అరచేతిలో ఆధార్‌ సవరణ

ABN , First Publish Date - 2020-11-12T15:22:31+05:30 IST

జిల్లావ్యాప్తంగా మీసేవా కేంద్రాల్లో ఆధార్‌ సేవలను..

అరచేతిలో ఆధార్‌ సవరణ

సేవలు మరింత సులభతరం

మార్పులు.. చేర్పులు మన చేతిలోనే 

యూఐడీఏఐ న్యూ అప్‌డేట్స్‌ 

భద్రత కారణంతో మొబైల్‌ నెంబర్‌ రిజిస్ర్టేషన్‌ తొలగింపు 


(ఆంధ్ర జ్యోతి, విజయవాడ): జిల్లావ్యాప్తంగా మీసేవా కేంద్రాల్లో ఆధార్‌ సేవలను నిలిపివేయడంతో సవరణల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే యూనీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) 90 శాతం మందికి పైగా ప్రజలు ఎదుర్కొనే ఆధార్‌ సవరణల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, భాషల్లో ఏవైనా సవరణలు చేయించుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఎవరికి వారే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. యూఐడీఏఐ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఈ ఐదు సేవలను పొందవచ్చు.  


ఆధార్‌ సేవలను మరింత సులభతరం చేసింది యూనీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ). ఆధార్‌లో సవరణల కోసం ఆధార్‌ సేవా కేంద్రాల చుట్టూ తిరగనవసరం లేకుండా, ఆన్‌లైన్‌ ద్వారానే ఎవరికి వారు సవరణలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బయోమెట్రిక్స్‌ అప్‌డేట్స్‌, ఫోన్‌ నెంబర్‌ యాడింగ్‌ మినహా దాదాపు మిగిలిన అన్ని సేవలను ఎవరికి వారు తమ కంప్యూటర్ల నుంచి, ల్యాపీ, ట్యాబ్‌, ఫోన్‌ల ద్వారా ఎప్పుడైనా పొందవచ్చు. సైబర్‌ నేరాలకు ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో బయోమెట్రిక్స్‌ అప్‌డేట్స్‌, ఫోన్‌ నెంబర్‌ యాడింగ్‌ ప్రక్రియను మినహాయించారు. దీనిని ఆధార్‌ సేవా కేంద్రంలోనే చేస్తారు. కొత్తగా ఐదు ఆప్షన్స్‌ను యూఐడీఏఐ కల్పించింది. పేరు, పుట్టినతేదీ, చిరునామా, జెండర్‌ (లింగం), భాషలకు సంబంధించిన సవరణలు మనమే చేసుకోవచ్చు.


పీవీసీ కార్డ్‌ను ఇలా పొందాలి.. 

చాలా మంది ఆధార్‌ కార్డును వ్యాలెట్‌లో పెట్టుకోవటానికి వీలుగా బయట నెట్‌ సెంటర్ల దగ్గర పీవీసీ కార్డుల మీద ప్రింట్‌ తీసుకుంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. ఇప్పుడు యూఐడీఏఐ అత్యున్నత ప్రమాణాలతో పీవీసీ కార్డును పొందే అవకాశాన్ని కల్పించింది. వెబ్‌సైట్‌లోనే  మొదట కనిపించే గెట్‌ ఆధార్‌ ఆప్షన్‌లోనే ఆర్డర్‌ ఆధార్‌ పీవీసీ కార్డును ఓపెన్‌ చేసి, ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, ఓటీపీని పొందుపరచాలి. రూ.50 చెల్లిస్తే వారం, పది రోజులలో ఇంటికే పీవీసీ కార్డు వస్తుంది. ఫొటోతో పాటు సురక్షితమైన క్యూఆర్‌ కోడ్‌, హాలోగ్రామ్‌, జీ ప్యాట్రన్‌, ఘోస్ట్‌ ఇమేజ్‌, మైక్రో టెక్స్ట్‌, ఫోన్‌ నెంబర్‌ కూడా అందులో ఉంటాయి.


