భారత్ పవర్ గ్రిడ్లపై చైనా గూఢచర్యం : రికార్డెడ్ ఫ్యూచర్

ABN , First Publish Date - 2022-04-08T00:02:30+05:30 IST

ఉత్తర భారత దేశంలోని దాదాపు ఏడు ఇండియన్ స్టేట్

భారత్ పవర్ గ్రిడ్లపై చైనా గూఢచర్యం : రికార్డెడ్ ఫ్యూచర్

న్యూఢిల్లీ : ఉత్తర భారత దేశంలోని దాదాపు ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్ (SLDCs)పై చైనా ప్రభుత్వ అనుబంధ సైబర్ గ్రూపులు గూఢచర్యం చేసినట్లు అమెరికాలోని సైబర్ సెక్యూరిటీ గ్రూప్ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ వెల్లడించింది. SLDCలు ఉత్తర భారత దేశంలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, గ్రిడ్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు, నిరంతరం కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. 


ఏయే పవర్ గ్రిడ్లపై చైనా సంస్థలు గూఢచర్యం చేశాయో రికార్డెడ్ ఫ్యూచర్ నిర్దిష్టంగా వెల్లడించలేదు. అయితే భారత్-చైనా మధ్య లడఖ్‌లో వివాదం జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోనే ఈ గూఢచర్యం జరిగిందని చెప్పింది. దీనికి సంబంధించిన ఓ మ్యాపును కూడా విడుదల చేసింది. దీనిలో ఏడు ప్రదేశాలను మార్క్ చేసింది. ఈ గూఢచర్యం కోసం ఉపయోగించిన షాడోప్యాడ్ అనే టూల్‌ను చైనా రాజ్య భద్రత మంత్రిత్వ శాఖ కాంట్రాక్టర్ల నుంచి వచ్చినట్లు తెలుస్తోందని పేర్కొంది. ఈ టూల్‌కు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సన్నిహిత అనుబంధం ఉన్నట్లు పేర్కొంది. 


2021 ఫిబ్రవరిలో సరిహద్దుల నుంచి భారత్, చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత ఈ గూఢచర్య కార్యకలాపాలు మొదలవడం గమనార్హం. భవిష్యత్తు కార్యకలాపాల కోసం భారత దేశ విద్యుత్తు మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఈ విధంగా దొడ్డి దారిలో సేకరిస్తున్నట్లు రికార్డెడ్ ఫ్యూచర్ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఏదైనా బ్లాక్‌అవుట్ సంఘటన జరిగిందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు. 


2021 ఫిబ్రవరిలో వేరొక చైనీస్ గ్రూప్ ఇదే విధంగా దాడి చేసినట్లు బయటపడింది. తాజాగా 2021 ఆగస్టు 27 నుంచి 2022 మార్చి 15 వరకు సైబర్ గూఢచర్యం  జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓ మల్టీనేషనల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ కంపెనీపైనా, నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌పైనా సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. 


2020 అక్టోబరులో ముంబైలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. దీనికి కారణం మాల్‌వేర్ దాడి అయి ఉండవచ్చునని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ అనుమానం వ్యక్తం చేసింది. పడ్ఘాలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో మాల్‌వేర్‌ను అక్రమంగా ప్రవేశపెట్టడం వల్ల ఈ దారుణం జరిగిందని తెలిపింది. 


ఈ గూఢచర్య కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరాలు, ఇంటర్నెట్ ఆపరేటెడ్ డిజిటల్ వీడియో రికార్డింగ్ డివైస్‌లను సురక్షితం కాని రీతిలో చైనా సంస్థలు ఉపయోగించే అవకాశం ఉందని రికార్డెడ్ ఫ్యూచర్ తెలిపింది.

  

Updated Date - 2022-04-08T00:02:30+05:30 IST