మోసంతో పెళ్లి చేసుకున్న స్వలింగ సంపర్కుడికి బెయిలు నిరాకరణ

ABN , First Publish Date - 2022-04-08T23:53:05+05:30 IST

తాను స్వలింగ సంపర్కుడిననే విషయం చెప్పకుండా ఓ యువతిని

మోసంతో పెళ్లి చేసుకున్న స్వలింగ సంపర్కుడికి బెయిలు నిరాకరణ

ముంబై : తాను స్వలింగ సంపర్కుడిననే విషయం చెప్పకుండా ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడికి ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు మహారాష్ట్రలోని థానే సెషన్స్  కోర్టు తిరస్కరించింది. 2021 నవంబరు 20న వీరికి వివాహం జరిగింది. అయితే మూడు నెలల వరకు మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. వీరికి ఓ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరిచయమైంది, ఆ తర్వాత కొన్నిసార్లు కలుసుకుని, తమ కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 


ఫిర్యాదుదారు (భార్య) తరపున న్యాయవాది వీఏ కులకర్ణి వాదనలు వినిపిస్తూ, పెళ్లికి ముందు భర్త ముఖ్యమైన అంశాలను దాచిపెట్టారని ఆరోపించారు. భర్త స్వలింగ సంపర్కుడని, హోమోసెక్స్‌లో పాల్గొనేవాడని, తన భార్యను మోసం చేశాడని చెప్పారు. ఆయన తన భార్య జీవితాన్ని సర్వనాశనం చేశాడని, ఆయనకు స్త్రీలపట్ల ఆసక్తి లేదన్నారు. 


రబలే పోలీసులు ఆ భర్త ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన భర్త, తన ఇతర పురుష భాగస్వాములతో జరిపిన సంభాషణల వివరాలు ఉన్నాయని దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. ఆయనకు పురుషులపైనే ఆసక్తి ఉందనే విషయం ఈ చాట్స్ ద్వారా వెల్లడవుతోందన్నారు. అంతేకాకుండా నిందితుడు పెరియనల్ వార్ట్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని, ఆ విషయాన్ని కూడా ఆయన పెళ్లికి ముందు తన భార్యకు చెప్పలేదని తెలిపారు. అత్యధిక జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని, బోగస్ జాబ్ ఆఫర్ లెటర్‌ను పెళ్లికి ముందు చూపించాడన్నారు. దీనిపై కూడా విచారణ జరపాలన్నారు. ఆయనకు ముందస్తు బెయిలును మంజూరు చేస్తే, ఆయన విడుదలైన తర్వాత దర్యాప్తునకు అందుబాటులో ఉండరని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని తెలిపారు. ఆయనను కస్టడీలో ఉంచి విచారించడం అవసరమని చెప్పారు. 


పిటిషనర్ (భార్య) మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడంపైనే తన భర్తకు ఆసక్తి ఉందని తెలిపారు. తనకు లక్షలాది రూపాయల నష్టం జరిగిందన్నారు. పెళ్లికి రూ.18,90,000 ఖర్చయిందని చెప్పారు. 


దంపతులు హనీమూన్‌కు వెళ్లినపుడు భర్త శోభనాన్ని తప్పించుకున్నట్లు కోర్టు గమనించింది. తనకు ఓ వ్యాధి ఉందని చెప్పి, సెక్స్ చేయలేదని, ఆయనకు స్త్రీల పట్ల ఆసక్తి లేదని గుర్తించింది. హిందూ వివాహం అంటే మతపరమైన పవిత్ర కార్యమని అదనపు సెషన్స్ జడ్జి రాజేశ్ గుప్తా ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. ఓ స్త్రీ, ఓ పురుషుడు శాశ్వత బంధంలో ఉండేలా వివాహం దోహదపడుతుందని తెలిపారు. ధర్మం, సంతానోత్పత్తి, శృంగార ఆనందాలతోకూడిన శారీరక, సాంఘిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం స్త్రీ, పురుషులు శాశ్వత బంధంలో ఉండేలా వివాహ వ్యవస్థ దోహదపడుతుందని తెలిపారు. 


ప్రస్తుత కేసులో భార్యాభర్తలు పరస్పర సమ్మతితో వివాహం చేసుకున్నట్లు జడ్జి గుర్తించారు. ప్రాథమికంగా చూసినపుడు భర్త తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన యథార్థాలను పెళ్లికి ముందు దాచిపెట్టినట్లు, ఆయన మోసపూరిత ఉద్దేశంతో వ్యవహరించినట్లు, తద్వారా ఓ యువతి భవిష్యత్తును నాశనం చేసినట్లు  కనిపిస్తోందన్నారు. 


దర్యాప్తు జరుగుతున్నందువల్ల యోగ్యతల గురించి ఇప్పుడు చర్చించడం తొందరపాటు అవుతుందన్నారు. మోసం చేయాలన్న ఉద్దేశంతోనే పురుషుడు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక నష్టం కలిగించారని, ఆమె జీవితానికి తీరని నష్టం కలిగించారని తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు తిరస్కరించారు. 


Updated Date - 2022-04-08T23:53:05+05:30 IST