
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి (CM face)గా పోటీ చేసిన రిటైర్డ్ కల్నల్ అజయ్ కొథియాల్ (Ajay Kothiyal) బుధవారంనాడు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తన రాజీనామా లేఖను పంపారు.
ఇవి కూడా చదవండి
''నేను 2021 ఏప్రిల్ 19 నుంచి 2022 మే 18 వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడిగా ఉన్నాను. మాజీ-సైనికులు, మాజీ పారా-మిలటరీ సిబ్బంది, పెద్దలు, మహిళలు, యువకులు, మేథావులు తదితరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా లేఖను మీకు పంపుతున్నాను'' అని కేజ్రీవాల్‌కు రాసిన ఆ లేఖలో కొథియాల్ పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా చతికిలపడటంతో పాటు గంగోత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొథియాల్ డిపాజిట్ కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కొథియాల్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో పార్టీ పనితీరుపై విశ్లేషించేందుకు ఇటీవల న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆప్ సమావేశానికి ఆయనను పిలవకపోవడం మరింత అసంతృప్తికి దారితీసింది. కాగా, ఉత్తరాఖండ్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ అనంతరం కొథియాల్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించినట్టు గత ఏడాది డిసెంబర్‌లో కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఆప్ నిలబెట్టింది. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.