అభినయ సిరి

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

‘‘ఇది నేను నిర్మించుకున్న కలల ప్రపంచం. నటి కావాలనే నా చిన్నప్పటి కోరికను నెరవేర్చుకొనే క్రమంలో...

అభినయ సిరి

తెర వేల్పులను చూసి తనూ ఆ తెరపై తళకుమనాలనుకుంది. లఘుచిత్రాలతో మొదలుపెట్టి... న్యూస్‌రీడర్‌గా మారి... ఆపై సీరియల్స్‌ తలుపు తట్టింది. విభిన్న వేదికల మీద... విలక్షణ అభినయంతో... ‘బిగ్‌ బాస్‌’నూ పడేసింది. ఇప్పుడు ఓటీటీలో ‘బీఎఫ్‌ఎఫ్‌’ వెబ్‌సిరీస్‌తో అలరించడానికి సిద్ధమైన నటి సిరి హనుమంత్‌ను ‘నవ్య’ పలుకరించింది... 


‘‘ఇది నేను నిర్మించుకున్న కలల ప్రపంచం. నటి కావాలనే నా చిన్నప్పటి కోరికను నెరవేర్చుకొనే క్రమంలో... ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాగుతున్న ప్రయాణం. సాగర తీరంలోని విశాఖపట్టణం మాది. సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాకు తొమ్మిదేళ్లప్పుడే మా నాన్న చనిపోయారు. నా జీవితంలో అత్యంత బాధించిన ఘటన అది. అప్పటి నుంచి అమ్మ అన్నీ తానై నన్ను, మా అన్నయ్యను పెంచి పెద్ద చేసింది. నాన్న లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంట్లో రోజు గడవడమే కష్టమయ్యేది. దాంతో పద్ధెనిమిదేళ్లకే వైజాగ్‌లోనే ఉద్యోగం మొదలుపెట్టా... న్యూస్‌ రీడర్‌గా. తరువాత మేం కాస్త కోలుకున్నాం. 

ఎంబీయే ఆపేసి... 

టీవీల్లో సినిమాలు చూస్తూ చూస్తూ నాకు నటనపై ఆసక్తి పెరిగింది. ఆ తారల్లా నేనూ తెరపై కనిపించాలనుకున్నాను. కానీ సినీ పరిశ్రమతో పరిచయం ఉన్నవారెవరూ మా కుటుంబంలో లేరు. అలాగని నా ప్రయత్నాలు ఆపలేదు. ఇరవై వరకు షార్ట్‌ ఫిలిమ్స్‌ చేశాను. బీకాం చదువుతూనే న్యూస్‌ రీడర్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. న్యూస్‌ రీడర్‌గా ఎందుకంటే... సినిమాల్లో చేస్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో ముందు ఏదో రకంగా టీవీలో కనిపించాలని న్యూస్‌ రీడర్‌ కావాలనుకున్నాను. అంతేకాకుండా నలుగురికీ పరిచయం అవుతాం. నటిగా అవకాశాల కోసం ప్రయత్నించవచ్చనుకున్నాను. దాని కోసమే ఎంబీఏ ఆపేసి 2016లో హైదరాబాద్‌కు వచ్చాను. 


అలా వచ్చింది... 

హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా కొంత కాలం పని చేశాను. ఆ సమయంలోనే ‘ఉయ్యాల జంపాల’ సీరియల్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని మా స్నేహితుల ద్వారా తెలిసింది. ఆడిషన్స్‌కు వెళ్లాను. నా అదృష్టమో ఏమో... సెలెక్ట్‌ అయ్యాను. అలా 2017లో నటిగా బుల్లితెరపై నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఐదారు సీరియల్స్‌లో నటించాను. 


‘బిగ్‌ బాస్‌’ పిలుపు...  

సీరియల్స్‌ చేస్తున్న సమయంలోనే ‘హే సిరి’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ఒకటి మొదలుపెట్టాను. అందులో వెబ్‌సిరీస్‌లు చేశా. వాటితో బాగా పేరొచ్చింది. చానల్‌ ప్రారంభించిన ఏడాదికే సబ్‌స్ర్కైబర్స్‌ ఆరు లక్షలు దాటారు. అస్సలు ఊహించలేదు... అంత తక్కువ కాలంలో అన్ని లక్షలమందికి చేరువ అవుతానని. దాని ద్వారానే నాకు ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-5లో పాల్గొనే అవకాశం వచ్చింది. నాగార్జున గారు హోస్ట్‌. ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌లో ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ నేను ఎప్పటికీ మరిచిపోలేను. బాగుంటావని, చాలా యాక్టివ్‌గా ఉంటావని అనేవారు. ‘తను మాట్లాడితే మా ఇంటి వరకు వినబడుతుంది’ అని ఒక ఎపిసోడ్‌లో సరదాగా అన్నారు.

