రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయొచ్చా?

ABN , First Publish Date - 2022-05-19T16:07:43+05:30 IST

రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్ణయం సరికాదని, దానిని స్వాగతించలేమని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో

రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయొచ్చా?

                         - రాజీవ్‌ హత్య ఘటనలో మృతురాలి కుమారుడి ఆవేదన


పెరంబూర్‌(చెన్నై): రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్ణయం సరికాదని, దానిని స్వాగతించలేమని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన సంధానీబేగం అనే మహిళ కుమారుడు అబ్బాస్‌ వ్యాఖ్యానించారు. రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ 31 ఏళ్ల తర్వాత పేరరివాలన్‌ విడుదలవడంపై అబ్బాస్‌ స్పందించారు. బాంబు దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలు 31 ఏళ్లుగా చిన్నాభిన్నమై జీవిస్తున్నాయన్నారు. ఈ తీర్పు 16 మంది కుటుంబాలను కలచివేసిందన్నారు. ఈ తీర్పు తాము స్వాగతించలేకున్నామన్నారు. ఒక దేశ మాజీ ప్రధానితో పాటు 16 మందిని హతమార్చిన వారికి ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టే విడుదల చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజకీయ అధికారం ఉపయోగించుకొని అతను విడుదలై ఉండవచ్చని, కానీ దేవుడి ముందు అతను ఎప్పుడూ దోషేనని వ్యాఖ్యానించారు. ఒక ప్రధానిని దారుణంగా హతమార్చిన వారిని విడుదల చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదన్నారు. ‘‘వారు తమిళులు కావడం వల్లనే విడుదలయ్యారా? ఎవరేం చేయాలనుకున్నా చేసేస్తారా? రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయవచ్చా? దేశంపై ప్రేమ, అభిమానం ఉన్న వారు దీనిని సమర్థించలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాయో అర్ధం కావడం లేదు. ఇలాంటి సమస్య వారి ఇళ్లలో జరిగితే మంత్రి వర్గం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? మేము సామాన్యులం కాబట్టి ఏం చేయలేరన్న ధైర్యంతో మాకు అన్యాయం చేశారు. ఉదయం నుండి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లివచ్చారా? ఒకరోజు జైలులో ఉంటే తెలుస్తుందని అర్బుదమ్మాళ్‌ అంటున్నారు. అది కూడా నిజమే. కానీ కానీ, 31 ఏళ్లుగా తల్లీతండ్రిని పోగొట్టుకొని కష్టపడుతున్న వారి కుటుంబాలు ఆమెకి గానీ, ప్రభుత్వాలకు గానీ కనిపించడం లేదా?’’ అని నిలదీశారు. ముఖ్యమంత్రిని ఒకటే అభ్యర్థిస్తున్నాను. బాంబుదాడిలో బలైన 16 కుటుంబాలను రక్షించే బాధ్యత కూడా ఆయనదేనని అబ్బాస్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-19T16:07:43+05:30 IST