వ్యక్తిత్వానికి ఒరవడి దిద్దిన గురువు

ABN , First Publish Date - 2022-05-09T08:35:09+05:30 IST

వ్య క్తి జీవించి ఉన్న సమయంలోనూ, ఆ తర్వాతా కూడా మన తలపులలో నిరంతరం మెదులుతూ ఉంటే ఆ వ్యక్తి మననుండి దూరంగా పోనట్లే. గురువుగారు భౌతికంగా మన నుండి వెళ్ళిపోయి దాదాపు...

వ్యక్తిత్వానికి ఒరవడి దిద్దిన గురువు

వ్య క్తి జీవించి ఉన్న సమయంలోనూ, ఆ తర్వాతా కూడా మన తలపులలో నిరంతరం మెదులుతూ ఉంటే ఆ వ్యక్తి మననుండి దూరంగా పోనట్లే. గురువుగారు భౌతికంగా మన నుండి వెళ్ళిపోయి దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా, ఆయన ఎదుట ఉన్నట్లే, నవ్వుతున్నట్లే, ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్లే ఉంది. రంగనాథాచార్యులుగారు ప్రాచ్యకళాశాలలో అధ్యాపకులు, ప్రధానాచార్యులు అయిన తరువాత ఆయనతో నా అనుబంధం అమాయకుడైన, జీవితానుభవంలేని, గురువు వెంట నడవడం తప్ప తెలియని శిష్యుడికి గురువుతో ఉండే అనుబంధమే. క్రమక్రమంగా మొదటి రెండు విశేషణాలలో మార్పు వచ్చే ఉంటుంది. కానీ గురువు వెంట నడవడం మాత్రం చివరి వరకూ సాగింది. పాఠం చెప్పిన గురువులెందరో ఉన్నా, గురువుగా భావించింది ఆయనొక్కడినే. ఆయనతో నాకు ఔపచారిక సంబంధం లేదు. ఆయనకు నేనెన్నడూ నమస్కారం చెప్పలేదు. కరచాలనమూ చేయలేదు. కుటుంబంలో ఒక అన్న, తండ్రి వంటి ఆత్మీయత.  


ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా ఆ కళాశాలను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ ప్రాచ్యకళాశాలగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన తనను తాను ఉన్నతీకరించుకోవలసి వచ్చింది. ఒకవైపు కళాశాల ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వంతో విశ్వవిద్యాలయంతో వ్యవహారం, విద్యాత్మకంగా తన స్థానాన్ని స్థాపించుకోవడం ఆయన ఎంతో సమర్థతతో నిర్వహించారు. ప్రాచ్య కళాశాలా... అంటే ఏమిటి? అనే దశ నుండి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల అనో, రంగనాథాచార్యుల కాలేజీ కదూ అనో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించే స్థితికి ఆయన కారణమయ్యారు. 


ఆయన ప్రధానాచార్యులుగా ఉన్నంత కాలం విద్యార్థి సంఘ ఎన్నికలు క్రమం తప్పకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి. కళాశాలలో ప్రతి నెలా ఒకటి రెండు సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. ప్రతి సంవత్సరం గురజాడ జన్మదినం తప్పనిసరిగా జరిపేవారు. ఆయన గురజాడ గురించి ప్రతి పర్యాయమూ అద్భుతంగా మాట్లాడేవారు. గురజాడను ఆయన ఎంత విస్తృతంగా అధ్యయనం చేశారో ఆలోచిస్తుంటే అబ్బురం కలుగుతుంది. కళాశాల ప్రతి సంవత్సరం ‘నెలవంక’ పేరుతో ఒక వార్షిక సంచికను ప్రచురించేది. రంగ నాథాచార్యులుగారు దాన్నొక విశిష్ట సాహిత్య పత్రికగా రూపొం దించారు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక సంచికలను వెలువరించారు. ప్రతి సంచికలోను ప్రముఖ భాషా సాహితీవేత్తలతో ముఖాముఖీలు, ఆ సంవత్సరం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాహిత్య, కళారంగాలలో జరిగిన ప్రముఖ సంఘటనలన్నీ దానిలో నమోదు చేసేవాళ్ళం. ఎప్పటికీ దాచు కోదగిన సాహిత్య సంచికలుగా ఆయన వాటిని రూపుదిద్దారు.


