కోహెడలో అభాసుపాలవుతున్న హరితహారం

ABN , First Publish Date - 2022-05-16T05:06:41+05:30 IST

కోహెడ మండలంలో హరితహారం అభాసుపాలవుతున్నది. ఈ పథకం కింద నాటిన మొక్కలకు నీరుపోసే వారు లేక ఎండిపోతున్నాయి.

కోహెడలో అభాసుపాలవుతున్న హరితహారం
సిసిపల్లిలో అగ్నికి ఆహుతి అయిన హరితహారం చెట్లు

నీరుపోసే వారు లేక ఎండిపోతున్న మొక్కలు

పట్టించుకోని అధికారులు

కోహెడ, మే 15: కోహెడ మండలంలో హరితహారం అభాసుపాలవుతున్నది. ఈ పథకం కింద నాటిన మొక్కలకు నీరుపోసే వారు లేక ఎండిపోతున్నాయి. ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట లక్షలాది రూపాయలు పెట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని జూన్‌, జూలై నెలల్లో నిర్వహిస్తున్నది. ఇందుకుగాను ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంక్‌ను కూడా కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటి సంరక్షణ ఎలా ఉంది, నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయి, సక్రమంగా సంరక్షిస్తున్నారా, లేదా అని అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఒక్కొక్క గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను ప్రభుత్వ, ప్రెవేటు పాఠశాలల, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోను, గ్రామాలల్లో రహదారుల వెంబడి ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటారు. రోడ్ల వెంట నాటిన మొక్కల్లో పదిశాతం మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటుచేసి, మిగిలిన 90 శాతం మొక్కలను గాలికొదిలేశారు. దీంతో మొక్కలను సంరక్షించకపోవడం తదితర కారణాలతో ఎండిపోయాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

అగ్నికి హరితహారం చెట్లు ఆహుతి

హరితహారంలో భాగంగా ఉపాధిహామీలో మండలంలోని చెంచల్‌ చెరువుపల్లి గ్రామంలో మొక్కలను పెంచారు. రోడ్లకు ఇరువైపులా నాటడంతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు మంటల్లో కాలిపోవడంతో అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడేందుకు, వాటిని రక్షించేందుకు దృష్టిపెట్టాల్సిన పంచాయతీ కార్యదర్శులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2022-05-16T05:06:41+05:30 IST