నిజమైన Hindutva మాదే: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-11-11T18:51:06+05:30 IST

నిజమైన హిందుత్వాన్ని అనుసరిస్తున్న పార్టీ 'ఆమ్ ఆద్మీ పార్టీ' అని, 130 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి..

నిజమైన Hindutva మాదే: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: నిజమైన హిందుత్వాన్ని అనుసరిస్తున్న పార్టీ 'ఆమ్ ఆద్మీ పార్టీ' అని, 130 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, దేశాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకు వెళ్లాలని తమ పార్టీ కోరుకుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టడం, అల్లర్లకు వ్యూహాలు పన్నడం, దళితులపై అకృత్యాలకు పాల్పడటం హిందుత్వ కాదని, మనిషి మనిషికి మధ్య సామరస్యాన్ని పాదుకొలపడమే హిందుత్వమని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యనించారు. ఒక న్యూస్ ఛానెల్ నిర్వహించిన సమ్మిట్‌లో కేజ్రీవాల్ బుధవారంనాడు మాట్లాడారు.


త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో కేజ్రీవాల్ 'సాఫ్ట్ హిందుత్వ' కార్డ్ వాడుతున్నారని, ఇటీవల అయోథ్యలోనికి రామాలయానికి వెళ్లడం, సీనియర్ సిటిజన్ల కోసం తీర్థ యాత్ర యోజన ప్రవేశ పెట్టడం ఇందులో భాగమేనని కొందరు చేస్తున్న విమర్శలు కేజ్రీవాల్ కొట్టేశారు. నిజమైన హిందుత్వ తమదేనని అన్నారు. ''సాఫ్ట్ హిందుత్వ అంటే ఏమిటో నాకు తెలియదు. ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను కలిసికట్టుగా ఉండేలా చూడటమే  హిందుత్వ. హిందుత్వ అంటే విడగొట్టడం కాదు, కలిపి ఉంచడం'' అని అన్నారు.


రాముడిని ప్రతి ఒక్క హిందువూ ఆరాధిస్తారని, ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన జీవితం, పాత్రలు అన్నీ తనకు హిందుత్వమేనని వివరించారు. ''హిందుత్వ పేరుతో ఇవాళ జరుగుతున్నదంతా హిందుత్వ కాదు. ఈ వ్యక్తులు ప్రజలపై మీడియాలో బురద చల్లుతుంటారు, ప్రజలను బెదరిస్తుంటారు, అల్లర్లకు కుట్రలు పన్నుతుంటారు. ఇవేమీ హిందుత్వ కాదు. దళితులపై అకృత్యాలు జరుగుతున్నాయి. ఇది కూడా హిందుత్వం కాదు'' అని ఏ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించకుండా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇటీవల దీపావళి వేడుకలు చేసుకున్నప్పుడు, అయోధ్యలో రాముడిని దర్శించినప్పుడు ఇదే వ్యక్తులు తనను ఆడిపోసుకున్నారని చెప్పారు. దీపావళి చేసుకోవడం, అయోధ్యలో రాముని దర్శించుకోవడం పాపమా అని ప్రశ్నించారు?. సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రల పథకంపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయని, అవి నెరవేరాలా ఢిల్లీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అందులో తప్పేమిటని ప్రశ్నించారు.


పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎన్నికల వ్యూహంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, పాలన, అభివృద్ధిపరంగా ఢిల్లీ మోడల్‌ను తమ పార్టీ తీసుకురావాలనుకుంటోందని చెప్పారు. ఢిల్లీ మోడల్‌ను దేశంలోని మారుమూల ప్రాంతాల వారు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కోరుకుంటే ఢిల్లీ తరహా సుపరిపాలన అందించేందుకు సిద్ధమన్నారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు కల్పించడం, మంచి ఆసుపత్రులు, విద్యుత్ సక్రమ సరఫరా పేరుతో తాము ఓట్లు అడుగుతున్నామని, ఇవన్నీ ఢిల్లీలో తమ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పారు. పంజాబ్, గోవాలో పార్టీ విజయావకాశాలపై అడిగినప్పుడు, ఆయా చోట్ల ఢిల్లీ తరహా పాలన పట్ల ప్రజలు అభినందిస్తున్నారని, ప్రజల తీర్పు ఆప్‌కు అనుకూలంగానే ఉంటుందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, శిరోమణి అకాలీదళ్‌పై అసంతృప్తు గురించి తాను వివరిస్తున్నానని, ప్రజల విశ్వాసం ఆప్ చూరగొంటుందని నమ్ముతున్నానని, ప్రజలే దీనిని నిర్ణయిస్తారని చెప్పారు.


యమునా జలాల ప్రక్షాళన...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యమునా జలాల శుద్ధి జరిగి తీరుతుందని కేజ్రీవాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ''యమునా జలాలను శుద్ధి చేయడం నా బాధ్యత. మాకు కొంత సమయం ఇవ్వండి. చేసి చూపిస్తాం. వచ్చే ఎన్నికల నాటికి తప్పనిసరిగా యమునా జలాల ప్రక్షాళన జరుగుతుంది''అని కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.


ఇంధన ధరలపై...

రాజధాని నగరంలో ఇంధనం ధరలు గణనీయంగా తగ్గిస్తామని కేజ్రీవాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ''మేం తప్పనిసరిగా చేస్తాం. లెక్కలు వేస్తున్నాం. ఎంత చేయగలమో అంత చేస్తాం. మేము రూ.50 పెంచి, కేవలం రూ.5 తగ్గించే నీచ రాజకీయాలు చేయం'' అని పరోక్షంగా మోదీ ప్రభుత్వంపై ఆయన విసుర్లు విసిరారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతూ, వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని అన్నారు. కేంద్రం ఎందుకు పట్టుదలకు పోతోంది? రైతుల డిమాండ్లను కేంద్రం ఆమోదించాలి'' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-11T18:51:06+05:30 IST