బయోమెట్రిక్స్‌ను లాక్‌ చేయండి  

ఆధార్‌తో అనుసంధానమైన డేటాకు పూర్తి రక్షణ ఉన్నా.. మన బయోమెట్రిక్స్‌ను ఎవరికంట పడకుండా చేయటానికి వీలుగా లాక్‌ చేసుకునే అవకాశాన్ని కూడా యూఐడీఏఐ కల్పించింది. ఆధార్‌ సర్వీసెస్‌ ఆప్షన్‌లో లాక్‌ బయోమెట్రిక్స్‌ అనే ఆప్షన్‌ ఉంది. దీనిని ఉపయోగించుకుని బయోమెట్రిక్స్‌ను లాక్‌ చేసుకోవచ్చు.


అదనపు సౌకర్యాలూ అనేకం.. 

మీ ఆధార్‌ స్టేటస్‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. ఒక వేళ కార్డు పోతే కొత్త కార్డు కోసం రీప్రింట్‌ అడగవచ్చు. పది రోజుల్లో ఇంటికి కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది. డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ సైట్‌ ఓపెన్‌ చేయగానే గెట్‌ ఆధార్‌ ఆప్షన్‌ ద్వారా పొందవచ్చు. సేవలు కోరినపుడు వాటి స్టేటస్‌ను సైట్‌లోనే తెలుసుకోవచ్చు. సైట్‌లో మూడవ ప్రధాన ఆప్షన్‌గా ఉన్న ఆధార్‌ సర్వీసెస్‌లో ఆధార్‌ నెంబర్‌, ఈ - మెయిల్‌, ఫోన్‌ నెంబర్‌లు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వర్చువల్‌ ఐడీని పొందవచ్చు. 


సవరణలు ఇలా 

యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళితే.. మొదట ‘గెట్‌ ఆధార్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని కింద అప్‌డేట్‌ ఆధార్‌ అనే మరో ఆప్షన్‌ ఉంది. ఈ ఆప్షన్‌లో అప్‌డేట్‌ డీమోగ్రాఫిక్స్‌ డేటా ఆన్‌లైన్‌ అన్న సబ్‌ ఆప్షన్‌ కొత్తగా ఇచ్చారు. ఈ ఆప్షన్‌ను ఓపెన్‌ చేయగానే.. ఆధార్‌ నెంబర్‌ ఇవ్వటం ద్వారా ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఆధార్‌ రిజిస్టర్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి, క్యాప్చాను ఎంటర్‌ చేయటం ద్వారా మన పేరు, లింగం, పుట్టిన తేదీ, భాష, చిరునామాలను మార్చుకోవచ్చు.


వీటి కోసం ఐడెంటిటీ ప్రూఫ్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు,  గుర్తింపు పొందిన స్కూల్‌ ఫొటో కార్డు, ఆయుధాల లైసెన్స్‌, ఫొటో బ్యాంక్‌ ఏటీఎం కార్డు, ఫొటో క్రెడిట్‌ కార్డు, పెన్షనర్‌ ఫొటో కార్డు, ఫ్రీడం ఫైటర్‌ ఫొటో కార్డు, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, సీజీహెఎస్‌, ఈసీహెచ్‌ఎస్‌ కార్డు, పోస్టల్‌ శాఖ ధృవీకరించిన అడ్రస్‌ కార్డు, గజిటెడ్‌ అధికారి, తహసీల్దారు, తత్సమాన అధికారులు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌, వైకల్య కార్డు, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్‌, స్కూల్‌ టీసీ, స్కూల్‌ రికార్డ్స్‌ కాపీ, బ్యాంక్‌ పాస్‌బుక్‌ వంటి అనేక రకాలైన ధ్రువీకరణ పత్రాలలో మీ దగ్గర ఏదో ఒకటి ఉన్నా సరే దానిని అప్‌లోడ్‌ చేసుకుని మీ తప్పులు సవరించుకోవచ్చు. 


Updated Date - 2020-11-12T15:22:31+05:30 IST