ఆత్మ దర్శనమా? ఆత్మానుభవమా?

ABN , First Publish Date - 2022-09-02T09:00:32+05:30 IST

చంద్రుణ్ణి సైగ చేసి చూపాలా, అరచేతితోనా, చూపుడు వేలితోనా? అనే సందిగ్ధంలో ఉంటే... దృష్టి చంద్రుడి మీదకు పోదు. చంద్రుణ్ణి చూపే ఏ సాధనమైనా సరైనదే.

ఆత్మ దర్శనమా?  ఆత్మానుభవమా?

చంద్రుణ్ణి సైగ చేసి చూపాలా, అరచేతితోనా, చూపుడు వేలితోనా? అనే సందిగ్ధంలో ఉంటే... దృష్టి చంద్రుడి మీదకు పోదు. చంద్రుణ్ణి చూపే ఏ సాధనమైనా సరైనదే. అలాగే ఆత్మవైపు మన దృష్టిని తీసుకువెళ్ళే ఏ పదమైనా సరైనదే.


నిర్గుణమైన, నిరాకారమైన, అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని ఒక పదబంధంలో ఇమడ్చలేము. అయినా ఏదో ఒక పదం వాడాలి కాబట్టి... ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం, ఆత్మానుభవం లాంటి మాటలను పర్యాయపదాలుగా ఉపయోగిస్తున్నాం. అయితే, ఆత్మ సాక్షాత్కారం అనే మాట ఉండదు. ‘‘‘సాక్షాత్కారం’ అంటే ఏదో కొత్తగా రావడం. ఆత్మ ఆత్మగా అనుభవంలోకి వస్తుంది కానీ, కొత్తగా ఏమీ రాదు. కాబట్టి ఆత్మానుభవం లేదా అద్వైతానుభవం అనాలి’’ అని ఒక సందర్భంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటీశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో నిజం ఉంది. అయితే వేరే పదాలను ఉపయోగించడంలో తప్పు లేదు. నిరాకారమైన, అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని ఒక పదబంధంలో ఇమడ్చలేము. అయినా ఏదో పదం వాడాలి కాబట్టి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం, ఆత్మానుభవం వంటి పదాలను పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి. 


ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన శ్రీ ఆత్మానంద కృష్ణ మీనన్‌ తన ఆత్మదర్శనం పుస్తకంలో... అద్వైత సంప్రదాయంలోనే ఒక ప్రత్యక్ష మార్గాన్ని ప్రబోధించారు. ‘ఆత్మ సాక్షాత్కారం’ అనే మాటకు వర్తించే అభ్యంతరమే ఆ ఆత్మ దర్శనానికి కూడా వర్తించాలి. ఆత్మ దర్శనం అంటే... ఆత్మను దర్శించేది వేరే ఉందని అర్థం. ‘అది ఎవరు?’ అనే ప్రశ్న వస్తుంది. కానీ, ఆత్మానంద చెప్పిన ఆత్మదర్ళనం వేరు. దీనికోసం ప్రత్యక్ష మార్గంలో... ఏ అనుభవం లేని సమాధి స్థితికి సాధకుడు చేరనవసరం లేదు. ఎందుకంటే, అన్ని అనుభవాలూ చైతన్యంతోనే ప్రకాశితమై, చైతన్యంలోనే అవగతం అవుతాయి. సాధకుడు చేయవలసిందల్లా... అన్ని అనుభవాల వెనుక ఉన్న ఆ చైతన్యాన్ని చూడడమే. 


అలాగే ‘ఆత్మానుభవం’ అనే పదం కూడా సరైనది కాదనే వాదన చెయ్యవచ్చు. అనుభవం మనసుకు సంబంధించినదనీ, ఆత్మకు సంబంధించినది కాదనీ వేదాంత సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ఆశ్రమాధిపతి, శ్రీరామకృష్ణ మఠానికి చెందిన సన్యాసి శ్రీ సర్వప్రియానందస్వామి పేర్కొన్నారు. ఆత్మ ప్రకాశంలో... మనసు, ఇంద్రియాల కలయిక నుంచి అనుభవం పుడుతుందని ఆయన అంటారు. ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులతో పాటు... బౌద్ధం, పాశ్చాత్య తత్త్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలను కూడా ఆయన క్షుణ్ణంగా చదివారు. హార్వర్డ్‌ డివినిటీ స్కూల్‌లో ఏడాది శిక్షణకోసం ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 


ఇలా తరచి చూస్తే.. అందరూ చెప్పేది ఆత్మతత్త్వం గురించే అయినప్పుడు... ఈ తేడాలన్నీ కేవలం పరిభాషకు సంబంధించినవిగా తోస్తాయి. కాబట్టి ఏ పదం సరైనదనే మీమాంస అనవసరం. 


‘ఫింగర్‌ పాయింటింగ్‌ టు ది మూన్‌’ అని ఆంగ్లంలో ఒక ప్రయోగం ఉంది. ఆత్మ సాక్షాత్కారం అన్నా, ఆత్మ దర్శనం అన్నా, ఆత్మానుభవం అన్నా, ఆత్మ జ్ఞానం అన్నా... ఈ పదాలన్నీ చంద్రుణ్ణి చూపే ప్రక్రియలని అనుకుందాం. చంద్రుణ్ణి సైగ చేసి చూపాలా, అరచేతితోనా, చూపుడు వేలితోనా? అనే సందిగ్ధంలో ఉంటే... దృష్టి చంద్రుడి మీదకు పోదు. చంద్రుణ్ణి చూపే ఏ సాధనమైనా సరైనదే. అలాగే ఆత్మవైపు మన దృష్టిని తీసుకువెళ్ళే ఏ పదమైనా సరైనదే. 


దాసుకిరణ్‌

www.dasubhashitam.com


Updated Date - 2022-09-02T09:00:32+05:30 IST