Punjab Bypolls : సంగ్రూర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి పరాభవం

ABN , First Publish Date - 2022-06-26T20:11:34+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో అత్యంత భారీ విజయం నమోదు చేసుకున్న

Punjab Bypolls : సంగ్రూర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి పరాభవం

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో అత్యంత భారీ విజయం నమోదు చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు మూడు నెలల్లోనే ఎదురు దెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయం చవి చూసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని కోల్పోయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కొద్ది గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరాటంలో శిరోమణి అకాలీదళ్-అమృత్‌సర్ పార్టీ విజయ ఢంకా మోగించింది.


ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి గుర్మయిల్ సింగ్‌పై ఎస్ఏడీ-అమృత్‌సర్ పార్టీ అభ్యర్థి సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ సుమారు 6,800 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దల్వీర్ సింగ్, బీజేపీ అభ్యర్థిగా కేవల్ ధిల్లాన్ పోటీ చేశారు. ధిల్లాన్ జూన్ 4న బీజేపీలో చేరారు. దల్వీర్ సింగ్ ధురి శాసన సభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆప్ అభ్యర్థి గుర్మయిల్ సింగ్ సంగ్రూర్ జిల్లా ఆప్ ఇన్‌ఛార్జి. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. అయినప్పటికీ ఎదురుదెబ్బ తప్పలేదు.


గాయకుడు, రాజకీయ నేత సిద్ధూ మూసే వాలా హత్యానంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందని అనేక మంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. 


ఇదిలావుండగా, వరుస పరాజయాలతో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఇబ్బందులు పడుతోంది. ఆ పార్టీ చీఫ్ సుఖ్‌బిర్ సింగ్ బాదల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2022-06-26T20:11:34+05:30 IST