ఒక రచన చేయడం గురించీ, దాని ప్రచురణ గురించీ రంగనాథాచార్యులుగారి అభిప్రాయాలు దృఢమైనవి. ఆయన చేయగలిగినన్ని రచనలు చేయలేదనీ, ప్రచురించగలిగినన్ని రచనలు ప్రచురించలేదనీ ఆయనను తెలిసిన వారందరికీ చాలా అసంతృప్తి. ఒక విధంగా భాషాసాహిత్యరంగాలకు ఆయన అన్యాయం చేశాడన్న భావన కూడా ఎందరికో ఉంది. ఆయన ఏ విషయంలోనైనా చాలా సెలెక్టివ్‌. అవసరానికి మించి కూడా నేమో (తీర్పు ఆయనదే తప్ప మరెవరిదీ కాదు). ఆయన ప్రసంగాలూ, వ్యాసాలూ ఏవీ అలవోక రచనలు కావు. ఆయన ఏ ప్రసంగమూ పూర్తి సంసిద్ధత లేకుండా చేసినది కాదు. వివిధ సందర్భాలలో, సెమినార్లలో, రిఫ్రెషర్‌ కోర్సుల్లో ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. ప్రతి ప్రసంగమూ అమూల్యమైనదే. ఈ ప్రసంగాలన్నీ లిఖిత రూపంలోకి వచ్చి, ప్రచురించవలసినవే. ప్రతి ప్రసంగానికీ, పాఠానికీకూడా నోట్స్‌ రాసుకుంటారు. అవన్నీ ఎటుపోయాయో.


రంగనాథాచార్యులుగారి ప్రచురిత రచనలన్నీ వ్యక్తులో, సంస్థలో కోరి రాయించుకున్నవి. చందుమీనన్‌ కేంద్ర సాహిత్య అకాడమీ కోసం అనువాదం. అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ కోసం రాసిన మోనోగ్రాఫ్‌. సామయిక వ్యాసాలు, పరిచయాలూ-ప్రస్తావనలూ, బహుముఖం వ్యక్తులు తమ గ్రంథాలకు కోరి రాయించుకున్న ముందుమాటలు, జర్నల్స్‌ అడిగి రాయించుకున్న వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, సంస్థలు విశేష సందర్భాలలో కోరి రాయించుకున్నవి. తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక సార స్వత వేదిక సంకలనాలకు రాసిన సంపాదకీయ వ్యాసాలు. తనకు తానుగా రాసింది తన పిహెచ్‌.డి. సిద్థాంత గ్రంథమే. అది డిగ్రీ కోసం చేసిన పరిశోధన. ప్రాచ్య విద్య ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని రాసిన చారిత్రక నివేదిక. ‘తెలుగులో తొలి కథానికలు’ మాడభూషి రంగాచార్యుల స్మారకోపన్యాసం. ఆధునికత మీద ఒక సిద్ధాంత గ్రంథం రాయాలని తలంపు. అది ఆయనకు సంతృప్తినిచ్చే విధంగా పూర్తి కాలేదు. ఎన్నో డ్రాఫ్టులు రాశారు. తీసి వేశారు. చివరిగా చేసిన ప్రయత్నం మళ్ళీ తాజాగా రాయబోతే అస్థిపంజరంలాగా తయారయిందని రాసుకున్నారు. తాను రాసిన వాటిలో కొన్ని పునర్ముద్రణ చేయవద్దనీ, కొన్ని ముద్రణయోగ్యం కాదనీ, కొన్ని తిరిగి రాయవలసివనీ, కొన్ని కాలం చెల్లిపోయినవనీ రాసుకున్నారు. 1990లలోనే ఆయనకొక సాహిత్య పత్రికను వెలువరించాలనే కోరిక ఉండేది. ఒకసారి కూర్చుని నాతో, చక్రపాణిగారితో ఈ విషయం చర్చించారు. పత్రికకు సంబంధించిన అతిచిన్న విషయాలతోసహా సమగ్రమైన ప్రణాళిక వేశారు. ఆయన ఆదర్శాలు, అభిప్రాయాలకు అనుగుణంగా పత్రికను తేవచ్చు కాని, దాని పంపిణీ తదితర వ్యవస్థల విషయం అంత తేలికయింది కాదు. ఈ కోరిక కూడా అలాగే ఉండి పోయింది.


