అభివృద్ధి వైపు అడుగులు

ABN , First Publish Date - 2022-08-10T05:15:38+05:30 IST

అభివృద్ధి వైపు అడుగులు

అభివృద్ధి వైపు అడుగులు
మహబూబాబాద్‌ నర్సంపేట బైపాస్‌లో పూర్తయిన జంక్షన్‌ అభివృద్ధి పనులు, మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటెన్‌

మూడు మునిసిపాలిటీల్లో సుందరీకరణ

ప్రధాన రహదారుల్లో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు 

మానుకోట, డోర్నకల్‌లో జంక్షన్లల అభివృద్ధి 

తొర్రూరు. మరిపెడల్లో జంక్షన్‌లకు ప్రతిపాదనలు 

జిల్లా కేంద్రంలో మూడు ఆర్చీలకు ప్రతిపాదనలు 


మహబూబాబాద్‌ టౌన్‌, ఆగస్టు 9 : జిల్లాలోని మునిసిపాలిటీలు సుందరీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. దినదినాభివృద్ధి చెంది మేజర్‌ గ్రామ పంచాయతీ హోదాల నుంచి మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ కావడంతో ఆయా పట్టణాలను సుందరీకర ణగా తీర్చిదిద్ధేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని మహబూబాబాద్‌తో పాటు కొత్తగా ఆవిష్కృతమైన మరిపెడ, తొర్రూరులో ప్రధాన రహదారుల విస్తరణతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు, డోర్నకల్‌లో మాత్రం బైపాస్‌లోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పంపుబావి తండా వరకు 300 మీటర్ల వరకు సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లను ఏర్పాటు చేశారు. మానుకోట, డోర్నకల్‌లో కొన్ని జంక్షన్‌లను పూర్తి చేసి వాటర్‌ ఫౌంటెన్‌లు పెట్టగా తొర్రూరు, మరిపెడలో జంక్షన్‌ల అభివృద్ధికి ప్రతిపాదలను సిద్ధం చేశారు. మునిసిప ల్‌ కేంద్రాల్లో రాత్రివేళల్లో సెంట్రల్‌ లైటింగ్‌తో పాటు డివైడర్లలో నాటిన మొక్కలు, ఫౌంటెన్లతో మిర్రుమిట్లు గొల్పుతూ సర్వాంగ సుందరంగా కన్పించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దినదినాభివృద్ధి చెంది జిల్లా కేంద్రంగా ఆవిష్కృతమైన మానుకోటలో మూడు ఆర్చీలు (స్వాగత తోరణాలు) నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 


జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌.. 

జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబాబాద్‌ పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు దాదాపుగా పూర్తి చేశారు. పాత బజారులోని రైల్వేస్టేషన్‌ నుంచి బస్డాండ్‌ సెంటర్‌ వరకు అక్కడి నుంచి నర్సంపేట బైపాస్‌ మీదుగా వ్యవసాయ మార్కెట్‌ నుంచి మళ్లీ రైల్వే స్టేషన్‌ వరకు పూర్తి స్థాయిలో రోడ్ల విస్తరణ పూర్తయి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కొత్త బజారులో జిల్లా ఆస్పత్రి నుంచి తహసీల్దార్‌ ఆఫీస్‌ మీదుగా మూడు కొట్ల సెంటర్‌, ఫాతిమా హైస్కూల్‌ వరకు, మరో పక్క మూడు కొట్ల సెంటర్‌ నుంచి కలెక్టర్‌ రోడ్‌ మూల మలుపు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు పూర్తయ్యాయి. కొత్తగా వివేకానంద సెంటర్‌ నుంచి మునిసిపాలిటీల్లో విలీనమైన ఈదులపూసపల్లి వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. కురవి రోడ్‌లోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జీ (ఆర్వోబీ)పై కూడా లైట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పత్తిపాక రోడ్డు నుంచి రజాలిపేట మీదుగా కురవి రోడ్‌ వరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్‌ చేశారు. ప్రధాన రహదారులన్నీ విస్తరణతో సర్వాంగ సుందరంగ రూపుదిద్దుకున్నాయి. 


మానుకోటలో ఏనిమిది జంక్షన్‌లతో అభివృద్ధి 

మహబూబాబాద్‌ మునిసిపల్‌ కేంద్రంలో ఏనిమిది జంక్షన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తొలుత ఇల్లందు బైపాస్‌లోని జ్యోతిబాపూలే, వ్యవసాయ మార్కెట్‌ వద్ద వైఎస్సార్‌, నర్సంపేట బైపాస్‌లో జంక్షన్‌ (సర్కిల్‌)ల పనులను పూర్తి చేశారు. వైఎస్సార్‌ విగ్రహం, జ్యోతిబాపూలే జంక్షన్‌లలో వాటర్‌ ఫౌంటెన్లను, నర్సంపేట బైపాస్‌లో జింకల చిత్రాలను ఏర్పాటు చేశారు. వివేకానంద, అంబేద్కర్‌ విగ్రహాం వద్ద పనులు సాగుతున్నాయి, ఒక్కొక్క జంక్షన్‌ అభివృద్ధి పనులకు రూ.20 లక్షల చొప్పున నిదులు కేటాయించారు. కొత్తగా మూడు కొట్ల సెంటర్‌, కోర్టు జంక్షన్‌, కురవి ప్లైఓవర్‌ వద్ద జంక్షన్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే రహదారులు జమాండ్లపల్లి, కురవిరోడ్‌, తొర్రూరు రోడ్లలో స్వాగత తోరణాలు (ఆర్చీలు) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


ఆ మూడు మునిసిపాలిటీల్లో ఇలా..

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన తొర్రూరు. మరిపెడ మునిసిపాలిటీ ప్రధాన రహదారుల్లో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లను నిర్మించారు. తొర్రూరులో అంబేద్కర్‌, మార్కెట్‌ సెంటర్లు, మరిపెడలో రాజీవ్‌గాంధీ, కార్గిల్‌ సెంటర్లలో జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక డోర్నకల్‌లో బైపాస్‌లోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పంపుబావితండా వరకు 300 మీటర్ల  మేర సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లను ఏర్పాటు చేశారు. రూ.27లక్షల నిధులతో ఎన్టీఆర్‌, జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద జంక్షన్లను అభివృద్ధి చేసి వాటర్‌ ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. మొత్తానికి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు సుందరీకరణ దిశగా పరుగులు తీస్తున్నాయి. 


సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళికలు : ఉపేందర్‌, మునిసిపల్‌ డీఈ, మహబూబాబాద్‌ 

జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ పాలకమండలి సూచనలతో మహబూబాబాద్‌ పట్టణాన్ని అభివృద్ధి చేస్తునే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జంక్షన్‌లు, స్వాగత తోరణాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మునిసిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని వేగవంతం చేస్తున్నాం. జిల్లా కేంద్రంగా వెలుగొందుతున్న మానుకోటలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల పనులు పూర్తయ్యాయి. కొన్ని జంక్షన్‌ల పనులు పూర్తి కాగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-08-10T05:15:38+05:30 IST