నీళ్లకుంటలో ముసుగు దొంగల స్వైరవిహారం

ABN , First Publish Date - 2022-05-25T06:15:30+05:30 IST

మున్సిపాలిటీలోని నీళ్లకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారు ఝామున ముసుగు దొంగలు మూడు ఇళ్లలో జొరబడి సుమారు రూ.లక్ష విలువైన నగలు, నగదు దోచుకుపోయారు

నీళ్లకుంటలో ముసుగు దొంగల స్వైరవిహారం
బీరువాలు తెరిచి నగలు, నగదు దోపిడీ చేశారని చెబుతున్న లక్ష్మమ్మ

రూ.లక్షకు పైగా బంగారు, నగదు దోపిడీ 


పలమనేరు, మే 24: మున్సిపాలిటీలోని నీళ్లకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారు ఝామున ముసుగు దొంగలు మూడు ఇళ్లలో జొరబడి సుమారు  రూ.లక్ష  విలువైన నగలు, నగదు దోచుకుపోయారు. నీళ్లకుంటలో మంగళవారం తెల్లవారు ఝామున సుమారు 1.30 గంటల ప్రాంతంలో ప్రకాష్‌, లక్ష్మమ్మ దంపతులు  ఇంటి తలుపు తాళం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు.  పడక గదిలో బీరువాలు తెరుస్తుండగా ప్రకాష్‌, లక్ష్మమ్మ మేలుకోగానే సెల్‌ఫోన్‌ లైట్‌లో కత్తి, రాడ్‌ చూపి బెదిరించారు. తాము 10మంది వచ్చామని, ఇంటి వెలుపల మిగిలిన వారు ఉన్నారంటూ భయపెట్టారు. ఆ తరువాత బీరువాలోని బంగారు కమ్మలు, మాటీలు, ఉంగరం సహా  వెండి ఉంగరం, రూ.5000 అలాగే దేవుడి వద్ద  హుండీలో దాచుకొన్న రూ.7000 తీసుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఇంటి తలుపు బయటి గడియపెట్టారు. వీరి పక్కనే నివాసముంటున్న ఆనంద్‌, గాయత్రి ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోనికెళ్లి  బీరువా తలుపులు తెరిచి అందులో ఏమీ లేకపోవడంతో పక్కింటికి వెళ్లారు. దొడ్ల డెయిరీలో పనిచేసే ముంతాజ్‌ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి జొరబడ్డారు. కాగా ముంతాజ్‌ హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లో  బీరువాను ధ్వంసం చేసి  రెండు జతల బంగారు కమ్మలు, పర్సులో ఉన్న రూ.10 వేలు చోరీ చేశారు.  కాగా దోపిడీ దొంగలు తెలుగు, ఉర్దూలో మాట్లాడారని ప్రకాష్‌, లక్ష్మమ్మ తెలిపారు. వారు బైక్‌పై  వెళ్లినట్టు పేర్కొన్నారు.  అనంతరం నెం.100 కు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో లక్ష్మమ్మ తన అన్నకు సమాచారం అందించింది. ఆయన వచ్చి తలుపు గడియ తీశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాల్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-05-25T06:15:30+05:30 IST