Jammu and Kashmir : టీచర్‌పై ఉగ్రవాదుల కాల్పులు... మరో లక్షిత హత్య...

ABN , First Publish Date - 2022-05-31T17:34:41+05:30 IST

జమ్మూ-కశ్మీరులో మరో లక్షిత దాడి జరిగింది. ఓ వర్గానికి

Jammu and Kashmir : టీచర్‌పై ఉగ్రవాదుల కాల్పులు... మరో లక్షిత హత్య...

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో మరో లక్షిత దాడి జరిగింది. ఓ వర్గానికి చెందినవారిని వరుసగా హత్య చేస్తుండటంపై పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, వారికి భద్రత కరువవుతోంది. ఇటీవలే ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపి, హత్య చేశారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కశ్మీరు జోన్ పోలీసులు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, కుల్గాం జిల్లాలోని గోపాల్‌పుర ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయినిపై ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె సహోద్యోగులు ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ టీచర్ స్వస్థలం జమ్మూ అని తెలుస్తోంది. 


ఉగ్రవాదులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుండటం కొనసాగుతోంది. 2021లో ఈద్గా సంగం వద్ద సతీందర్ కౌర్, దీపక్ చంద్ అనే టీచర్లను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు.  ఇటీవల టీవీ నటి అమ్రీన్ భట్‌ను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు. ఆమెను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 

Updated Date - 2022-05-31T17:34:41+05:30 IST