్నాలుగు నెలలుగా నిత్యం ధర్నాలు, ఊరేగింపులు, నిరసన సభలు, సంస్మరణ సభలు దండకారణ్యమంతా అలుపెరగకుండా జరుగుతూనే ఉన్నాయి. లక్షల సంఖ్యలో జనం కలిసిన సభలు అనేకం జరిగాయి. మూలవాసీ బచావో మంచ అనే సంస్థ నాయకత్వంలో యువతరం ఈ ఉద్యమం చేస్తోంది. దీనికి అనుబంధంగా మూలవాసీ కళా మంచ, లేఖక్‌ మంచ అనే కళా సాహిత్య సంస్థలు పని చేస్తున్నాయి. వీటన్నిటిలో అమ్మాయిలు గరిష్టంగా ఉన్నారు. సోనీసోరి బేలాభాటియా, నందినీసుందర్‌ వంటి వారు ఈ ఉద్యమానికి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారు.


దండకారణ్యం సహా సరిహద్దు రాష్ర్టాల్లోని విప్లవోద్యమాన్ని అణచివేయడానికి సుమారు ఏడు లక్షల సైనిక, అర్ధ సైనిక బలగాల మోహరింపును, వైమానిక దాడులను వ్యతిరేకిస్తూ సాగుతున్న శాంతియుత పోరాటం ఇది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 100 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకోడానికి పెట్టుబడిదారీ శక్తులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగతా సరిహద్దు రాష్ర్టాల్లో ఈ సంపద ఇంకెంత ఉంటుందో ఊహించవచ్చు. ప్రభుత్వాలు ఒక చేత్తో దేశం మీదికి కార్పొరేట్‌ శక్తులను తోలి, ఇంకో చేత్తో దండకారణ్యం మీదికి లక్షలాది సైన్యాన్ని ఉసిగొల్పాయి. వనరుల దోపిడీ, అదనపు విలువ దోపిడీ అనే ఆర్థిక వ్యూహాన్ని అమలు చేయడానికి పాలకులకు సైనికీకరణ తప్పనిసరైంది. మైదాన ప్రాంతాల్లో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కంటే చాలా ముందే ఆదివాసీ ప్రాంతాల్లో గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది. ఈ పెట్టుబడిదారీ దోపిడీకి, సైనికీకరణకు వ్యతిరేకంగా మన కాలంలో సాగుతున్న మహత్తర పోరాటం సిలింగేర్‌. రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచంలో సిలింగేర్‌ భాగం. దీర్ఘకాలిక పోరాటాల అవసరాన్నేగాక, అవెలా నడవాలో అనేక అనుభవాలను అందిస్తున్న పోరాటం ఇది.


ఈ విశ్లేషణ అందిస్తున్న ఇన్కె తాక్వల్‌ లడాయి ‘సిలింగేర్‌’ పుస్తకావిష్కరణ సభ నేడు గుంటూరులో జరుగుతుంది. చిలుకా చంద్రశేఖర్‌, ఎన్. వేణుగోపాల్‌, సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పాణి తదితరులు పాల్గొంటారు.


– పాణి

Updated Date - 2022-06-25T08:55:20+05:30 IST