రిలీజ్‌ రోజే లవ్‌స్టోరి చూస్తాను

Sep 20 2021 @ 07:11AM

  • - ఆమిర్‌ఖాన్‌

‘‘రిలీజ్‌ రోజే నేను ‘లవ్‌స్టోరి’ సినిమా చూస్తాను. మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా తెరవలేదు. ప్రత్యేకంగా స్ర్కీనింగ్‌ వేసుకొని మరీ చూడాలనుకుంటున్నాను. ఈ సినిమా పాటలో ఫస్ట్‌ క్లిప్‌ చూసినప్పుడే సాయిపల్లవికి నేను అభిమానిని అయ్యాను’’ అని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. నారాయణ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు. ఆదివారం నిర్వహించిన ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌కు ఆమిర్‌ఖాన్‌, చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్యను ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌లో తొలిసారి కలిశాను. కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. అతని తల్లితండ్రులు చాలా సంస్కారంతో పెంచారు. సినిమా ట్రైలర్‌ చూశాను. నాకు బాగా నచ్చింది. అందుకే నేనే స్వయంగా అడిగి మరీ ఈ కార్యక్రమానికి వచ్చాను. సినిమా ఘన విజయం సాధించాలి’’ అని కోరుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘లవ్‌స్టోరి’ టైటిల్‌ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాగచైతన్య జయాపజయాలను వినమ్రంగా స్వీకరిస్తాడు. ‘ఫిదా’లో సాయిపల్లవి డ్యాన్స్‌, ఎనర్జీ చూసి ముచ్చటేసింది. నా సినిమాలో సాయిపల్లవి సోదరి క్యారెక్టర్‌ చేయాల్సింది. కానీ ‘నో’ చెప్పింది. ఆమెలాంటి అద్భుతమైన డ్యాన్సర్‌తో హీరోగా డ్యాన్స్‌ చేయాలనుంది. శేఖర్‌ కమ్ముల తనదైన శైలిలో ప్రేక్షకులకు హత్తుకునేలా సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ఆమిర్‌ఖాన్‌, చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు ఆమిర్‌ఖాన్‌ గారికి కథ చెప్పి ఒప్పిస్తాను అనే నమ్మకం ఉంది. మనం తీసే సినిమాలతో సమాజానికి ప్రయోజనం ఉండాలని భావిస్తాను. 

‘లీడర్‌’ సినిమాలో ‘అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉంది’ అని నేను రాసిన డైలాగ్‌ స్ఫూర్తితో ‘లవ్‌స్టోరి’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అని ప్రేక్షకులను కోరారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘చిరంజీవి గారి డ్యాన్సు చూసి నాకూ అదే గ్రేస్‌ అలవాటు అయింది. ఆయన నన్ను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ‘లవ్‌స్టోరి’ సినిమాలో అమ్మాయిలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. ఆ అంశం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది’’ అని చెప్పారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంట బాగుంది. ప్రదర్శన రంగానికి ఉత్తేజం ఇచ్చేలా ‘లవ్‌స్టోరి’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తుండడం సంతోషంగా ఉంది’’ అని చిత్ర నిర్మాతలను అభినందించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.