Omicron : ఆ రోజులు మళ్లీ వద్దు.. మేలుకోకుంటే ముప్పే.. ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2021-12-04T16:56:12+05:30 IST

ఆ రోజులు మళ్లీ వద్దు.. మేలుకోకుంటే ముప్పే.. ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

Omicron : ఆ రోజులు మళ్లీ వద్దు.. మేలుకోకుంటే ముప్పే.. ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

  • మాస్కుల వినియోగంపై నిలువెత్తు నిర్లక్ష్యం
  • కనీస నిబంధనలు పట్టించుకోని కొందరు
  • ప్రతి వంద మంది వాహనదారుల్లో 20 మందికి..
  • ప్రతి 50 మంది ఆటోడ్రైవర్లలో 40 మందికి ఉండని మాస్కులు 

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భాగ్యనగరవాసులను మరో కొత్త రకం వేరియంట్‌ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమైక్రాన్‌ ఆనవాళ్లు నగరంలోకి చేరాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కరోనా రెండోదశ నాటి ఆందోళనకర పరిస్థితులు ‘ఒమైక్రాన్‌’ వల్ల ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కొవిడ్‌ రెండు డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు. మాస్క్‌ లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద ‘ఆంధ్రజ్యోతి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ‘ఎంతమంది మాస్కులు ధరించి వెళ్తున్నారు. ఎందరు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారా లేదా’ అనే అంశాలను గుర్తించేందుకు ముందుకు కదిలింది. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.


పరిశీలన సాగిందిలా..

- మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ననాల్‌నగర్‌, ఆబిడ్స్‌ చౌరస్తా, హయత్‌నగర్‌, జీడిమెట్ల ట్రాఫిక్‌ కూడళ్లు, కూకట్‌పల్లిలోని వివేకానంద జాతీయ రహదారిపై ‘ఆంధ్రజ్యోతి’ బృందం మాస్కులు వినియోగిస్తున్న వాహనదారులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల 500 మందిని గమనించింది. 390 మంది వరకు మాస్కులు పెట్టుకోగా మిగతా 100మంది మాస్క్‌ లేకుండానే బైక్‌లపై రయ్‌మని దూసుకెళ్లారు. మరో 10 మందికి మాస్క్‌ ఉన్నా సరిగ్గా ధరించలేదు. ఆయా చోట్ల మొత్తం 80మంది ఆటోడ్రైవర్లను పరిశీలించగా 65 మంది మాస్కులు లేకుండా, మరో 15మందికి ఉన్నప్పటికీ సరిగ్గా ధరించక వాహనాలను నడిపారు.


- మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 వరకు మాసబ్‌ట్యాంక్‌, కేపీహెచ్‌బీ కాలనీ, మలక్‌పేట్‌ నల్లగొండ చౌరస్తా, ఎల్‌బీనగర్‌ కూడలిలో మరో 400 మంది వాహనదారులను పరిశీలించింది. 330మంది మాస్కులు ధరించగా 70మందికి కనిపించలేదు. ఆయా చోట్ల 60 మంది ఆటోడ్రైవర్లను పరిశీలించగా 35 మంది పెట్టుకుని కనిపించగా 25 మందికి అసలే లేవు.


- మధ్యాహ్నం 2.40 నుంచి 3.40 వరకు తెలుగుతల్లి చౌరస్తా, అల్కాపురి, కేపీహెచ్‌బీ టెంపుల్‌, జేఎన్‌టీయూ బస్‌స్టాప్‌ వద్ద 400 మంది వాహనదారులను గమనించగా దాదాపు 310 మంది వరకు మాస్కులు ధరించారు. మరో 40 మంది హెల్మెట్‌ ఉందని వదిలేశారు. మిగతా 50 మంది అసలే పెట్టుకోని పరిస్థితి కనిపించింది. 50 మంది ఆటోడ్రైవర్లలో 20 మంది పెట్టుకోగా 20మంది అసలే ధరించలేదు. మరో 10 మంది మాస్కులున్నా సరిగ్గా ధరించలేదు.


