దమ్మున్న ఛానెల్.. పదకొండేళ్ల ప్రస్థానం

ABN , First Publish Date - 2020-10-15T23:43:44+05:30 IST

హైదరాబాద్: అక్షరం వీక్షణంగా మారింది. సమస్యల ముద్రణ నుంచి ప్రజల గొంతుక అయ్యింది. వార్తలను శ్వాసిస్తూ వాస్తవాలకు ప్రతిబింబంగా రూపుదిద్దుకుంది. ఆయుధమైన అక్షరం.. వియ్‌ రిపోర్ట్‌..

దమ్మున్న ఛానెల్.. పదకొండేళ్ల ప్రస్థానం

హైదరాబాద్: అక్షరం వీక్షణంగా మారింది. సమస్యల ముద్రణ నుంచి ప్రజల గొంతుక అయ్యింది. వార్తలను శ్వాసిస్తూ వాస్తవాలకు ప్రతిబింబంగా రూపుదిద్దుకుంది. ఆయుధమైన అక్షరం.. వియ్‌ రిపోర్ట్‌.. యూ డిసైడ్‌ అంటూ ప్రేక్షకులకే ఛాయిస్ ఇచ్చింది. అలా.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆవిర్భవించి పదకొండేళ్లు గడిచాయి. దమ్మున్నఛానెల్‌ పదకొండేళ్ల ప్రస్థానంపై స్పెషల్‌ ఫోకస్‌. 


సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే రోజున పురుడు పోసుకుంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరయ్యింది. వాస్తవాల ప్రసారంతో జనం ఇళ్లల్లో స్థానం సంపాదించుకుంది. నిఖార్సయిన నైజం కారణంగా ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటంకాలు చవిచూసింది. కానీ, ప్రతీ ఆటుపోటునూ గుండెధైర్యంతో ఎదుర్కొంది. నిబ్బరంగా రొమ్ము విరుచుకొని నిలబడుతోంది.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. సమాచార సామ్రాజ్యంలో ఈ పేరే ఓ ధైర్యం. ఈ పేరే ఓ భరోసా. నిజమైన, నిఖార్సయిన సమాచార వ్యాప్తికి దివిటీ. వేగవంతమైన వార్తల ప్రసారానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఉన్నతమైన ఆశయాలే లక్ష్యంగా, సమున్నతమైన సమాచార స్రవంతే ధ్యేయంగా దూసుకెళ్తున్న ఏబీఎన్‌ తన ప్రయాణంలో పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకుంది.




ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంటేనే దమ్మున్న చానెల్‌. వార్తా ప్రసారాల్లో దుమ్ము రేపుతున్న ఛానెల్‌.. అక్రమార్కుల పాలిట గాండీవమై గర్జించే ఛానెల్‌. బాధితులకు భరోసా ఇచ్చే విషయంలో మనసున్న ఛానెల్‌. నిర్బంధాలను గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ.. వాస్తవాలను వీక్షకుల చెంతకు చేరుస్తూ నిలువెల్లా సాహసాన్ని నింపుకున్న న్యూస్‌ ఛానెల్‌. చెప్పుకోవడం కాదు. ప్రజలే నిండు మనసుతో ప్రశంసల్లో ముంచెత్తుతున్న ఛానెల్‌. వీక్షకుల ఆశీస్సులతో, ఆదరణలతో  దూసుకెళ్తోంది.


ఆపత్కాలంలో ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు అండగా నిలిచే ధీమా. అవసరార్థులకు ఆసరానిచ్చే కథనాలకు చిరునామా. వాస్తవమైన వార్తల ఖజానా. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రయోజనం ఏదైనా అన్నికోణాలనూ ఆవిష్కరించే జర్నలిజానికి నిలువుటద్దం ఏబీఎన్‌. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్నిరకాల వార్తలకూ అసలైన వేదిక ఏబీఎన్‌. 


