అద్దె భవనాల్లో ‘ఆబ్కారీ’

ABN , First Publish Date - 2022-08-19T06:18:48+05:30 IST

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఆ శాఖ ఆదాయం నుంచే భవనాలు, వాహనాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో 102 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా సుమారు రూ.130 కోట్ల ఆదాయం వస్తోంది.

అద్దె భవనాల్లో ‘ఆబ్కారీ’

జిల్లాలో సొంత భవనాలు, వాహనాలు కరువు

ప్రతి నెలా రూ.లక్షకు పైగా అద్దె చెల్లింపులు

మద్యం విక్రయాలపై రూ.130 కోట్ల ఆదాయం

అయినా సౌకర్యాలు కరువు

సుభాష్‌నగర్‌, ఆగస్టు 18: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఆ శాఖ ఆదాయం నుంచే భవనాలు, వాహనాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో 102 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా సుమారు రూ.130 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ప్రభుత్వం ఈ శాఖపై చిన్నచూపు చూస్తోంది. తమ శాఖ నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ సరైన వసతులు, భవనాలు కల్పించకపోవడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లోనే..

జిల్లా వ్యాప్తంగా కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో కొన్ని కార్యాలయాలకు యజమానులు నోటీసులు సైతం జారీ చేసినట్లు సమాచారం. ఎక్సైజ్‌ శాఖలో నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఐదు స్టేషన్‌లు ఉన్నాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, మోర్తాడ్‌, భీమ్‌గల్‌ స్టేషన్లలో ఏ ఒక్క స్టేషన్‌కు కూడా సొంత భవనం లేదు. వీటితో పాటు ఎక్సైజ్‌ ప్రధాన కార్యాలయమైన డిప్యూటీ కమిషనర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు లేక అద్దె భవనాలకే పరిమితమయ్యారు. చాలా ఏళ్లుగా అద్దె భవనాల్లోనే పరిపాలన కొనసాగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ సుమారు లక్ష రూపాయల్లో అద్దె చెల్లిస్తున్నారు. అవికూడా కొన్ని శిథిలావస్థలో ఉన్న భవనాలే. ఆర్మూర్‌లో సైతం అద్దెభవనంలో కొనసాగుతుండడంతో గతంలో ఇంటి యజమాని తన ఇంటిని ఖాళీ చేయాలని పలుమార్లు కలెక్టరేట్‌కు ఉన్నతాధికారులకు విన్నవించారు. ప్రజావాణిలో సైతం అనేకసార్లు ఫిర్యాదు చేశారు. 

నూతన కలెక్టరేట్‌లో కానరాని ఆబ్కారీ కార్యాలయం

నగరంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌లో ఆబ్కారీ శాఖకు కార్యాలయాన్ని కేటాయించలేదు. నూతన కలెక్టరేట్‌ భవనంలో వివిధ శాఖలకు సంబంధించిన వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలతో స్థలం సరిపోదని పై అధికారులకు విన్నవించడంతోనే ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన కార్యాలయాలు అందుబాటులో లేనట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన కలెక్టరేట్‌ భవనాలు నిర్మించి అందులోనే అన్ని శాఖల విభాగాలు ఉండేట్లు  రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అయితే జిల్లాలో మాత్రం నూతన కలెక్టరేట్‌ భవనంలో ఎక్సైజ్‌ శాఖకు ఎలాంటి కార్యాలయానికి చోటు లేనట్లు సమాచారం. కాగా, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, మోర్తాడ్‌ స్టేషన్‌లకు నూతన బిల్డింగ్‌లు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

నగర ఎక్సైజ్‌ కార్యాలయానికి నోటీసులు..

జిల్లా కేంద్రంలోని నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ కార్యాలయానికి జడ్పీ కార్యాలయ ఆవరణలో చివరన ఒక బిల్డింగ్‌ను  కేటాయించారు. కొన్నేళ్లుగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ కార్యకలాపాలు అక్కడే కొనసాగుతున్నాయి. సుమారు రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ఇటీవలే జిల్లా పరిషత్‌ అధికారులు ఎక్సైజ్‌ కార్యాలయానికి అద్దె చెల్లించాలని నోటీసులు జారీచేశారు. సుమారు రెండులక్షలకు పైగా అద్దె బాకీ ఉన్నట్లుగా సమాచారం. ఇదికూడా గత జూన్‌ నెలలో కురిసిన వర్షానికి పూర్తిగా పాడైపోయింది. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌ కావడంతో అక్కడ ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అప్పుడప్పుడు పెచ్చులూడి పడుతుండడంతో ఉద్యోగులు తమ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు పలుమార్లు ఉన్నతాధికారులకు తమగోడును విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌ నుంచి వేరే భవనానికి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

నూతన కలెక్టరేట్‌లో కార్యాలయం కేటాయించాలి..

నిజామాబాద్‌ స్టేషన్‌కు నాగారంలోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భూమిని కేటాయించినప్పటికీ దూరం కావడంతో అప్పుడు ఉన్న అధికారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థలం కథ మరుగునపడింది. ప్రస్తుతం నూతన కలెక్టరేట్‌ ప్రారంభానికి సిద్ధం కావడంతో అక్కడికి వెళ్లే కార్యాలయాల్లో ఎక్సైజ్‌ శాఖకు కూడా కేటాయించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-19T06:18:48+05:30 IST