ఆ ప్రజాభీష్టమే యన్‌టిఆర్

ABN , First Publish Date - 2021-03-28T08:22:51+05:30 IST

చిలకలూరిపేటలో 1982 ఫిబ్రవరి 7న లోక్‌దళ్‌ ఆధ్వర్యంలో కిసాన్‌ ర్యాలీ నిర్వహించాం. దీనికి మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌, కేంద్ర మాజీ రబీరే,...

ఆ ప్రజాభీష్టమే యన్‌టిఆర్

చిలకలూరిపేటలో 1982 ఫిబ్రవరి 7న లోక్‌దళ్‌ ఆధ్వర్యంలో కిసాన్‌ ర్యాలీ నిర్వహించాం. దీనికి మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి రబీరే, సత్యన్నారాయణరెడ్డి, జార్జ్‌ఫెర్నాండెజ్‌ వంటి హేమా హేమీలు హాజరయ్యారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రైతులు ఎవరికి వారు సొంత ఖర్చులతో వేలాది ట్రాక్టర్లతో హాజరయ్యారు. దీనిపై రాష్ట్రనాయకత్వం ఉబ్బితబ్బిబైంది. 1950 దశకంలో రాజ్యసభ సభ్యుడిగా వున్న సీనియర్‌ సోషలిస్టు నాయకుడు అయినంపూడి చక్రధర్‌ విజయవాడ హోటల్‌ నటరాజ్‌లో మకాంచేసి తుమ్మలచౌదరిని, నన్నురమ్మని కబురు చేశారు. ప్రముఖ సినీనటుడు యన్‌టిఆర్‌ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలొస్తున్నాయి... ఆయనతో మాట్లాడమని చక్ర ధర్‌ సూచించారు. తుమ్మల చౌదరి యన్‌టిఆర్‌ను కలవటా నికి చెన్నై వెళదామంటే రేపు– మాపు అని వాయిదా వేస్తూవచ్చారు. దీంతో నేను ఒంటరిగానే చైన్నై వెళ్ళాను.. సినీ నటుడు, గతంలో యన్‌జి రంగా శిష్యునిగా అప్పట్లో నాకు పరిచయం వున్న కొంగర జగ్గారావుకు ఫోన్‌చేసి యన్‌టిఆర్‌ అపాయింట్‌ మెంట్‌ తీసుకోవాలని కోరాను. నటుడు జగ్గారావుతో కలిసి యన్‌టిఆర్‌తో మాట్లాడాను. యన్‌టిఆర్‌ మనసు అర్థమయింది. ప్రాంతీయ పార్టీ పెట్టాలా... జాతీయ పార్టీలో చేరితే మంచిదా అనే చర్చ జరిగింది. జాతీయ పార్టీలైతే ఢిల్లీ కేంద్రంగా వ్యవహారాలు సాగుతాయి.. మనమాట సాగదు.. మీ ఇష్ట ప్రకారం ప్రాంతీయ పార్టీ పెడితే మంచిదని నేను సూచించాను. దీనికి యన్‌టిఆర్‌ అంగీకరించారు.

1982 మార్చి 21న యన్‌టిఆర్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆరోజు ముషీరాబాద్‌ రామకృష్ణ స్టూడియోలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తరువాత యన్‌టిఆర్‌ ఊటీ వెళ్ళారు. మార్చి 29 ఉదయం యన్‌టిఆర్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చారు. నేను విమా నాశ్రయానికి వెళ్ళాను. నాదెండ్ల భాస్కరరావు ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గద్దె రత్తయ్య, ఆదెయ్య, నారాయణలు పార్టీలో చేరతామని వచ్చారు. అల్పాహార విందు తరువాత మధ్యాహ్నం హైదరాబాద్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీటింగ్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.. మీటింగ్‌ హాల్‌ కెపాసిటీకి పదిరెట్లు ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. దీంతో మీటింగ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లాన్‌లోకి మార్చారు. పార్టీ పెడుతున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. ఆనందగజపతిరాజు, కోళ్ళ అప్పలనాయుడు, జానారెడ్డి, నేను, నాదెండ్ల, గద్దె రత్తయ్య, ఆదెన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీప్రకటన తరువాత 1982 మార్చి 30 మధ్యాహ్నం రామకృష్ణ స్టూడియోలో 9వ నెంబరు గదిలో దగ్గుబాటి చెంచురామయ్య, నాదెండ్ల భాస్కరరావు, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నేను, గద్దె రత్తయ్య తదితరులం సమావేశమయ్యాం. నాతోపాటు మరికొందరితో పార్టీకి ఏపేరు పెట్టాలని యన్ టి ఆర్ చర్చలు జరిపారు. అక్కడే పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు.. పార్టీ జెండాలో చక్రం, నాగలి, గుడిసె వుండేవిదంగా స్వయంగా యన్‌టిఆర్‌ తెల్లకాగితం మీద పెన్సిలుతో పార్టీ చిహ్నం రూపొందించారు. తరువాత ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌ నిజాం కాలేజి గ్రౌండ్‌లో బహిరంగ సభ పెట్టారు.