  

ఓటీటీలో... తొలిసారి... 

‘బిగ్‌ బాస్‌’ వల్ల నా యూట్యూబ్‌ చానల్‌కు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ కోసం ‘హ్యాష్‌ట్యాగ్‌ బీఎఫ్‌ఎఫ్‌’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా. ‘బీఎఫ్‌ఎఫ్‌’ అంటే ‘బెస్ట్‌ ఫ్లాట్‌మేట్‌ ఫరెవర్‌’. నేను, రమ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నాం. ఉద్యోగం కోసం ఊరు వదిలి నగరానికి వచ్చిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. అలా వచ్చిన అమ్మాయిలు రూమ్‌మేట్స్‌ ఎలా అయ్యారు? తరువాత ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ల జీవనగమనం ఎలా సాగుతుంది? అనే అంశాలతో ఆసక్తికరంగా నడిచే వెబ్‌సిరీస్‌ ఇది. ఓటీటీలో చేయడం ఇదే మొదటిసారి. ఇందులో నాది పరిణతి చెందిన అమ్మాయి... నిత్య పాత్ర. ఏదైనా పని చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తుంది తను.  


అదే నచ్చింది... 

ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో నాకు బాగా నచ్చింది ‘అగ్నిసాక్షి’ సీరియల్‌. నాకే కాదు... తెలుగు ప్రేక్షకులందిరికీ నన్ను చేరువ చేసిన సీరియల్‌ అది. టాప్‌ రేటింగ్స్‌తో సాగింది. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒక్కటే... సినిమాల్లో నటించాలి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఏ నటికైనా అంతిమ లక్ష్యం అదే కదా... వెండితెరపై అలరించాలని! ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. అలాగే తమిళంలో కూడా హీరోయిన్‌గా చేయాలనేది నా కోరిక. దాని కోసం ప్రయత్నిస్తున్నాను. గతంలో సినిమాల్లో నటించాను కానీ... అవి డైలాగులు లేని చిన్న చిన్న పాత్రలు. 


ఆమే నా బలం... 

పరిశ్రమలోకి వచ్చాక బాధపడిన సందర్భాలంటూ ఏవీ లేవు. ఎందుకంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే నేను ఎప్పుడూ దృష్టిపెడతాను. మిగిలినది మన చేతుల్లో ఉండదు కదా! అయితే అనుకున్న అవకాశాలు చేజారిపోయినప్పుడు అందరిలా నాకూ నిరాశ కలుగుతుంది. అలాగని దాన్నే తలుచుకొని బాధపడుతూ కూర్చోకుండా నా లక్ష్యం కోసం ప్రయత్నిస్తాను. అంతేకానీ వెనకడుగు వేయలేదు. ఇది మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. నా బలం, నా స్ఫూర్తి ఆమే.

హనుమా 


గర్వంగా అనిపిస్తుంది...

నేను కోరుకున్న దారిలో నా కెరీర్‌ హాయిగా సాగిపోతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే నటిగా ఇంకా ఎంతో సాధించాలి. మరింత ఎత్తుకు ఎదగాలి. ‘నాన్న లేకపోయినా ఎక్కడా కింద పడిపోకుండా నెట్టుకొంటూ వచ్చావ’ని మా బంధువులు, పరిశ్రమలోనివారు అభినందిస్తుంటారు. అది విన్నప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ మాటలు నాకు ప్రేరణనిస్తాయి. ప్రోత్సహిస్తాయి. 


ఆ ఇద్దరే...        

ఖాళీ దొరికితే ఇంట్లోనే ఉంటాను. టీవీ చూస్తుంటాను. లేదంటే మొబైల్‌లో ఉంటాను. బాగా తింటాను. అంతే. నాకు నచ్చిన హీరోలు... పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు. హీరోయిన్స్‌ అయితే సినిమా సినిమాకూ మారుతుంటారు. ఎందులో ఎవరు బాగా చేస్తే అప్పటికి వాళ్లే నా ఫేవరెట్‌! 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST