Bengaluru Woman: బెంగళూరులో ఇల్లు కొనాలనుకున్న ముస్లిం మహిళకు చేదు అనుభవం..

ABN , First Publish Date - 2022-08-19T21:56:02+05:30 IST

ఈరోజుల్లో కూడా ఇల్లు అద్దెకు ఇవ్వడానికి, అమ్మడానికి కులాలను, మతాలను ప్రాతిపదికగా భావించే యజమానులు ఉంటారని భావించలేం. కానీ.. ఇప్పటికీ..

Bengaluru Woman: బెంగళూరులో ఇల్లు కొనాలనుకున్న ముస్లిం మహిళకు చేదు అనుభవం..

బెంగళూరు: ఈరోజుల్లో కూడా ఇల్లు అద్దెకు ఇవ్వడానికి, అమ్మడానికి కులాలను, మతాలను ప్రాతిపదికగా భావించే యజమానులు ఉంటారని భావించలేం. కానీ.. ఇప్పటికీ అలాంటి ఇంటి యజమానులు ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. బెంగళూరుకు ఇల్లు కొనేందుకు అన్వేషించిన ఒక ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది. Haifa అనే ముస్లిం మహిళ బెంగళూరులో ఇల్లు కొనాలని భావించింది. మంచి ఇంటి కోసం వెతుకులాట సాగించింది. ఆ సందర్భంగా ఒక ఇంటి గురించి బ్రోకర్ ద్వారా ఆమెకు తెలిసింది. అతనితో వాట్సాప్‌లో సంభాషించిన Haifa ఆ సంభాషణ మిగిల్చిన చేదు అనుభవాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ సంభాషణ సారాంశం ఏంటంటే.. పేరేంటని అవతలి వ్యక్తి ఆమెను అడిగాడు. తన పేరు Haifa అని ఈవిడ బదులిచ్చింది. ‘హిందూ ఫ్యామిలీయేనా’ అని ఆమెను ఆ వ్యక్తి అడిగాడు. ఆమె కాదని చెప్పింది. ‘ఓకే’ అని అతను బదులిచ్చాడు. ‘ఏమైనా సమస్యా’..? అని ఆమె అడిగింది. ‘అవును’ అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. ‘అయితే.. ఇల్లు అందుబాటులో లేదా’ అని ఆమె అడిగింది. ఆ వ్యక్తి సమాధానమిస్తూ.. ‘ప్రాపర్టీ ఉంది అయితే ఆ ఇంటి యజమాని హిందూ కుటుంబానికి అమ్మాలనుకుంటున్నాడు’ అని ఆ వ్యక్తి అసలు విషయాన్ని బయటపెట్టాడు. మరో ఇంటి కోసం చేసిన ప్రయత్నంలో కూడా ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.



భారత్‌లో ప్రతీ ఒక్కరూ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటే.. ఆగస్ట్ 15 తనకు ఇలా గడిచిందంటూ నిట్టూరుస్తూ ఆ ముస్లిం మహిళ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విషయంలో కొందరు నెటిజన్లు ఆ మహిళను సమర్థించగా, మరికొందరు ఇంటి యజమానికి మద్దతుగా నిలిచారు. ఎవరికి ఇల్లు అద్దెకు ఇవ్వాలనేది, అమ్మాలనేది ఆ యజమాని వ్యక్తిగత నిర్ణయమని, ఎవరు తన ఇంట్లో అద్దెకు రావాలో, ఎవరికి అమ్మాలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఆ యజమానికి ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. ఇప్పటికీ మతాలు, కులాలను పరిగణనలోకి తీసుకుని ఇల్లు అద్దెకు ఇవ్వాలని, అమ్మాలని భావించడం ఏంటని యజమానిని తప్పుబట్టారు.

Updated Date - 2022-08-19T21:56:02+05:30 IST