ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T05:04:11+05:30 IST

ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు, సంఘాల నాయకులు

  • వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళన 

ఆమనగల్లు : జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆమనగల్లు మండలం ముర్తోజుపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త, దివ్యాంగుల సంఘం నాయకురాలు సూదిని వినోద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆమనగల్లు పట్టణంలో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట బైటాయించారు. ఆశా కార్యకర్తల, ప్రజాసంఘాల ఆందోళనకు ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, కౌన్సిలర్లు కర్నాటి విక్రమ్‌రెడ్డి, సుండూరు ఝాన్సీ శేఖర్‌, విజయ్‌కృష్ణ, కృష్ణయాదవ్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి గోరటి నర్సింహ, జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్‌ కవిత, సీఐటీయూ కడ్తాల మండల కన్వీనర్‌ పుష్ప, చెన్నంపల్లి సర్పంచ్‌ శ్రీనయ్య, నేతలు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా చేసినా అధికారులను నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన నేతలు, ఆశా కార్యకర్తలు ఆసుపత్రి ఎదుట శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌ ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో తహసీల్దార్‌ చందర్‌రావు విషయాన్ని ఫోన్‌లో కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వినోద కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని కలెక్టర్‌ చెప్పినట్లు తహసీల్దార్‌ వివరించడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కండె సాయి, రమేశ్‌నాయక్‌, మేడిశెట్టి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది


సూదిని వినోద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ముర్తోజుపల్లిలో బుధవారం వినోద ఆంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. మృతురాలి భర్త కొండల్‌ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదే విధంగా ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వినోదకు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ జయశ్రీ, వైద్య సిబ్బంది లక్ష్మి, శేఖర్‌, వేణు, శ్వేత తదితరులు పాల్గొన్నారు. వినోద కుటుంబాన్ని ఆదుకోవాలని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో దీన్‌ దయాల్‌కు ఆశా కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-12-03T05:04:11+05:30 IST