- మధ్యాహ్నం 3.50నుంచి సాయంత్రం 4.50 వరకు రాణిగంజ్‌, ఖైరతాబాద్‌ చౌరస్తా, లక్డీకపూల్‌, కూకట్‌పల్లి పరిధిలోని వీవీ నగర్‌లో 400 మంది వాహనదారులను పరిశీలించగా దాదాపు 340 మందికి మాస్కులు కనిపించాయి. మరో 20మందికి ఉన్నా సరిగ్గా ధరించలేదు. కాగా, 40 మందికి అసలే కనిపించలేదు. 40 మంది ఆటోడ్రైవర్లలో 25 మందికి మాస్కులున్నాయి. మరో 15 మందికి కనిపించలేదు.


జరిమానాలు ఎక్కడ..?

నగరంలోకి ఒమైక్రాన్‌ ఆనవాళ్లు ప్రవేశించినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మాస్కులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం గురువారం హెచ్చరించింది. ట్రాఫిక్‌ జంక్షన్ల సమీపంలో, రోడ్ల పక్కన వాహనదారులను గుర్తించి మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తామని.. పేర్కొంది. జరిమానాలు గురువారం నుంచే అమలులోకొస్తాయని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పినప్పటికీ శుక్రవారం వాటికి సంబంధించిన ప్రత్యేక చర్యలు ఎక్కడా కనిపించలేదు.


ప్రయాణికులకు జరిమానా

ఒమైక్రాన్‌ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొవిడ్‌ నియమాలను కట్టుదిట్టం చేస్తున్నారు. మాస్కులు లేకుండా స్టేషన్లకు వస్తున్న వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పలువురు ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రూ.200 చొప్పున జరిమానా విధించారు.


జాగ్రత్తలు తప్పని సరి..

- ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. 

- చేతులను శుభ్రం చేసుకోవడం, శానిటైజ్‌ వినియోగించడం మరిచిపోవద్దు

- వృద్ధులు, గర్భిణులు, కొమార్బిటీస్‌ వారి వద్ద కాస్త దూరాన్ని పాటించాలి. - డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, న్యూరాలజిస్ట్‌, అపోలో ఆస్పత్రి


దగ్గు, గొంతునొప్పి, శరీరపు నొప్పులు ఉంటే..

- కొత్తరకం ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి సమస్యలు ఉండకపోవచ్చు. 

- జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శరీరపు నొప్పులు  ప్రధాన లక్షణాలుగా ఉండే అవకాశముంది.

- ఇలాంటి సమస్యలు కనిపిస్తే వైద్యుడిని సంప్రందించాలి. 

- రెండు డోసుల వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి.

- వ్యాక్సిన్‌ వైర్‌సను నిరోధించలేదు కానీ, ప్రాణాలను రక్షిస్తుంది. 

- వ్యాధి తీవ్రత, ప్రాణాపాయనుంచి రక్షించే సామర్థ్యం వ్యాక్సిన్‌కు ఉంది. 

- ఫంక్షన్లు, మాల్స్‌, మార్కెట్లు తదితర రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి.

- ప్రస్తుత సమయంలో ఫంక్షన్లకు హాజరు కాకపోవడం మంచిది. - డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌, మెడికవర్‌ ఆస్పత్రి


18 జంక్షన్లలో..

నగరంలోని 18 జంక్షన్లలో ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించగా ప్రతి వంద మందిలో 18-20 మంది వరకు మాస్కులు పూర్తిగా ధరించలేదు. మరో పది మంది మాస్కులు ఉన్నప్పటికీ కిందకు జారవిడిచి వాహనాలు నడుపుతూ కనిపించారు. హెల్మెట్‌ ధరించిన ప్రతి 50 మందిలో 30 మంది విధిగా మాస్కులు పెట్టుకోగా, మరో 20 మంది ధరించకపోవడం కనిపించింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటోడ్రైవర్లు ప్రతి 50 మందిలో 40 మంది మాస్కులు లేకుండా వాహనాలను నడుపుతుండడం కనిపించింది. వాహనాలు నడుపుతున్నారు. తొందరలో మాస్కులు పెట్టుకోలేకపోయామని కొందరు డ్రైవర్లు చెప్పుకొచ్చారు. ‘టీకా వేసుకున్నాం.. మా దగ్గరకు ఎలాంటి వైరస్‌ రాదు’ అంటూ మరికొందరు వింత సమాధానాలు చెప్పారు. 

Updated Date - 2021-12-04T16:56:12+05:30 IST