ప్రజల హక్కు అయిన సమాచారాన్ని.. వక్రీకరించకుండా, వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలినుంచీ ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా.. ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో 'డేర్‌ డెవిల్ ఇమేజ్‌'ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబీఎన్‌ పేరెత్తగానే దమ్మున్న ఛానెల్‌గా, దుమ్మురేపే ఛానెల్‌గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.


ప్రభుత్వమైనా, పార్టీ అయినా, మఠమైనా, మందిరమైనా, సీఎం అయినా, స్వామీజీ అయినా.. ఆఖరికి రాజ్యాంగ పరమైన రక్షణల మాటున దాగి ఉన్నా.. దమ్మున్న చానెల్‌ దుమ్ము దులపకుండా  ఉండలేదు. అలా.. సాహసం సవ్యసాచి అయ్యింది. జనం గొంతే ఆయుధంగా ముందుకెళ్తోంది.   దమ్మున్న వార్తలకు కేరాఫ్‌ అడ్రస్‌లా ఓ డెస్టినేషన్‌ సంపాదించింది. సామాజిక, రాజకీయ సంక్షోభాలలో ఒక దిక్సూచిగా దశా దిశా నిర్దేశం చేస్తోంది. జూలు విదిల్చి జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించింది. ఫలితంగా జర్నలిజంలో అంత దూకుడు, అంత సాహసం, అంతటి నిర్భీతి, అంతటి నిబద్ధత అదివరకు కనిపించలేదని విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.


వస్తేరానీ కష్టాల్ అనుకుంటుందే గానీ, సాహసాన్ని ఏనాడూ కోల్డ్‌ స్టోరేజీలో దాచిపెట్టలేదు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. పదకొండేళ్ల ప్రస్థానంలో రెండు నిషేధాలను నిబ్బరంగా ఎదుర్కొంది. ఆ గుండె నిబ్బరానికి తోడు ఏబీఎన్‌ తరపున ప్రేక్షకుల పోరాటం సత్ఫలిచ్చింది. నిషేధపు సంకెళ్లు పటాపంచలైపోయాయి. ఏ ఉపద్రవం ఎదురైనా ప్రజాపక్షమే వహిస్తోంది. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడి..  సమాచార స్రవంతిని ప్రసారం చేస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


జనం అభిప్రాయాన్ని నిఖార్సుగా వినిపిస్తోంది. వార్తా ప్రసారంలో, అక్రమాలు, లోగుట్టుల వెలికితీతలో సంచలనాలు సృష్టిస్తోంది. నిర్బంధాలకు భయపడబోదని ఆచరణలోనే చూపిస్తోంది. జనం అభిప్రాయాలను నిర్భీతిగా చెప్పడానికే ఉన్నామని మొదటినుంచీ నమ్ముతోంది. సమాచార స్వేచ్ఛను శ్వాసిస్తోంది. పది కిలో మీటర్ల లోతున పాతరేస్తామన్న వారితోనూ పోరాడి నిలిచింది. అధికారం మాటున ప్రేక్షకులకు దూరం చేయాలనే కుయుక్తులనూ ధీటుగా ఎదుర్కొంది. ఎక్కడా తత్తర పాటుకు తావు లేకుండా, ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా.. తనదైన ప్రమాణాలను పాటిస్తూ.. బాధ్యతను నిర్వర్తిస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి నిర్బంధం విధించినప్పుడు, ఛానెల్‌ను ప్రేక్షకుల దరికి చేరకుండా అడ్డుకున్నప్పుడు నిజాయితీగా, నిర్భయంగా పోరాడింది. కోర్టు ఆదేశాల మేరకు న్యాయబద్ధంగా తిరిగి వీక్షకులను చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలే చైతన్యవంతులయ్యారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కోసం జనమే రోడ్డెక్కారు. కొట్లాడి మరీ తమ ఛానెల్‌ ప్రసారాలను సాధించుకున్నారు.


-సప్తగిరి గోపగాని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.



Updated Date - 2020-10-15T23:43:44+05:30 IST