ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌

ABN , First Publish Date - 2022-01-19T06:55:24+05:30 IST

వచ్చేనెలలో పంజాబ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ

ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌

  • చన్నీ పేరును పరోక్షంగా ప్రకటించిన కాంగ్రెస్‌


న్యూఢిల్లీ/చండీగఢ్‌, జనవరి 18:  వచ్చేనెలలో పంజాబ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ  ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ అని ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) మంగళవారం ప్రకటించింది.  సీఎం అభ్యర్థి కోసం ఆప్‌ వినూత్నంగా టెలీఓటింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో 21,59,437 మంది తమ అభిప్రాయాలను తెలియజేశారని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. వారిలో అత్యధికంగా 93.3ు మాన్‌కు అనుకూలంగా ఓటు వేశారంటూ.. తమ సీఎం అభ్యర్థి మాన్‌ అని ప్రకటించారు. ఒకప్పుడు స్టాండప్‌ హాస్యనటుడిగా ఉన్న మాన్‌ 2014లో ఆప్‌లో చేరి రెండుసార్లు ఎం పీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ పం జాబ్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీయేనని పరోక్షంగా చెప్పినట్లు ఒక వీడియో విడుదల చేసింది. ఆ పార్టీలో సీఎం అభ్యర్థి విషయమై తీవ్రపోటీ నెలకొంది. దాంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సీఎం చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఇద్దరూ సీఎం అభ్యర్థులే అన్న రీతిలో ఎన్నికల బరిలోకి దిగాలని ఆ పార్టీ అధిష్ఠానం తొలుత భావించింది.


అయితే, ఇప్పుడు తాజాగా విడుదల చేసిన 36 సెకండ్ల వీడి యో ద్వారా సీఎం అభ్యర్థి చన్నీయేనని చెప్పకనే చెప్పింది. సీఎం కాగల వ్యక్తి తనకు తాను సీఎం అభ్యర్థినని, తానే ఆ పదవికి అర్హుడినని చెప్పుకోవలసిన అవసరం ఉండదని ఆ వీడియోలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పేర్కొన్నారు. చన్నీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న క్లిప్పింగ్స్‌ను చూపించారు. ఇందులో సిద్ధూని కానీ, మరో నాయకుడిని కానీ చూపించలేదు. దాంతో తమ సీఎం అభ్యర్థి చన్నీయేనని కాంగ్రెస్‌ పరోక్షంగా చెప్పినట్లు భావిస్తున్నారు. 


Updated Date - 2022-01-19T06:55:24+05:30 IST