నల్లమలలో విహారం.. మధుర జ్ఞాపకం

ABN , First Publish Date - 2022-10-03T05:35:16+05:30 IST

ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కోల్పోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించినా లభించని ఆనందాన్ని అనుభూతులను పొందేందుకు ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

నల్లమలలో విహారం.. మధుర జ్ఞాపకం
ఎకోటూరిజం ముఖద్వారం

1 నుంచి ఎకో టూరిజానికి అనుమతి

ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అవకాశం

కలసివచ్చిన దసరా సెలవులు

పెద్ద దోర్నాల, అక్టోబరు 2 : ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కోల్పోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించినా లభించని ఆనందాన్ని అనుభూతులను పొందేందుకు ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అటవీ ప్రాంతం ఆహ్వానం పలుకుతోంది. అటవీ శాఖాధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.


భూతల స్వర్గం నల్లమల కానల

ఎటుచూసినా పచ్చని సోయగాలతో ఎత్తైన వృక్ష సంపదను కలిగి, వేల రకాల పక్షి జాతి సంపదతో నల్లమల అటవీప్రాతం పర్యాటకులకు మధుర జ్ఞాపకాలను మిగుల్చుతోంది. చల్లని గాలి తెంపరలు శరీరాన్ని తాకుతుండగా వంపులు తిరిగిన సుందరమైన నల్లని ఘాట్‌రోడ్లపై ప్రయాణం మనస్సుకు హాయినిస్తుంది. అక్కడక్కడా చెంగుచెంగున ఎగురుతూ అటవీ ప్రాంతంలో చెట్ల పొదల్లోకి వెళుతున్న జింకల సమూహం కనుల పండువగా ఉంటుంది. అసలే వర్షాకాలం కావడంతో అడవంతా నేలపై పచ్చికతో తివాచీ పరిచినట్లుండి నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తూ కనువిందు చేస్తాయి. లోతైన లోయలు సాహసికుల మనస్సును ఉప్పొంగేలా చేస్తాయి. రకరకాల అడవిపూలు సువాసలను వెదజల్లుతూ మైమరిపిస్తాయి. ప్రయాణంలో అడుగడుగూ ఓ అనుభూతిగానే మిగిలిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.


 1 నుంచి సందర్శన

పర్యావరణ ప్రేమికుల కోసం అటవీ శాఖాధికారులు శ్రీశైలం-దోర్నాల ఘాట్‌ రోడ్డులో మండలంలోని తుమ్మలబైలు వద్ద, ఆత్మకూరు-దోర్నాల ఘాట్‌ రోడ్డులో  బైర్లూటి వద్ద ఎకోటూరిజం ఏర్పాటు చేశారు. ఆసక్తి కలిగిన పర్యావరణ ప్రేమికులను అటవీ లోతట్టు ప్రాంతాన్ని తిలకించేందుకు  ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు.  జీపుల్లో తీసుకువెళ్లి అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ సంతోషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పులుల అభివృద్ధి కోసం రెండు నెలలుగా ఎకోటూరిజం సందర్శన నిలిపివేశారు. తిరిగి అక్టోబరు ఒకటవ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు రేంజ్‌ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు.దీంతోపాటు భక్తులు ఎంతో ఇష్టంగా కొలిచే ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి కూడా ఏర్పాటు చేశారు. అక్టోబరు 5న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ సెలవుల్లో నల్లమల అటవీ విహారం ఎంతో ప్రాధాన్నతను సంతరించుకోనుంది.ప్రధానంగా శ్రీశైలం పుణ్యక్షేతం దర్శనంతో పాటు డ్యాం, అటవీ ప్రయాణం పదికాలాల పాటు మధురస్మతులుగా నిలిచిపోనున్నాయి.



Updated Date - 2022-10-03T05:35:16+05:30 IST