పంట రుణాలలో మొండి చేయి

ABN , First Publish Date - 2022-07-06T05:40:46+05:30 IST

జిల్లాలో లక్ష్యాల మేరకు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు మొండి చేయి చూపుతున్నారు.

పంట రుణాలలో మొండి చేయి

- గత ఏడాది 57.82 శాతమే రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు

- ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్న రైతులు

- రైతుబంధు సొమ్ము పంట రుణాల వడ్డీలకే..

- రుణ మాఫీ, వడ్డీ బకాయిలను విడుదల చేయని సర్కార్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో లక్ష్యాల మేరకు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు మొండి చేయి చూపుతున్నారు. దీంతో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల చుట్టూ అప్పుల కోసం తిరుగుతున్నారు. ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలు, కూలీల ధరలు పెరుగుతుండడంతో వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్లుగా పంట ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు పెంచకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నాయి. వ్యవసాయ పరంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రెండు పంటలకు కలిపి 10 వేల రూపాయల చొప్పున ఇస్తున్నప్పటికీ, ఆ డబ్బులు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలకే సరిపోతున్నాయి. దీనికంతటికీ కారణం మూడేళ్లవుతున్నా ప్రభుత్వం రుణ మాఫీ సొమ్మును అందరు రైతులకు విడుదల చేయకపోవడంతో పాటు, పంట రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ సొమ్మును ఏడేళ్లుగా చెల్లించకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో 2,86,755 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందుకు ఎకరానికి సరాసరి 30 వేల రూపాయలు ఖర్చు చేసినా 862 కోట్ల రూపాయలు అవుతుంది. యాసంగి సీజన్‌లో 650 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు పంట రుణాల కింద రెగ్యులర్‌గా ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడంలో కొర్రీలు విధిస్తున్నారు. పాత రుణాలకు వడ్డీలు చెల్లిస్తేనే తిరిగి రుణాలు ఇస్తున్నారు. రైతులు తీసుకునే పంట రుణాలను జీరో వడ్డీకే ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. రైతుల వద్ద వడ్డీ సొమ్ము తీసుకోకుండా అసలు మాత్రమే తీసుకోవాలని బ్యాంక్లర్లను ప్రభుత్వం ఆదేశిస్తున్నప్పటికీ బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. ముక్కు పిండి రైతుల వద్ద నుంచి వడ్డీ సొమ్మును వసూలు చేస్తున్నారు. రైతులు చెల్లించిన వడ్డీ సొమ్మును రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సిన ప్రభుత్వం ఏడేళ్లు గడుస్తున్నా కూడా చేయడం లేదు. 

రైతులపైనే వడ్డీ భారం..

పంట రుణాల వడ్డీ భారమంతా రైతులే భరిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 1444.74 కోట్ల రూపాయల పంట రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించింది. కానీ 69,733 మంది రైతులకు 835.31 కోట్ల రూపాయలు 57.82 శాతం మందికే రుణాలను ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,55,974 మంది రైతులకు 1672.06 కోట్ల రూపాయలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు జిల్లా రుణ ప్రణాళికలోనూ పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు జిల్లాలో 15శాతం మంది రైతులకు కూడా పంట రుణాలను ఇవ్వకపోవడం గమనార్హం. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. 25 వేల వరకు రుణాలున్న రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందరికీ రుణాలను మాఫీ చేయలేదు. గడిచిన మార్చిలోపు 50 వేల రుణాలున్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి వారికి కూడా ఇవ్వడం లేదు. రుణ మాఫీ సొమ్మును ప్రభుత్వం ఇవ్వని కారణంగా రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణ మాఫీ సొమ్ము, జీరో వడ్డీ బకాయిలు చెల్లించని కారణంగా రైతులు అప్పులపాలు కావాల్సి వస్తున్నది. దీనిని ఆసరా చేసుకుంటున్న బ్యాంకు అధికారులు లక్ష్యాల మేరకు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి తమకు లక్ష్యం మేరకు పంట రుణాలను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-06T05:40:46+05:30 IST