పొట్టివాడు... గట్టివాడే!

ABN , First Publish Date - 2022-06-26T18:08:29+05:30 IST

అబ్దూ రోజిక్‌... ర్యాపర్‌... అతడు గొంతెత్తి పాట అందుకున్నాడంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ తజిక్‌ గాయకుడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు

పొట్టివాడు... గట్టివాడే!

ఇటీవల ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ కూతురు ఖతీజా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం చెన్నైలో జరిగిన రిసెప్షన్‌లో షెల్వార్‌ సూట్‌, టోపీ ధరించిన ఒక పొట్టివాడు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. రెహమాన్‌ వంటి సంగీత దిగ్గజం ఇంట్లో జరిగిన సంగీత కచేరిలో పాటలు పాడిన అతడు ఎవరో కాదు... ప్రపంచంలోనే అతి పొట్టి గాయకుడిగా పేరుగాంచిన అబ్దూ రోజిక్‌. అతడు మామూలోడేం కాదు మరి..

అబ్దూ రోజిక్‌... ర్యాపర్‌... అతడు గొంతెత్తి పాట అందుకున్నాడంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ తజిక్‌ గాయకుడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అవ్లోడ్‌ మీడియాలో అబ్దూ ర్యాప్‌ గీతాలను ఫాలో అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ యూట్యూబ్‌ ఛానల్‌కు నాలుగు లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్‌ ఉన్నారంటే అతడికి ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థమవుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అబ్దూకు అభిమానులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.


ర్యాపర్‌ సహకారంతో...

చూడటానికి పొట్టిగా కనిపించినప్పటికీ అబ్దూకు 19 ఏళ్లు. తజకిస్తాన్‌లోని గిష్‌దర్వా అనే చిన్నగ్రామంలో ఒక తోటమాలి కుటుంబంలో (2003) పుట్టాడు. చిన్నప్పుడే కొన్ని శారీరక రుగ్మతలుండేవి. కొడుక్కి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతడి తల్లిదండ్రులు నిస్సహాయులుగా ఉండిపోయారు. దాంతో అబ్దూకు వయసొచ్చినా శారీరకంగా ఎదగలేదు. 16 ఏళ్ల వయసులో అతడి బరువు కేవలం 12 కిలోలు మాత్రమే. అలాంటి సమయంలో తజిక్‌ బ్లాగర్‌, ర్యాపర్‌ బరోన్‌ కంటపడ్డాడు ఆ పిల్లాడు. చిన్నప్పుడే అద్భుతంగా పాటలు పాడుతున్న అబ్దూను తనతో పాటు తీసుకెళ్తానని, మంచి గాయకున్ని చేస్తానని అతడి కుటుంబసభ్యులను ఒప్పించాడు. అలా అబ్దూ సొంతూరు నుంచి దుశాంబే నగరానికి మకాం మార్చాడు. బరోన్‌ అతడిని తన దగ్గరే ఉంచుకుని ర్యాప్‌ గీతాల్లోని మెలకువలు నేర్పించాడు. అంతేకాదు... కొన్ని వైద్య పరీక్షలు కూడా చేయించి 50 సెంటీమీటర్లు పెరిగేలా చేశాడు. బరోన్‌ నేతృత్వంలో ర్యాప్‌గీతాల్లో అబ్దూ రాటుదేలాడు. అతడి గళం విభిన్నంగా ఉండటం, పలు ప్రయోగాలు చేయడంతో అనతికాలంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు.


ప్రపంచంలోనే పొట్టి గాయకుడిగా రికార్డుల్లోకెక్కిన అబ్దూ రోజిక్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ గాయకులతో వేదికలు పంచుకున్నాడు. దుబాయిలో జరిగిన ఒక వేడుకలో సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌తో  కలిసి కచేరీ చేశాడు. 


రెహమాన్‌తో కలిసి...

ప్రపంచంలోనే పొట్టి గాయకుడిగా రికార్డుల్లోకెక్కిన అబ్దూ రోజిక్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ గాయకులతో వేదికలు పంచుకున్నాడు. దుబాయిలో జరిగిన ఒక వేడుకలో సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌తో  కలిసి కచేరీ చేశాడు. అతడి టాలెంట్‌కు ముగ్ధుడైన రెహమాన్‌ ఇటీవల తన కూతురు ఖతీజా రెహమాన్‌ పెళ్లి రిసెప్షన్‌లో అబ్దూకు అవకాశం ఇచ్చాడు. వేదికపై ఉన్న ఈ పొట్టి గాయకుడిని చూసి ఆహుతులు ఆశ్చర్యపోయారు. ‘పాపా కహతే హై’ పాటను అద్భుతంగా ఆలపిస్తున్న అబ్దూ దగ్గరికి వెళ్లి రెహమాన్‌ అభినందించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో అందరి దృష్టి అబ్దూపై పడింది. 


గోల్డెన్‌ వీసా...

ఈ తజిక్‌ ర్యాపర్‌ పాటలంటే అరబ్‌ దేశస్తులకు విపరీతమైన క్రేజ్‌. అందుకే అక్కడ తరచూ అబ్దూ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంటారు. తమ దేశాన్ని సందర్శించే అతిథుల్లో కొందర్ని ఎంపికచేసి, పరిమితంగా ప్రత్యేకమైన వీసాను ఇస్తుంటుంది యుఏఈ ప్రభుత్వం. అదే ‘గోల్డన్‌ వీసా’. ఇటీవల అబ్దూకు ‘గోల్డెన్‌ వీసా’ ఇచ్చి గౌరవించింది. ‘‘తజకిస్తాన్‌ నుంచి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి వ్యక్తిగా గర్విస్తున్నా. ఇది నా కెరీర్‌లో అత్యున్నతమైనది. రెండు దేశాలు (యుఏఈ, తజకిస్తాన్‌) గర్వించేలా చేస్తాననే నమ్మకం ఉంది’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు అబ్దూ. వీసా అందుకునేప్పుడు అరబ్‌ దుస్తులు ధరించాడతను. మొత్తానికి ‘ఈ పొట్టివాడు గట్టివాడే’ అంటున్నారు యూట్యూబ్‌లో అబ్దూ పాటలు విన్నవారంతా. 

Updated Date - 2022-06-26T18:08:29+05:30 IST