చిరు వ్యాపారులు.. చితికిపోతున్నారు!

ABN , First Publish Date - 2021-05-10T05:42:27+05:30 IST

కొవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిరువ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. రోజూ వారి వ్యాపారం సాగక వారందరీ బతుకులు భారంగా మారిపోయాయి. ఫలితంగా వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

చిరు వ్యాపారులు.. చితికిపోతున్నారు!


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 9 : కొవిడ్‌  రెండో దశ తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిరువ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. రోజూ వారి వ్యాపారం సాగక వారందరీ బతుకులు భారంగా మారిపోయాయి. ఫలితంగా వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. వ్యాపారం కోసం ఫైనాన్స్‌ నుంచి తీసుకోవాల్సిన అప్పులను రోజూవారీ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వస్తువులు, సరుకులను కొనడానికి వచ్చేందుకే ప్రజలు భయపడుతుండడంతో వ్యాపారాలు డీలా పడ్డాయి. దీంతో గిరాకీలు లేక ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డిలోని చిరువ్యాపారులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా వారు తమ దీనస్థితిని వివరించారు. 

ఎలా బతకాలి
సంగారెడ్డి పాతబస్టాండ్‌ దగ్గర అంబేద్కర్‌ చౌరస్తా సమీపంలో 30 ఏళ్లుగా చెప్పులు కుట్టి జీవిస్తున్నాను. నేను, నా భార్య కలిసి చెప్పులు కుడుతూ, రోజుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు సంపాదించే వాళ్లం. ఇప్పుడు రోజుకు రూ.300 కూడా రావడం లేదు. పిల్లలను పోషిస్తూ, ఎలా బతకాలో అర్థమవడం లేదు.
- మనోహర్‌, చెప్పుల వ్యాపారి

షాపునకు అద్దె కట్టడం కష్టమవుతోంది 
చిన్నపిల్లలకు సంబంధించి రెడీమేడ్‌ వస్త్రాలకు సంబంధించి రోజుకు రూ.4000 వరకు వ్యాపారం జరిగేది. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా గత నెల నుంచి రోజుకు రూ.1000 అమ్మకాలు సాగడం లేదు. దాంతో షాపునకు అద్దె కట్టడం కష్టమవుతోంది. మా బతుకులు ఎలా వెళ్లదీయాలో అర్థం కాక సతమతమవుతున్నా.
-అశోక్‌, రెడీమెడ్‌ దుస్తుల వ్యాపారి, సంగారెడ్డి పాతబస్టాండ్‌


సాయంత్రం వరకు కూర్చున్నా ఎవరూ రావడం లేదు
ఇరవై ఏళ్ల నుంచి నగల తయారీ, అమ్మకాలు చేస్తూ జీవిస్తున్నాను. అయితే కరోనా కారణంగా ఏడాది నుంచి వ్యాపారం ఏ మాత్రం సాగడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో షాపులనే మూసివేశాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ లేకున్నా నగలను తయారు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. షాపు తీసి, సాయంత్రం వరకు కూర్చున్నా ఎవరూ రావడం లేదు. చివరకి ఖాళీగానే ఇంటికి వెళుతున్నాం.
- చంద్రశేఖర్‌, స్వర్ణకారుడు, శాంతినగర్‌, సంగారెడ్డి

రూ.200 కూడా రావడం లేదు
పొట్టనింపుకుని బతికేందుకు రాజస్థాన్‌ నుంచి వచ్చి సీజనల్‌ వ్యాపారం చేస్తూ బతుకుతున్నాను. ప్రస్తుత వేసవి సీజన్‌లో చెరుకు రసం అమ్ముతున్నాను. కొవిడ్‌ రెండో దశ తీవ్రతరం కాక ముందు మార్చిలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వచ్చేది. గత నెల నుంచి రూ.200 కూడా రావడం లేదు. దాంతో ఎలా బతకాలో తెలియడం లేదు. 
- సలీం, చెరుకు బండి వ్యాపారి

కళ్లకు నీళ్లు వస్తున్నాయి
బండిపై అన్ని రకాల వస్తువులను అమ్మి బతుకు సాగిస్తున్నాను. ఇప్పుడు కరోనాతో వ్యాపారం కష్టంగా మార్చింది. కరోనాకు ముందు రూ.2000 వరకు సాగే వ్యాపారం కాస్తా ఇప్పుడు రూ.400 కూడా రావడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కళ్లకు నీళ్లు వస్తున్నాయి. 
- మక్సూద్‌, చిరువ్యాపారి, సంగారెడ్డి పాత బస్టాండ్‌



Updated Date - 2021-05-10T05:42:27+05:30 IST