హైదరాబాద్‌లో రామకృష్ణాస్టూడియో పార్టీకి కేంద్రంగా వుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, కొత్తనాయకత్వాన్ని గుర్తించటం, సామాజిక వర్గాల సమీకరణ, జిల్లాలవారీగా కలిసి వచ్చేవారి ఎంపిక తదితర అంశాలను నిత్యం యన్‌టిఆర్‌ చర్చించేవారు. దీనిలో భాగంగా పార్టీలో రెడ్ల భాగస్వామ్యం పెంచాలని చర్చకు వచ్చింది. అప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభసభ్యుడిగా పనిచేసిన బెజవాడ పాపిరెడ్డిని గుర్తు చేశాం. దీంతో పాపిరెడ్డితో చర్చించాలని యన్‌టిఆర్‌ సూచించారు. నేను పాపిరెడ్డితో మాట్ల్లాడి పార్టీలో చేరటానికి ఒప్పించాను. పాపిరెడ్డి సూచనమేరకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డితో మాట్లాడాను. నల్లపరెడ్డి తాను అనుచరులతో మట్లాడిన తరువాత నిర్ణయం ప్రకటిస్తానన్నారు. నల్లపరెడ్డి తన సోదరుడు చంద్రశేఖరరెడ్డితో పాటు పదిమంది సమితి ప్రెసిడెంట్లతో సమావేశం అయ్యారు. డేగా నరసింహారెడ్డి, వై.శ్రీనివాస రెడ్డి తదితరులు నల్లపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తరువాత యస్‌సిల సంఖ్యపెంచాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా జనతాపార్టీలో కలిసిపనిచేసిన టి.సదాలక్ష్మితోపాటు మాజీయంపి తులసీరామ్‌, తదితరులతో చర్చించా. వీరంతా బాబూ జగ్జీవన్‌ రామ్‌తో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తరువాత వారు ఢిల్లీలో జగ్జీవన్‌రామ్‌తో చర్చించి టిడిపిలో చేరారు. పార్టీ నిర్మాణంలో భాగంగా యన్‌టిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 1982 మే28న తిరుపతిలో రెండో బహిరంగసభ పెట్టాలని నిర్ణయించాం. యన్‌సి వీరరాఘవులు నాయుడు సభ ఏర్పాట్లను తన భుజస్కందాలపై వేసుకొన్నారు. నేను వారంరోజుల ముందే తిరుపతివెళ్ళి బహిరంగసభ ఏర్పాట్లలో పాలుపంచుకొన్నాను. అప్పట్లో రామోజీరావు తిరుపతి ఎడిషన్‌ ప్రారంభానికి వచ్చి అక్కడే ఉన్నారు. తిరుపతిసభలో యన్‌టిఆర్‌ పార్టీలో చేరే ఎమ్మెల్యేలు, ఎంపిలు తమపదవులకు రాజీనామా చేయాలని తీర్మానించారు. నాదెండ్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గద్దెరత్తయ్య, ఆదెయ్య, నారాయణలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. దీంతో యన్‌టిఆర్‌ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

తిరుపతిసభ తరువాత జిల్లాల వారీగా కలిసివచ్చే రాజకీయ నేతలతో చర్చలు ప్రారంభించాం. వారిలో పార్టీలో చేరటానికి సమ్మతించిన వారిని వెంటనే చేర్చుకొన్నాం.. పార్టీలో చేరినవారికి శిక్షణ తరుగతులు నిర్వహించాం. అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు యన్‌టిఆర్‌పై చేసే విమర్శలకు నేను దీటుగా జవాబు ఇచ్చేవాడిని. అప్పట్లో టిడిపిలో ఎక్కువమంది లోక్‌దళ్‌ నేపథ్యం ఉన్న నన్నపనేని రాజకుమారి, జెఆర్‌.పుష్పరాజ్‌, డాక్టర్‌ యంయస్‌యస్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ బిసి హెచ్‌ గరటయ్య, బెజవాడ పాపిరెడి, డాక్టర్‌ కాజ కృష్ణ మార్తి, ఈవూరి సీతారావమ్మ వంటివారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.1983 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్‌ గురించి అడిగారు.. నాకు అసెంబ్లీ వద్దు. కేంద్రానికి ఢిల్లీ వెళతానని చెప్పాను. 1984 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభకు ఖరారుచేసినా చివరి నిమిషంలో మారిపోయింది. 1986లో రాజ్యసభకు సిద్ధంగా వుండాలన్నారు. ఫోటోలు, బయోడేటా సిద్ధం చేశారు.. మరలా రద్దయింది.. 1988లో రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. ఉన్నతమైన ఆశయాలు, కాంగ్రెస్‌పై వ్యతిరేకత, దేశంలో ఆదర్శవంతమైన వ్యవస్థకు యన్‌టిఆర్‌ పునాది వేశారు. రాజ కీయాలు జన బాహుళ్యంలోని అసంతృస్తిని ప్రతిబింబిస్తాయి.సమస్యల పరిష్కారానికి ఎవరు ప్రయత్నిస్తున్నారుఅనే అంశాన్ని ప్రజలు అంచనా వేస్తారు. 1983లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఎక్కువగా వుంది. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఊహించని విధంగా జనతాపార్టీ అధికారంలోకి రావటంతో కేంద్ర రాజకీయాల్లో వున్న రామకృష్ణ హెగ్డే శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో కొచ్చారు. ప్రజల ఆశయం, అభీష్టాలను అంచనా వేయకుండా ఏకపక్షంగా వ్యవహరించటం, తాముబలంగా ఉన్నామని, ప్రతిపక్షం శూన్యమని భావిస్తే అధికార పక్షం నష్టపోతుంది. శూన్యంనుంచే ఉద్యమాలు, పోరాటాలు పుడతాయి. దీనికి ఉదాహ రణే ... యన్‌టిఆర్‌, తెలుగుదేశం పార్టీ. బిజెపి ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని నిర్లక్ష్యంచేస్తే తికాయత్‌ వంటి నాయకులు యన్‌టిఆర్‌ తరహాలోనే వెలుగులోకి వస్తారు.

డాక్టర్‌ యలమంచిలి శివాజి
(మార్చి 29: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం)

Updated Date - 2021-03-28T08:22:51+05:30 IST