Antarctica: అంటార్కిటికాలోని హిమానీ నదం నుంచి రక్తప్రవాహం.. శాస్త్రవేత్తలకూ అంతుబట్టని రహస్యం.. కారణం కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2022-10-01T21:19:58+05:30 IST

మానవ మెదడుకు అందని వింతలు, విశేషాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కొన్ని అంశాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

Antarctica: అంటార్కిటికాలోని హిమానీ నదం నుంచి రక్తప్రవాహం.. శాస్త్రవేత్తలకూ అంతుబట్టని రహస్యం.. కారణం కోసం అన్వేషణ

మానవ మెదడుకు అందని వింతలు, విశేషాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. సాంకేతికంగా ఎంత పురోగతి సాధించినా ఈ ప్రకృతిలోని కొన్ని అద్భుతాల వెనుక రహస్యాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం.  కొన్ని అంశాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అలాగే అంటార్కిటికాలోని ఓ హిమానీ నదం నుంచి బయటకు వస్తున్న ఎర్రని ద్రవం గురించి కూడా అంతు చిక్కడం లేదు. ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉండే అంటార్కిటికాలోని (Antarctica) ఓ ప్రాంతంలో ఉన్న గడ్డ కట్టిన జలపాతం నుంచి రక్తం లాంటి చిక్కని ఎర్రటి ద్రవం వెలువడుతోంది.


ఇది కూడా చదవండి..

Water Diet: నీళ్లు, నిమ్మరసంతోనే జీవనం.. 41 ఏళ్లుగా ఆహారానికి దూరంగా ఉంటున్న మహిళ!


తూర్పు అంటార్కిటికాలోని విక్టోరియా ల్యాండ్‌లో ఉన్న టేలర్ గ్లేసియర్ నుంచి కొన్ని దశాబ్దాలుగా రక్తం లాంటి ద్రవం బయటకు (blood fall from the glacier of Antarctica) ప్రవహిస్తోంది. 1911లో బ్రిటిష్ అన్వేషకుడు థామస్ గ్రిఫిత్ టేలర్ తొలిసారిగా దీనిని కనుగొన్నారు. ఆయన పేరునే ఆ హిమానీ నదానికి పెట్టారు. మొదట్లో థామస్, అతని సహచరులు అది ఎరుపు ఆల్గే అని భావించారు. కానీ అది నిజం కాదని ఆ తర్వాత తేలింది. ఇక, 1960లో హిమానీ నదం కింద ఇనుము లవణాలు, ఉప్పు నీరు ఉన్నాయని గుర్తించారు. అంటే, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్‌కు, ఉప్పు నీరు కలవడం వల్ల ఉష్ణం పుట్టిందని, వేడి వల్ల మంచు చీలి ద్రవం బయటకు వస్తోందని, బయటకు వచ్చాక గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిగి ఆ ద్రవం ఎర్రగా మారుతోందని భావించారు.  


ఆ తర్వాత మరో అధ్యయనం బయటకు వచ్చింది. ఆ హిమానీ నదం కింద కొన్ని సూక్ష్మజీవులు జీవిస్తున్నాయని 2009లో కనుగొన్నారు. ఆ సూక్ష్మజీవులు 15 నుంచి 40 లక్షల సంవత్సరాలుగా ఈ హిమానీనదం క్రింద నివసిస్తున్నాయట. అక్కడి నీటిని ప్రయోగ శాలలో పరీక్షించినపుడు, అందులో అరుదైన సబ్‌గ్లాసియల్ ఎకోసిస్టమ్‌కు చెందిన బ్యాక్టీరియా ఉన్నట్లు బయటపడింది. ఆక్సిజన్ లేని ప్రాంతంలో ఆ బ్యాక్టీరియా కొన్ని లక్షల సంవత్సరాలుగా జీవిస్తోంది. ఆ ప్రాంతం గురించి, అక్కడి సూక్ష్మజీవుల గురించి క్షుణ్నంగా తెలుసుకుంటే అసలు ఈ భూమి మీద జీవం ఎలా మొదలైందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, అదంత సులభం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. ఈ ప్రాంతంలో ప్రయాణించడం, గాలి పీల్చుకోవడం, నడవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆ రక్త ప్రవాహం మిస్టరీ ఎప్పటికీ వీడుతుందో చూడాలి. 

Updated Date - 2022-10-01T21:19:58+05:30 IST