మతసామరస్యానికి ప్రతీక.. ముత్తు మారెమ్మ జాతర

ABN , First Publish Date - 2022-08-11T04:54:14+05:30 IST

మండల కేంద్రంలోని అరవపల్లెలో వెలసిన ముత్తుమారెమ్మ జాతర ఈ నెల 13 నుంచి జరగనుంది. హిందూ-ముస్లింలు ఐక్యతతో నిర్వహించే ఈ జాతర మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవాలకు రాయలసీమ నలుమూలల నుంచే కాక తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

మతసామరస్యానికి ప్రతీక.. ముత్తు మారెమ్మ జాతర
ముత్తు మారెమ్మ ఆలయం

- 13 నుంచి ఉత్సవాలు ప్రారంభం

నందలూరు, ఆగస్టు 10: మండల కేంద్రంలోని అరవపల్లెలో వెలసిన ముత్తుమారెమ్మ జాతర ఈ నెల 13 నుంచి జరగనుంది. హిందూ-ముస్లింలు ఐక్యతతో నిర్వహించే ఈ జాతర మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవాలకు రాయలసీమ నలుమూలల నుంచే కాక తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

వందేళ్ల కిందట తమిళ కుటుంబానికి చెందిన అంకయ్య వీరస్వామి మొదలియార్‌లు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. వారి మరణానంతరం వీరస్వామి మొదలియార్‌ కుమారుడు పొన్నుస్వామి మొదలియార్‌ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి నోచుకొని భక్తజనుల ఆదరణ చూరగొంటోంది. అంకయ్య మొదలియార్‌ జీవించి ఉండే కాలంలో హుబ్లీ నుంచి ముత్తుమారెమ్మ ఉత్సవ విగ్రహాన్ని తెచ్చి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆయన ఆలయానికి తెచ్చిన ఈ విగ్రహం ప్రస్తుతానికి 50 ఏళ్లు దాటినా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ముత్తు అంటే ముత్యము అందువల్ల ఈ తల్లి ముత్యాల మారెమ్మగా కూడా పిలుస్తుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారి ఊరేగింపు, సోదరుడు పోతురాజుతో పాటు మండల కేంద్రం ప్రధాన వీధుల్లో బాణాసంచా పేలుళ్లతో భజన కార్యక్రమంతో మేళతాళాల వాయిధ్యాల నడుమ ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న అమ్మవారి ఊరేగింపు, 14న జాతర, 15న పాలపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సేలం చంద్రశేఖర మొదలియార్‌ తెలిపారు.

Updated Date - 2022-08-11T04:54:14+05:30 IST