వైసీపీ హామీలపై శ్వేతప్రతం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-08-10T05:39:38+05:30 IST

‘తమది పేజీలు పేజీలు మేనిఫెస్టోకాదని, రెండు పేజీలు మాత్రమే ఉంటుందని ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన అన్నారు.

వైసీపీ హామీలపై శ్వేతప్రతం విడుదల చేయాలి
ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

రాజకీయ నిరుద్యోగులను సలహాదారులను చేశారు

బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 9: ‘తమది పేజీలు పేజీలు మేనిఫెస్టోకాదని, రెండు పేజీలు మాత్రమే ఉంటుందని ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలైంది. పాదయాత్ర హామీలపై ఒక్కరోజైనా సమీక్ష జరిపారా? హామీల అమలుపై శ్వేతప్రతం విడుదచేయాలి’ అని  సీఎం జగనను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ యువమోర్చా చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ పాలనపై విష్ణువర్ధన రెడ్డి విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 151 మంది సలహాదారులను పెట్టుకున్నారని అన్నారు. రోజుకో సలహాదారుని పెట్టుకుంటున్నారని, ఒక సలహాదారునికి సౌకర్యాలన్ని కల్పించి రూ.3 లక్షల జీతాలిస్తున్నారని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులందరినీ సీఎం కార్యాలయంలో సలహాదారులను చేశారని మండిపడ్డారు. ‘మీ తాబేదారులు రోజూ ప్రెస్‌మీట్‌ పెట్టి అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతారు. మీదగ్గరున్న బస్తాలు బస్తాలు కుమ్మరించి ఓట్లువేయించుకున్నారు. పాదయాత్రలో ప్రజలకిచ్చినహామీలపై ఒక్క సలహాదారుడినైనా పెట్టుకున్నారా..?’ అని ప్రశ్నించారు. జగన సీఎం అయిన తరువాత ఏ ఒక్కరంగమైనా అభివృద్ధి చెందిందా..? అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగులు పక్కరాషా్ట్రలకు వలసపోతున్నారు. మీకు, మీ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలు, 30 ఎకరాల పొలమున్న రైతు బిడ్డలు కర్ణాటకలో సెక్యురిటీ గార్డులు పనిచేస్తున్నారు. మీ జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది?’ అని ప్రశ్నించారు. ‘అధికారంలో వస్తే చిటికెలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు లేకుండా చేస్తానన్నావు. దీంతో రెగ్యులర్‌ చేస్తాడని నమ్మి ఓట్లువేశారు. ఒక్కరినీ రెగ్యులర్‌ చేయలేదు. ఉన్న ఉద్యోగాలు తీసేశావు’ అని మండిపడ్డారు. ఈ మధ్య వైసీపీకి మేనిఫెస్టో మతిమరుపు వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసీపీ పేరును ల్యాండ్‌, శాండ్‌, వైన, మైన పార్టీగా మార్చుకోవాలని సూచించారు. ఇళ్ల పట్టాలపేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ భూములను అమ్ముకుని రూ.వేల కోట్లు దోచేశారని, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ‘మద్యపాన నిషేధమని, ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితమని అన్నారు. మంత్రి అమర్నాథ్‌కు కనబడటంలేదా..?’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధిపెట్టి, కోల్డ్‌స్టోరేజ్‌ పెడుతామన్నారు. రాయలసీమలోని రైతులు టమోటాలను రోడ్డుపై పడేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా రైతులకు అండగా నిలిచిన పాపానపోలేదని విమర్శించారు. పాఠశాలల విలీనం జాతీయ విద్యా విధానానికి విరుద్ధమని టీచర్ల సంఘాలు వాపోతే, ఎవరూ మాట్లాడేందుకు వీలు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సమస్యలపై ప్రతిపక్షాలు, ప్రజలు ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో గెలిచారా? నియంతలా గెలిచారా? కిమ్‌ పాలన అనుకుంటున్నారా? అని జగనను ప్రశ్నించారు. రాష్ర్టాన్ని దేశంగా ఊహించుకుని, జగన దేశాధ్యక్షుడన్న భ్రమలో వైసీపీ ఉందని విమర్శించారు. జగన శాశ్వత సీఎం, మంత్రులు, ప్రభుత్వం శాశ్వతమని రాబోయే రోజుల్లో వైసీపీ తీర్మానం చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘర్షణ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన, ఉపాఽధ్యక్షుడు గుడిసె సాయిదేవానంద్‌, రాష్ట్ర కార్యదర్శి గంగినేని రాజే్‌షకుమార్‌, యువసంఘర్షణ యాత్ర ఇనచార్జి నాగోతు రమే్‌షనాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, మీడియా ప్రతినిధి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-10T05:39:38+05:30 IST