‘ఆసరా’పై ఆశలు

ABN , First Publish Date - 2020-09-23T06:14:32+05:30 IST

ఏడాది కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న తమ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం

‘ఆసరా’పై ఆశలు

గ్రేటర్‌, మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రచారం

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు

పెండింగ్‌లో భారీగా దరఖాస్తులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఏడాది కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న తమ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 36,963 ఆసరా పించన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో ఆసరా ్దకోసం ఎదిరి చూస్తున్నవారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. త్వరలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, సిద్దిపేట మున్సిపాలిటీలతోపాటు మరికొన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరుగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను మంజూరీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 


వయసు తగ్గిస్తే మరిన్ని దరఖాస్తులు

జిల్లాలో వృద్ధాప్య, వితంతువు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు పలువురు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్‌ మున్సిపాలిటీలో 911 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్‌, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో మొత్తం మూడువేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు మరో ఆరు వేల మంది వరకు ఉన్నారు. ఆసరా పింఛన్లను వృద్ధాప్య విభాగం కింద పింఛన్‌ పొందేందుకు అర్హత వయస్సును ప్రస్తుతం 65 సంవత్సరాలు ఉండగా దాన్ని 57 ఏళ్ళకు కుదిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకుంటే మరో 10 నుంచి 15 వేల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, మరికొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తామందరికి లాభం జరుగనున్నదని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. 


జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల వివరాలు

జిల్లాలో ప్రస్తుతం 44,446 మందికి వృద్ధాప్య, 34,033 మందికి వితంతు, 20,908 మందికి వికలాంగుల పింఛన్లు లభిస్తున్నాయి. 2,775 మంది చేనేత కార్మికులు, 3,683 మంది గీత కార్మికులు, 9,371 మంది బీడీ కార్మికులు, 3,290 మంది ఒంటరి మహిళలు ఆసరా ద్వారా లబ్దిపొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,18,512 మందికి 25 కోట్ల 98 లక్షల 28వేల రూపాయల పింఛన్‌ అందుతున్నది. వీరితోపాటు 2,238 మందికి ఏఆర్‌టీ కింద 45 లక్షల 11 వేలు, 574 మంది పైలేరియా బాధితులకు 11 లక్షల 57వేల రూపాయలు నెలనెలా ఆర్థిక సహాయంగా అందుతున్నది. జిల్లా మొత్తంగా 1,21,324 మందికి ప్రతినెలా 24 కోట్ల 55 లక్షల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తున్నది. మరో తొమ్మిదివేల మందికి సాయం అందితే మరో 2 కోట్ల రూపాయల లబ్ధి చేకూరే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తమకు కూడా లబ్ధి చేకూరేలా చూడాలని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు కోరుతున్నారు. 


Updated Date - 2020-09-23T06:14:32+05:30 IST