సన్మానాలంటే ఇష్టం లేదు. ఏ సభలో నయినా ఎవరైనా బలవంతంగా శాలువా కప్పినా, పూలమాల వేసినా ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ కారణంతోనే కొన్ని సభలకు వెళ్ళేవారు కాదు. అవార్డుల పట్ల కూడా ఆయనకు ఆసక్తి లేకపోగా వ్యతిరేకత కూడా. మొదటిలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుతప్ప ఆయన మరే అవార్డు స్వీకరించలేదు. పెద్దమొత్తంలో నగదు పురస్కారాలు ఇస్తామని ముందుకు వచ్చిన సంస్థల ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పుస్తకాలు అంకితమివ్వడం, అంకితం తీసుకోవడం ఫ్యూడల్‌ సంస్కృతి అని ఆయన విశ్వాసం. ఇది బహుశా వెయ్యేళ్ళ తెలుగు ఆస్థాన సాహిత్యం ప్రభావం కావచ్చు. తన పుస్తకాలను ఎవరికీ అంకితం ఇవ్వలేదు, తనకు అంకితమిస్తామని ఎందరు ప్రాధేయపడినా అంగీకరించలేదు.


శిష్యులమీద రంగనాథాచార్యులుగారు తన అభిప్రాయాలను ఎన్నడూ రుద్దలేదనీ, అసలు మీరిలా ఉండండనికాని, ఇలా చేయండనికాని చెప్పలేదనీ, తన రాజకీయ, భాషా సాహిత్య, సామాజిక దృక్కోణాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించలేదనీ ఏ విద్యార్థినడిగినా చెప్తారు. పాఠం ఎప్పుడూ విషయ ప్రధానమే. దాన్ని చెప్పడంలో తనదైన విశ్లేషణ ఉంటుంది. ప్రత్యేకత ఉంటుంది. శిష్యులు ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది గమనిస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆయనొక ప్రమాణం కూడా అయ్యారు. ఒక వ్యాసం రాసినా, ఒక పుస్తకం అనువదించినా ఆయన చూడక తప్పదు. ఆయన చూస్తే ఏమనుకుంటారో అన్న ఆలోచనే రాస్తున్నంతసేపూ వెంటాడుతుంది. ఆయనొక దర్పణం. మనల్ని మనం ఆ దర్పణంలో చూసుకొని మనపై మనం తీర్పు చెప్పుకుంటాం. అదీ ఆయన ప్రభావం. మనల్ని మనం చెక్‌ చేసుకోవడంలో ఆయన పాత్ర అది.


రంగనాథాచార్యులుగారితో ఏమాత్రం పరిచయంలోకి వచ్చిన వారిపైనైనా ఆయన ప్రభావం ఉండక తప్పదు. ఆయనను గురించి రాయాలంటే చాలామందికి తమ ఆత్మకథ రాసుకున్నట్లుగానే ఉంటుంది. కనీసం అది వారి జీవితంలో ప్రధానమైన, ప్రభావవంతమైన భాగమై ఉంటుంది. ఎక్కడ ఈ కథనాన్ని ముగించగలం.  

దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

(మే 15 కె. రంగనాథాచార్యులుగారి ప్రథమ వర్ధంతి)


Read more