పోలీసుల అరాచకాలపై ఐక్య పోరాటం

ABN , First Publish Date - 2022-08-08T09:33:35+05:30 IST

జిల్లాలో పోలీసు అరాచకాలపై ప్రతిపక్ష పార్టీన్నింటినీ కలుపుకొని ఐక్యం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు.

పోలీసుల అరాచకాలపై ఐక్య పోరాటం

ఎస్సీ కమిషన్‌ జోక్యంతోనే ‘నారాయణ’కు న్యాయం: సోమిరెడ్డి

నెల్లూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసు అరాచకాలపై ప్రతిపక్ష పార్టీన్నింటినీ కలుపుకొని ఐక్యం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం, కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రం పరిరక్షణ అంశాలపై కూడా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐలు తమతో చేరాయని, బీజేపీ, జనసేనలను కూడా కలుపుకొంటామని చెప్పారు. ఆదివారం అల్లీపురంలోని తన నివాసంలో ఉదయగిరి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పోలీసుల దారుణాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యేలు ఏం చెబితే సీఐలు, ఎస్సైలు అది చేస్తున్నారని దుయ్యబట్టారు. డీఎస్పీలు చేతులెత్తేస్తుంటే ఎస్పీ వీరిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కమిషన్‌ జోక్యం చేసుకోకపోతే నారాయణ కుటుంబానికి న్యాయం జరిగేది కాదన్నారు. 


తాను, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఈ నెల 5వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సాంప్లాను కలిసి నారాయణ అంశాన్ని తెలియజేశామని వెల్లడించారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర డైరెక్టర్‌ను విచారణకు పంపారని చెప్పారు. ఇది తెలిసి నారాయణ భార్య పద్మ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని, పింఛన్‌ మంజూరు చేశారని, ఇంటి స్థలం, భూమితోపాటు ఉద్యోగం ఇచ్చారని పేర్కొన్నారు. పొదలకూరు ఎస్‌ఐ కరీముల్లా అరాచకాలు అనేకం ఉన్నాయని, వాటన్నింటినీ బయటపెడతామని అన్నారు. మర్రిపాడు ఎస్‌ఐ తీరుతో దివ్యాంగుడు తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖరాస్తే నేరుగా ఎస్సై, మరికొంత మందిని డీజీపీనే సస్పెండ్‌ చేశారని గుర్తుచేశారు. ఎస్సై స్థాయి అధికారిని డీజీపీ సస్పెండ్‌ చేస్తే జిల్లా ఎస్పీకి అవమానంగా లేదా అని ప్రశ్నించారు. ముత్తుకూరు ఎస్సై రౌడీయిజం చేస్తుంటే ఎస్పీ కౌన్సెలింగ్‌ ఇస్తామంటూ సమాధానం చెప్పడం దారుణమన్నారు. ఈ సమావేశంలో నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. 


టీడీపీ అండగా నిలిచింది: పద్మ

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జెన్ని రమణయ్యలతోపాటు టీడీపీ నేతలు, మీడియా తమ కుటుంబానికి అండగా నిలిచిందని ఉదయగిరి నారాయణ భార్య పద్మ అన్నారు. తన భర్తను అన్యాయంగా కొట్టి చంపారని ఆమె ఆరోపించారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌, ఎంపీటీసీలు వచ్చి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు కట్టలేదన్నారు. తాను శోకంలో ఉన్నప్పుడు తన భర్త దేహాన్ని ఖననం చేసేశారని పద్మ ఆవేదన చెందారు.

Updated Date - 2022-08-08T09:33:35+05:30 IST