అంధుడి పింఛన్‌ నొక్కేసిన వలంటీర్‌

ABN , First Publish Date - 2022-10-03T05:40:04+05:30 IST

దివ్యాంగుడి పింఛన్‌ డబ్బులను వలంటీర్‌ నొక్కేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పామూరులోని ఎర్రచేలు ప్రాంతానికి చెందిన అంధుడు షేక్‌ మస్తాన్‌ బాషాకు రావాల్సిన 22 నెలల దివ్యాంగుల పింఛన్‌ సొమ్మును ఆ ప్రాంత వలంటీర్‌ పీవీ కృష్ణ మింగేశాడు. షేక్‌ మస్తాన్‌కు రెండు కళ్లూ కనపడవు. దివ్యాంగుల కోటా కింద 2020 నవంబరులో ఆయనకు పింఛన్‌ మంజూరైంది.

అంధుడి పింఛన్‌ నొక్కేసిన వలంటీర్‌
అంధుడు షేక్‌ మస్తాన్‌

ఆలస్యంగా వెలుగుచూసిన నిర్వాకం  

అధికారులకు ఫిర్యాదు చేసిన వెల్ఫెర్‌ అసిస్టెంట్‌

పామూరు, అక్టోబరు 2 : దివ్యాంగుడి పింఛన్‌ డబ్బులను వలంటీర్‌ నొక్కేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పామూరులోని ఎర్రచేలు ప్రాంతానికి చెందిన అంధుడు షేక్‌ మస్తాన్‌ బాషాకు రావాల్సిన 22 నెలల దివ్యాంగుల పింఛన్‌ సొమ్మును ఆ ప్రాంత వలంటీర్‌ పీవీ కృష్ణ మింగేశాడు. షేక్‌ మస్తాన్‌కు రెండు కళ్లూ కనపడవు. దివ్యాంగుల కోటా కింద 2020 నవంబరులో ఆయనకు పింఛన్‌ మంజూరైంది. నెలకు రూ.3వేలు ప్రభుత్వం నుంచి వస్తోంది. అయితే వలంటీర్‌ అతనికి పింఛన్‌ పాస్‌బుక్‌గానీ, మంజూరు పత్రం గానీ  ఇవ్వలేదు. అయితే ప్రతి నెలా బాషా అమ్మకు పింఛన్‌ ఇచ్చేందుకు వలంటీర్‌ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. ఈక్రమంలో బాషా వేలిముద్రలు కూడా తీసుకునేవాడు. తన పింఛన్‌ పరిస్థితి ఏమైందని బాషా అడుగుతున్న ప్రతిసారీ ఇంకా మంజూరు కాలేదని వలంటీర్‌ కృష్ణ చెప్పేవాడు. మంజూరు కోసమే నీతో వేలిముద్ర వేయిస్తున్నానని నమ్మబలికేవాడు. అలా ప్రతి నెలా మస్తాన్‌ బాషాకు వచ్చే రూ.3వేల పింఛన్‌ డబ్బులను గుట్టుగా వలంటీర్‌ నొక్కేసాడు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లయినా మంజూరు కాకపోవడం, ప్రతి నెలా వలంటీర్‌ వేలిముద్రలు తీసుకోవడంపై బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు సచివాలయ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు ఈ విషయం చెప్పారు. వెంటనే విచారించిన వెల్ఫేర్‌ ఆఫీసర్‌ బాషాకు పింఛన్‌ మంజూరైనట్లు గుర్తించారు. వెంటనే అక్టోబరు నెలకు సంబంధించిన పింఛన్‌ రూ.3వేలు లబ్ధిదారుడికి ఇప్పించారు.  వలంటీర్‌ కొట్టేసిన మిగతా పింఛన్‌ డబ్బులు మొత్తం రూ.66వేలను త్వరలో బాధితుడికి ఇప్పిస్తామని అంగీకార పత్రం రాసుకున్నారు. వలంటీర్‌ అక్రమాన్ని వెల్ఫేర్‌ ఆఫీసర్‌ షరీఫ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండురోజుల్లో పూర్తి పింఛన్‌ డబ్బులు ఇవ్వకపోతే వలంటీర్‌పై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హెచ్చరించినట్లు వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పింఛన్‌దారులు కోరుతున్నారు. 


Updated Date - 2022-10-03T05:40:04+05:30 IST