
తల్లిపాలతో ఆభరణాలు తయారు చేయడమేంటీ... అని ఆశ్చర్యపోతున్నారా? శిశువుకు పాలు ఇచ్చిన రోజులతో పాటూ తల్లీపిల్లల అనుబంధాన్ని జీవితాంతం మధుర జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకునే మహిళలకు.. ఆభరణాలు తయారు చేసి అందిస్తున్నారు అమెరికాలో కొందరు. యూఎస్‌లో ఇలాంటి కంపెనీ ఉందనే విషయం బహుశా మన దేశంలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, అటువంటి కంపెనీ గురించి తెలుసుకున్న లండన్‌కు చెందిన దంపతులు.. తామూ ఆభరణాలు చేయడం ప్రారంభించారు. వచ్చే ఏడాది నాటికి రూ.15కోట్ల టర్నోవర్ చేయడమే లక్ష్యంగా వారు ముందుకు వెళ్తున్నారు...

లండన్‌లోని బెక్స్లీకి చెందిన సఫియా రియాద్ అనే మహిళకు ముగ్గురు సంతానం. ఆమె భర్త ఆడమ్ రియాద్‌తో కలిసి శుభకార్యాలలో వాడిన ప్రత్యేక పూలను భద్రపరచడం, వాటిని విలువైన జ్ఞాపకంగా మార్చడం వంటి పనులు చేస్తుంటుంది. ఇందుకోసం ఈ దంపతులు 2019నుంచి ఓ కంపెనీని నడుపుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,000 ఆర్డర్లను డెలివరీ చేశారు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో.. తల్లిపాలతో ఆభరణాలు తయారు చేసే కంపెనీ గురించి ఈ దంపతులు తెలుసుకున్నారు. అప్పటినుంచి ఈ దంపతులు కూడా.. తల్లి పాలను సేకరించి, ఆభరణాలు తయారు చేయడం ప్రారంభించారు.
పిల్లల తల్లులకు ఆభరణాల విషయాన్ని వివరించి, అవరసరమైన వారి నుంచి 30 ఎమ్ఎల్ పాలను సేకరించడం మొదలెట్టారు. అనంతరం వాటిని ఆభరణాలుగా ఎలా మార్చాలనే విషయంపై చాలా పరిశోధనలు చేశారు. పాల అసలు రంగు పోకుండా ఉండేందుకు... ద్రవాన్ని డీహైడ్రేట్ చేసే సాంకేతిక ప్రక్రియను కనుగొన్నారు. తద్వారా తల్లి పాలతో నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు తదితర ఆభరణాలను తయారు చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం ఈ ఆభరణాలకు డిమాండ్ పెరిగిపోయిందని సఫియా దంపతులు చెబుతున్నారు. తల్లీపిల్లల అనుబంధానికి గుర్తుగా ఆభరణాలు తయారు చేయడం.. తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి