ఆక్రమణలతో రోడ్డుపైనే నిలచిన వర్షపు నీరు
రాపూరు, మే 16: జాతీయ రహదారి 565 ఆక్రమణలకు గురవుతున్నదని, దీంతో రానున్న రోజుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి రహదారి హద్దులతో కూడిన మ్యాప్‌ను ఇవ్వాలంటూ 565 హైవే అథారిటీ, తిరుపతి ప్రాజెక్టు మేనేజరు ఇటీవల నెల్లూరు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ విషయమై జిల్లాకలెక్టర్‌తోపాటు ఎన్‌హెచ్ ఏఐ పీవో, రాపూరు తహసీల్దారుకు సమాచారం అందిం చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు నుంచి నల్గొండ జిల్లా నకిరేకల్ వరకు రెండు రాష్ట్రాలను, మెట్ట ప్రాంతాలను కలుపుతూ వెంకటగిరి, రాపూరు, సోమశిల, పామూరు, కనిగిరి, మాచర్ల మీదుగా 501 కిలోమీటర్ల పొడవు డబుల్ రోడ్డు విత్ పేవ్‌మెంటుగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రహదారిని కేంద్రమంత్రి గడ్కారీ ప్రారంభించారు. ఇటీవలే హైవే అథారిటీ అధికారులు ఈ రహదారిని పరిశీలించారు. పలుచోట్ల రోడ్డు చెంతనే ఆక్రమణలు ఉన్నట్లు, వీటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో ఆక్రమణలను తొలగిం చాలని నిర్ణయించారు. దీంతో రహదారికి సంబంధించిన మ్యాప్‌ను అందించాలని కోరారు.