ఆప్, టీఎంసీ వల్ల బీజేపీయేతర ఓట్లలో చీలిక : చిదంబరం

ABN , First Publish Date - 2022-01-13T21:08:52+05:30 IST

గోవా శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని

ఆప్, టీఎంసీ వల్ల బీజేపీయేతర ఓట్లలో చీలిక : చిదంబరం

న్యూఢిల్లీ : గోవా శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ తమ అభ్యర్థులను నిలపడం వల్ల బీజేపీయేతర ఓట్లలో చీలిక వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. గోవాను గోవావారే పరిపాలించాలని ప్రజలకు చెబుతామని తెలిపారు. బీజేపీకి, ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ నేతలను చేర్చుకుని, ఆ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని టీఎంసీ ప్రకటించడంపై ప్రశ్నించినపుడు చిదంబరం నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఎంసీ ఆకర్షించడం తమను తీవ్ర విస్మయానికి గురి చేసిందన్నారు. గ్రామ, బ్లాక్ స్థాయి కాంగ్రెస్ నేతలను సైతం టీఎంసీ చేర్చుకుంటోందన్నారు. గోవాలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని టీఎంసీ మొదట్లో ప్రకటించిందని, అప్పట్లో ఆ పార్టీ దూకుడు చూస్తే అందుకు అనుగుణంగానే ఉండేదన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సహా, ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పిందని అన్నారు. టీఎంసీ ఆకాంక్షల గురించి కాంగ్రెస్ నాయకత్వానికి తెలుసునని, స్పందిస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. దీనిపై ఏఐసీసీ తనకు అధికారికంగా ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదన్నారు. 


టీఎంసీ గోవా ఇన్‌ఛార్జి మహువా మొయిత్ర ఇటీవల ఇచ్చిన ట్వీట్‌ ప్రతిపక్షాల ఐక్యతపై ఊహాగానాలకు బీజం వేసింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలతో టీఎంసీ మహా కూటమి ఏర్పాటవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ ప్రచారానికి తెర దించారు. సోమవారం జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ టీఎంసీ, కాంగ్రెస్ కూటమి ఏర్పాటు అవకాశాల గురించి చర్చించినట్లు ప్రచారమవుతున్న వదంతులు పూర్తిగా నిరాధారం, అవాస్తవం అని తెలిపారు. 


Updated Date - 2022-01-13T21:08:52+05:30 IST